సిరియా నుంచి పలాయనం! | Sakshi Editorial On Syria Issue | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 22 2018 12:41 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Sakshi Editorial On Syria Issue

ఏడేళ్లుగా ఆగకుండా సాగుతున్న నరమేథం కారణంగా మరుభూమిని తలపిస్తున్న సిరియాను వదిలిపోవాలని అమెరికా తీసుకున్న ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆ విధ్వంసానికి... అక్కడ అనుక్షణం వినిపిస్తున్న చావుకేకకూ కర్త, కర్మ, క్రియ కూడా అమెరికాయే. అక్కడ ‘నియంత’ అల్‌ బషర్‌ అసద్‌ను దేశాధ్యక్ష పీఠంనుంచి దించే పేరిట కొన్ని ముఠాలు... ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామంటూ మరికొన్ని ముఠాలు సాగిస్తున్న జన హననం మాటలకందనిది. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించి తరచు విడుదలయ్యే ఛాయా చిత్రాలు, వీడియోలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. సిరియా నుంచి అమెరికాతో సహా అన్ని దేశాల సేనలూ వైదొలగాలని ప్రజాస్వామికవాదులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడి ప్రజలు తమ భవితవ్యాన్ని తాము నిర్ణయించుకునేందుకు ఐక్య  రాజ్యసమితి పర్యవేక్షణలో ఒక హేతుబద్ధమైన ప్రాతిపదికను కల్పించాలని కోరుతున్నారు. ట్రంప్‌ నిర్ణయానికి అలిగిన రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ పదవినుంచి వైదొలగారు. ‘తన అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తిని ఈ పదవిలో కూర్చోబెట్టే హక్కు ట్రంప్‌కి ఉంది. అందుకే తప్పుకుంటున్నాను’ అని మాటిస్‌ చేసిన ప్రకటన పాలక రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. 

ఇంతకూ ట్రంప్‌ నిర్ణయం వెనకున్న కారణమేమిటి? అక్కడ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)ను తుడిచిపెట్టే పని పూర్తయిందని, అలాగే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం విదేశాల్లోని సేనల్ని వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేస్తున్నారు. కానీ ఏడు నెలల క్రితం కూడా తాను డాంబికాలు పోయిన సంగతిని ఆయన మరుస్తున్నారు. అమెరికా, రష్యాలు రెండూ  పరస్పరం కాలుదువ్వడం, 48 గంటల్లో అంతు చూస్తానంటూ ట్రంప్‌ తన లాటిన్‌ అమెరికా దేశాల పర్యటనను సైతం రద్దు చేసుకోవడం అందరికీ గుర్తుంది. నిజానికి ఇప్పుడు ట్రంప్‌ వెనక్కి పిలి పిస్తున్నది పదాతి దళాలను మాత్రమే. ఆ దళాల్లో 2,000మంది సైనికులున్నారు. వీరు యుద్ధ క్షేత్రంలో సిరియా అనుకూల ముఠాలతో నేరుగా పోరాడి చాన్నాళ్లయింది. అమెరికా వైమానిక దళమే యుద్ధంలో చురుగ్గా ఉంది. వాస్తవానికి అక్కడ ప్రధానంగా అసద్‌ పాలనను వ్యతిరేకిస్తున్న కుర్దులు, సున్నీలే యుద్ధంలో మునిగి తేలుతున్నారు.

సిరియాలో ఇరాన్‌ ప్రభావం పెరిగితే తమకు ముప్పు తప్పదని భావిస్తున్న సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్‌లు కూడా మందలుగా అక్కడికి సాయుధ ముఠాల్ని పంపుతున్నాయి. సున్నీల్లో గణనీయమైన వర్గం ఐఎస్‌లో విలీనమైంది. సౌదీ ప్రయత్నాలను, ఇజ్రాయెల్‌ ప్రభావాన్ని...వారికి దన్నుగా వచ్చిన అమెరికా, సంకీర్ణకూటమి సేన లను నిలువరించి అసద్‌ను నిలబెట్టాలని రష్యా, ఇరాన్‌లు భావిస్తున్నాయి. ఈ ముఠాలన్నీ తమది కాని గడ్డపై బాంబులు, క్షిపణులు విసురుకుంటూ అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నాయి. నిత్యం వంద లమందిని బలి తీసుకుంటున్నాయి. పదాతిదళాలను వెనక్కు రప్పిస్తున్నట్టు చెప్పిన ట్రంప్‌ వైమా నిక దళం విషయంలో ఏం నిర్ణయించుకున్నారో చెప్పలేదు. వెనకా ముందూ ఆలోచించకుండా సంకీర్ణ కూటమి పేరిట అమెరికా తోకపట్టుకుని ‘తగుదునమ్మా’ అంటూ సిరియాకు పోయిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వగైరాలు ట్రంప్‌ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే అమె రికా సాయం లేకుండా అవి యుద్ధభూమిలో ఎంతోకాలం కొనసాగలేవు. ఐఎస్‌ను ఓడించామని ట్రంప్‌ చేస్తున్న వాదనకు భిన్నంగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ఈమధ్యే గణాంకాలు ఏకరువు పెట్టింది. సిరియాలో దాదాపు 17,100మంది ఐఎస్‌ ఉగ్రవాదులున్నారని వెల్లడించింది. సిరియా–ఇరాక్‌ సరిహద్దుల్లో మరో 30,000మంది ఉంటారని దాని అంచనా. 

