గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భాల్లో రాష్ట్రపతి, ప్రధాని ఇచ్చే సందేశాలు దాదాపు ఎప్పుడూ ఒకే మూసలో సాగిపోతాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక ఈ తీరు మారింది. ఆయన ఎర్రకోట బురుజులపై నుంచి ఇచ్చే ప్రసంగమైనా, జాతీయ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే సందేశమైనా భిన్నంగా ఉంటున్నాయి. గత ప్రధానులతో పోలిస్తే సమస్యల్ని ప్రస్తా వించడంలో, వాటిని చెప్పడంలో మోదీ శైలి వేరు. అలాగే రాష్ట్రపతి సైతం దేశాన్ని కలవరపరుస్తున్న వివాదాస్పద అంశాలపై తన ఆందోళననూ, అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇది పాలకపక్షంలోని కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చునని తెలి సినా ఆయన రాజీ పడటం లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో గతంలో మాదిరే టాయిలెట్ల సమస్య మొదలుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ వరకూ వివిధ అంశాలను మోదీ మాట్లాడారు.
ప్రధాని ప్రసంగంపై ట్విటర్ సందేశాల్లో వ్యంగ్య వ్యాఖ్యలు వెలువడటం, ఆయన ప్రసంగం నిస్సారంగా ఉన్నదని నిట్టూర్చడం మాటెలా ఉన్నా...పాకిస్తాన్ విషయంలో మన దేశం వైఖరిలో వచ్చిన గుణాత్మకమైన మార్పును ప్రతిబింబిస్తూ మోదీ మాట్లాడారు. బలూచిస్తాన్‌లో పాక్ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్‌లో ప్రజా ఉద్యమాలను అణిచేస్తున్న తీరును చెప్పారు. వాస్తవానికి మూడు రోజులక్రితం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఇలాగే మాట్లాడారు. కానీ ఎర్రకోట ప్రసంగంలోనూ దాన్ని కొనసాగించడం అసాధారణం. ఏ దేశ ఆంతరంగిక విషయాల్లోనూ భారత్ జోక్యం చేసుకోదని... అలాగే వేరే దేశం మన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని మన ప్రధానులు చెప్పేవారు. అందుకనుగుణంగానే బలూచిస్తాన్, గిల్గిత్ పరిణామాల గురించి మాట్లాడేవారు కాదు. పాకిస్తాన్ మాత్రం షరా మామూలుగా సమయం, సందర్భం లేకుండా కశ్మీర్ సమస్యను ప్రస్తావిస్తూనే ఉంది. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగమైతే కశ్మీర్ లేకుండా ఎప్పుడూ పూర్తికాలేదు. బలూచిస్తాన్ ఊసెత్తినా అక్కడ భారత్ ‘ఉగ్రవాద చర్యల’ గురించి మాత్రమే పాక్ చెప్పేది. తన నిర్వాకాన్ని సాధ్యమైనంత వరకూ కప్పెట్టేందుకు ప్రయత్నించేది.
బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఆకాంక్ష ఈనాటిది కాదు. ఇంచుమించు ఫ్రాన్స్‌కు సరిసమానమైన భూభాగం ఉన్న ప్రాంతంలో బలూచి తెగ పౌరులు నివసిస్తు న్నారు. ఇప్పుడా ప్రాంతం ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ దేశాలతో కలగలిసి ఉంది. ప్రధానంగా సున్నీ తెగ ముస్లింలైన బలూచి పౌరుల ఆకాంక్షను కుర్దు జాతి పౌరుల పోరాటంతో పోల్చవచ్చు. బలూచిస్తాన్ గడ్డలో ఖనిజ సంపద అమితంగా ఉంది. బంగారం, రాగి, యురేనియంలతో పాటు చమురు, సహజవాయు నిక్షేపా లున్నాయి. పైగా పర్షియన్ జలసంధి ముంగిట దాదాపు వేయి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది.ఇంత సంపద ఉన్నా అక్కడ దారిద్ర్యం తాండవిస్తుంటుంది. అక్కడి సహజ వనరుల్ని వెలికి తీసి బాగుపడుతున్న పాకిస్తాన్... ఇంకా వాటి జోలికి పోని ఇరాన్ బలూచి పౌరుల బాగోగుల్ని పట్టించుకోవు.
ఇక ఉగ్రవాదం తప్ప మరేమీ లేని అఫ్ఘాన్ సంగతి చెప్పనవసరమే లేదు. బలూచి పౌరుల్లో ఆయుఃప్రమాణం తక్కువ. ఆయా దేశాల జాతీయ సగటులతో పోలిస్తే శిశు మరణాలు, నిరక్షరాస్యత, పేదరికం ఎక్కువ. పాఠశాలలుండవు. ఉపాధి దొరకదు. నిలదీస్తే అటు ఇరాన్‌లోనైనా, ఇటు పాక్‌లోనైనా ఒకటే శిక్ష–మనుషుల్ని మాయం చేయడం! ఇరాన్‌లో మరణశిక్షలకు గురయ్యేవారిలో అధిక శాతం బలూచి పౌరులే. మాయమవుతున్నవారిలో55 శాతం అక్కడివారే.
ఇవన్నీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలు చెబుతున్న నిజాలు. ఇరాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉండగా, ఆ తర్వాత ఇస్లామిక్ విప్లవం విజయవంతమయ్యాక మత గురువులు బలూచి ఉద్యమాన్ని బలపరిచేవారు. కానీ అధికారం సుస్థిరమయ్యాక వైఖరి మారింది. పాకిస్తాన్, భారత్‌లు రెండూ పరస్పరం కత్తులు నూరుకుంటాయి గనుక భారత్ వైపు నుంచి తమకు మద్దతు దొరుకుతుందని బలూచి పౌరులు ఆశపడేవారు. అదే జరిగితే అంతర్జాతీయంగా తమ దుస్థితి అందరికీ తెలుస్తుందని భావించేవారు. కానీ మన దేశం మాత్రం ఎప్పుడూ ఆ పని చేయలేదు. 2002లో అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించాక ఆత్మాహుతి దాడులు, నేతల హత్య, కిడ్నాప్‌లు పెరిగాయి. వీటన్నిటికీ భారత్ కారణమనడం తప్ప అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పాక్ చొరవ చూపింది లేదు. పాక్ తమపై సాగిస్తున్న అణచివేతను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు 2014లో అబ్దుల్ ఖదీర్ బలూచ్ ఆధ్వర్యంలో క్వెట్టానుంచి ఇస్లామాబాద్ వరకూ మహా పాదయాత్ర జరిపారు. 3,000 కిలోమీటర్ల పొడవునా ఎక్కడా హింసాత్మక ఘట నలు జరగకుండా, కనీసం సాధారణ జనజీవనానికి అంతరాయం కలగకుండా ఆ యాత్ర సాగింది. తమ పోరాటం శాంతియుతమైనదనడానికి ఇదే రుజువని ఖదీర్ అప్పట్లో చెప్పారు.
ఈ నేపథ్యంలోనే మోదీ ప్రసంగాన్ని బలూచి పౌరులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రస్తావించడం వరకూ, పాక్‌ను ఇరకాటంలో పెట్టడం వరకూ సరేగానీ... కశ్మీర్ సమస్యపై పాక్ చెబుతున్న తీరున బలూచి పౌరుల స్వాతంత్య్ర ఆకాంక్షను సమర్ధిస్తున్నామని మోదీ చెప్పగలరా? అలా చెప్పి మనకు ఆదినుంచీ సన్నిహితంగా మెలుగుతున్న ఇరాన్‌ను దూరం చేసుకోవడానికి సిద్ధపడగలరా? మరోపక్క బలూచి ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలున్న చైనా మాటేమిటి? అందువల్లే మోదీ తీసుకున్న కొత్త వైఖరి తాడు మీద నడకలాంటిది. ఆ సమస్య లోతుల్లోకి పోయేకొద్దీ వెళ్లడమే అవుతుంది. వెనక్కి రావడం అంత సులభం కాదు. రాగలకాలంలో బలూచి ఉద్యమకారులు మరింతగా ఆశిస్తారు. నెరవేరకపోతే అలుగుతారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నదో తెలియడానికి కొంత సమయం పడుతుంది. బలూచిలో తన ఆగడాలు ప్రపంచానికి తేటతెల్లం కావ డంతో పాక్ ఇప్పటికైతే ఇరకాటంలో పడింది.
కీలెరిగి వాత!
Published Tue, Aug 16 2016 12:17 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement