
సాగరజలాల్లో కలకలం
భారత-పాక్ సరిహద్దుల్లో ఒకపక్క తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా నూతన సంవత్సర ఆగమనవేళ అరేబియా సముద్రంలో అర్థరాత్రి చోటుచేసుకున్న మరో ఘటన దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 365 కిలోమీటర్ల దూరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక మర పడవను తీర రక్షక దళం ఆధ్వర్యంలోని నౌక ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ పడవలోని వారు ముందు తప్పించుకుపోవడానికి ప్రయత్నించి, అది విఫలం కావడంతో తమ ను తాము పేల్చుకుని చనిపోయారన్నది ఆ వార్త సారాంశం.
ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. లొంగిపొమ్మని హెచ్చరిస్తూ మన తీర రక్షక దళం దాదాపు గంటన్నరసేపు పడవను వెంబడించినట్టు ఆ ప్రకటన చెబుతున్నది. పడవలో భారీగా పేలుడు పదార్థాలున్న కారణంగానే పేలుడు సంభవించి, వెనువెంటనే మంటలు వ్యాపించి ఉండొచ్చని తీర రక్షక దళం అధికారులంటున్నారు.
ఇలాంటి పడవే మరొకటి ఈ వ్యవహారాన్ని గమనించి తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయిందని కూడా చెబుతున్నారు. ఈ ప్రకటనతో పాటే కొన్ని జాతీయ దినపత్రికలు ఆ ఉదంతానికి సంబంధించి స్వీయ కథనాలను ప్రచురించాయి. ఆ పడవ మద్యం లేదా డీజిల్ దొంగరవాణా చేసే స్మగ్లర్లది కావచ్చు నన్నది ఆ కథనాల సారాంశం. మన తీరరక్షక దళం అవసరానికి మించిన బలాన్ని ఉపయోగించిందనీ... లేనట్టయితే ఆ పడవను పట్టుకోవడం సాధ్యమయ్యేదేనని ఆ కథనాలు అంటున్నాయి.
సముద్ర జలాల్లో నిరంతరం నిఘా పనిలో ఉండే తీర రక్షక దళం మాత్రమే కాదు...పడవల్లో చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులుంటారు. మాదకద్రవ్యా లను, మారణాయుధాలను అక్రమ రవాణాచేసే స్మగ్లర్లుంటారు. వచ్చే పోయే నౌకల్లో సరుకుని దోచుకుపోయే సముద్ర దొంగలుంటారు. వీటన్నిటితోపాటు ఉగ్ర వాదుల బెడద కూడా తక్కువేమీ కాదు. ఏడేళ్లక్రితం ముంబై నగరాన్ని గడగడలా డించి ఎందరినో పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు పాకిస్థాన్‌నుంచి పడవల్లోనే వచ్చారు.
సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి విస్పష్టమైన విభజ న రేఖ గీయడం సాధ్యంకాదు గనుక మన మత్స్యకారులు పొరబాటున సరిహ ద్దును అతిక్రమించి పాక్ పరిధిలోని జలాల్లోకి వెళ్లడం, అటువారు కూడా ఈ తరహా లోనే ఇటుగా రావడం తరచు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో మత్స్యకా రులను అదుపులోకి తీసుకుంటారు.
అరెస్టయినవారు మత్స్యకారులేనని, వారు పొరపాటున సరిహద్దు దాటి వచ్చారని నిర్ధారణ అయ్యాక విడుదల చేయడం సాధారణమే. అయితే ఇలాంటివన్నీ ఇరు దేశాలమధ్యా చర్చలున్నప్పుడు ‘సుహృద్భావపూర్వకంగా’ చేసే పనులు. ఈలోగా ఎన్ని నెలలు, సంవత్సరాలు గడిచినా గడవొచ్చు. అంతవరకూ ఆ మత్స్యకారులు పరాయిదేశం జైల్లో బందీలు గా ఉండకతప్పదు. ఈ సమస్య భారత-పాక్‌ల మధ్యే కాదు...శ్రీలంక, బంగ్లాదేశ్‌ల వైపున్న సరిహద్దు జలాల్లో కూడా ఉంది. గుజరాత్ తీరంనుంచి చేపల వేటకు రెండు పడవల్లో వెళ్లిన భారత మత్స్యకారులు పన్నెండుమందిని పాకిస్థాన్ తీర రక్షక దళం నిర్బంధించిందని తాజా వార్తలు చెబుతున్నాయి.
అయితే, పోర్‌బందర్ తీరం సమీపంలో చోటుచేసుకున్న ఘటన కూడా మత్స్యకారులకు లేదా స్మగ్లర్లకు సంబంధించిందేనని కొట్టిపారేయగలమా? అందు లోనూ ముంబై నరమేథం జరిగాక కూడా అలా అనుకోవడం సాధ్యమేనా? పాకిస్థాన్‌లోని కేతిబందర్‌నుంచి కొందరు వ్యక్తులు రెండు పడవల్లో గుజరాత్‌వైపు బయల్దేరారని కొన్ని ఫోన్ సంభాషణలద్వారా జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) విన్నదని, దాని ఆధారంగానే అన్ని విభాగాలూ తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని ఈ దాడి జరిపాయని అధికారులంటున్నారు. మన దేశానికి మూడు వైపులా దాదాపు 7,600 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉన్నది.
ముంబై ఘటన ఉదంతం తర్వాత తీర ప్రాంత రక్షక దళాన్ని పటిష్టం చేయడంతోపాటు మెరైన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆ విభాగానికి చెందిన సిబ్బంది గస్తీ కూడా పెరిగింది. నిఘా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సంబంధిత విభాగాలకు చేరేయడం వంటివి జరుగుతున్నాయి. పోర్‌బందర్ ఘటన అలాంటి చర్యల పర్యవసానంగానే జరిగిం దని అధికారులు చెబుతున్నారు. భూభాగంపై ఉండే సరిహద్దుల్లో ఏమవుతున్నదో తెలుసుకోవడమే సాధారణ పౌరులకు కష్టం.
ఇక సముద్ర జలాల్లో అంతర్జాతీయ హద్దుల వద్ద ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఫలానావిధంగానే జరిగిందని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి స్థితిలో పోర్‌బందర్ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీలు రెండూ పరస్పర విమర్శలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలాంటి సాక్ష్యాధారాలూ మిగల్చకుండా చేసి ఒక పెద్ద ఉగ్రవాద దాడి నుంచి దేశాన్ని కాపాడామని చెబితే ఎలా అని కాంగ్రెస్ అంటున్నది. ఇందులో అసలు జరిగిందేమిటో, ఏ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నదో చెప్పాలని ఆ పార్టీ కోరుతున్నది.
కాంగ్రెస్ వ్యవ హార శైలి పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా ఉన్నదని బీజేపీ ప్రత్యుత్తరమిచ్చింది. సరిగ్గా ముంబై దాడి సమయంలోనూ ఆ రెండు పార్టీలమధ్యా ఇలాంటి మాటల యుద్ధమే జరిగింది. అయితే పోర్‌బందర్ ఉదంతంలో అసలు జరిగిందేమిటో, ఎవరెవరి ప్రమేయమున్నదో వెల్లడించడానికి ఇంకా సమయం ఉంది. ఆ పడవకు సంబంధించిన శకలాలపై ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తికావాలి.
ఎన్‌టీఆర్‌ఓ నుంచి ఈ ఉదంతానికి సంబంధించిన ఆడియో టేపులు, ఇతర సమాచారం మొత్తాన్ని తాము తెప్పించుకుంటున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిని ఇంకా విశ్లేషించాలి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాక కేంద్ర ప్రభుత్వం మరిన్ని వివరాలతో సమగ్ర సమాచారాన్ని అందించగలదని, అందులో అందరి సందేహాలకూ జవాబులు లభిస్తాయని ఆశించాలి.