అరబ్‌ ప్రపంచంలో వెల్లువెత్తిన 2011నాటి ‘జాస్మిన్‌ విప్లవం’లో సిరియా సంక్షోభ మూలాలు న్నాయి. అప్పట్లో ట్యునీసియాలో మొదలై ఇరుగు పొరుగు దేశాలకు కార్చిచ్చులా వ్యాపించిన ఈ నిరసనలను చూసి పాలకులంతా వణికారు. ట్యునీసియా, ఈజిప్టుల్లో నియంతలు పీఠాలు దిగాల్సి వస్తే... సిరియా, బహ్రెయిన్, యెమెన్‌వంటి దేశాల్లో ఉద్యమాలను పాలకులు అణిచేయగలిగారు. ఈజిప్టులో సైతం ప్రజాస్వామ్య ఉద్యమ ఫలం ఎన్నాళ్లో నిలువలేదు. అప్పట్లో ఈ ఉద్యమాన్ని సాకుగా తీసుకుని తనకు కొరకరాని కొయ్యలుగా ఉన్న పాలకులపై ఆగ్రహజ్వాలలను పెంచి పోషిస్తూనే, అనుకూలురను కాపాడటానికి అమెరికా శాయశక్తులా ప్రయత్నించింది. ఆ విధానంలో భాగంగానే సిరియాలో సజావుగా సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమంలోకి ‘ఫ్రీ సిరియన్‌ ఆర్మీ’ పేరిట సాయుధ ముఠాలను ప్రవేశపెట్టి దాని తీరుతెన్నులను మార్చింది. సౌదీ, ఖతార్, టర్కీ, ఇజ్రాయెల్, సంకీర్ణ కూటమి కలిస్తే క్షణాల్లో అసద్‌ను పడగొట్టవచ్చునని లెక్కలేసుకుని 2011లో అమెరికా సిరియాను రణక్షేత్రంగా మార్చింది. కానీ ఆ లెక్క తప్పింది. అక్కడ వేర్వేరు ముఠాలకు ఆ దేశం పంపిణీ చేసిన ఆయుధాలు, డబ్బు కొత్త ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కు అంకురార్పణ చేశాయి. 

ప్రస్తుతం సిరియాలో పడిన చిక్కుముళ్లు సామాన్యమైనవి కాదు. జర్నలిస్టు ఖషోగీ హత్య తర్వాత  సౌదీ–టర్కీల మధ్య వచ్చిన తగువు ముదురుతోంది. అటు స్వతంత్ర దేశం కోసం పోరాడే కుర్దులకు అండనిస్తున్న అమెరికా వైఖరి సైతం టర్కీకి నచ్చడంలేదు. కుర్దులపై బాంబులు కురి పిస్తున్న రష్యా, ఇరాన్‌ల కూటమికి అది క్రమేపీ చేరువవుతోంది. నాటోలో టర్కీదే ప్రధాన పాత్ర. అది తప్పుకుంటే ఆ సంస్థ కుప్పకూలుతుందని అమెరికాకు తెలుసు. అటు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న రష్యా నావికాదళ స్థావరం అసద్‌కు పెట్టని కోట. ఈ స్థితిలో అక్కడినుంచి గౌరవ  ప్రదంగా వెనుదిరగడమే మార్గమని ట్రంప్‌ భావించారు. కానీ ఒక అర్ధవంతమైన పరిష్కారంలో భాగంగా ఇది జరిగితేనే సంక్షుభిత సిరియా మళ్లీ చిగురిస్తుంది. లేనట్టయితే మరో ఇరాక్‌లా, ఇంకొక అఫ్ఘానిస్తాన్‌లా అది కూడా ఒక అరాచకరాజ్యంగా మిగులుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement