
విలక్షన్
యాక్షన్ సినిమాల ట్రెండ్... హారర్ సినిమాల ట్రెండ్. రొమాంటిక్ మూవీస్ ట్రెండ్...
యాక్షన్ సినిమాల ట్రెండ్... హారర్ సినిమాల ట్రెండ్. రొమాంటిక్ మూవీస్ ట్రెండ్... ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. హీరోలు విలన్లుగా మారడం అనేది ఇప్పటి ట్రెండ్. అప్పటివరకూ హీరోగా చేసిన హీరో మరో హీరో చిత్రంలో విలన్‌గా కనిపిస్తే.. ఆ ప్రాజెక్ట్‌కి వచ్చే క్రేజు.. ఇద్దరు హీరోలు ‘ఢీ’ కొంటే ప్రేక్షకులకు లభించే మజా వేరు. ఈ మధ్య విలన్లుగా కిక్ ఇచ్చిన హీరోల గురించి చెప్పాలంటే...
ఇక్కడే మంచి విలన్లను పెట్టుకుని మనమెక్కడికో వెళ్లాం అనే ఫీల్‌ని దర్శకులకు కలగజేసిన హీరో జగపతిబాబు. మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘లెజెండ్’ ద్వారా విలన్‌గా మారి, టాలీవుడ్‌కి పరభాషల విలన్ల అవసరాన్ని కాస్త తగ్గించారు. మనం పరభాషల నుంచి విలన్లను తెచ్చుకుంటున్నట్లుగా మన జగపతిబాబుని అక్కడివాళ్లు తీసుకెళ్లడం విశేషం. ఇప్పుడు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఆయన బిజీ.
విలన్‌గా మారి, భేష్ అనిపించుకున్న మరో హీరో సుదీప్ మాతృభాష కన్నడంలో హీరోగా, పరభాషల్లో విలన్‌గా చేస్తున్నారు. ఈ హ్యాండ్‌సమ్ హీరో ‘ఈగ’లో ప్రదర్శించిన క్రూరత్వం గుర్తుండే ఉంటుంది. సుదీప్‌లో మంచి విలన్ మెటీరియల్ ఉన్నాడని నిరూపించింది తెలుగు పరిశ్రమ. ఆ తర్వాత తమిళ పరిశ్రమ గుర్తించి, ‘పులి’కి సుదీప్‌ని విలన్‌గా తీసుకుంది.
భోజ్‌ఫురిలో తిరుగు లేని హీరో అనిపించుకున్న రవికిషన్‌లో విలన్‌ని చూసింది కూడా మన తెలుగు పరిశ్రమే. ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల్లో ఈ భోజ్‌పురి హీరో విలన్‌గా మంచి మార్కులే కొట్టేశారు.
అతను హీరోనా? విలనా? అని డౌటు వచ్చే నటుడు ఒకరున్నారు. ఆయనే ఉపేంద్ర. యాంటీ షేడ్స్ ఉన్న హీరో పాత్రలు చేయడం ఉపేంద్ర అలవాటు. ఇక.. పూర్తి స్థాయి విలనిజం పండించడమంటే ఆయనకు పెద్ద కష్టమేం కాదని ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ప్రూవ్ చేసేసింది.
ఇప్పటివరకూ చెప్పుకున్నవాళ్లందరూ మిడిల్ ఏజ్డ్ ఆర్టిస్టులే. యంగ్ ఏజ్ లో ఉన్న ఓ హీరో.. విలన్‌గా చేయడమంటే సాహసమే. టైమ్ బాగాలేకపోతే విలన్‌గానే ఫిక్స్ అయిపోవాల్సి వస్తుంది. కానీ, ఆది పినిశెట్టి అదేం ఆలోచించలేదు. అందుకే ‘సరైనోడు’లో విలన్‌గా నటించారు. ఆ చిత్రం ఆదికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘మలుపు’లో హీరోగా కనిపించి, ఆకట్టుకున్నారు. దాంతో ఇతను విలన్‌గానే పనికొస్తాడనో.. హీరోగానే బెస్ట్ అనో ముద్రపడలేదు.
తెలుగు తెరకు వచ్చిన మరో స్టైలిష్ విలన్ అరుణ్ విజయ్ సీనియర్ నటుడు విజయ్‌కుమార్ తనయుడు. అరుణ్ విజయ్ తమిళంలో హీరోగా చేస్తుంటారు. కానీ, ‘బ్రూస్‌లీ’కి విలన్‌గా అడిగితే ‘సై’ అనేశారు.
విలన్‌గా మారిన హీరోల జాబితాలోకి త్వరలో రాజశేఖర్ చేరనున్నారని ఫిలిం నగర్ టాక్. ఆవేశపూరితమైన హీరో పాత్రలతో పాటు రొమాంటిక్ పాత్రలు కూడా చేసిన రాజశేఖర్ విలన్‌గా కూడా భేష్ అనిపించుకుంటారని నిస్సందేహంగా చెప్పొచ్చు.
దక్షిణాది నుంచి ఉత్తరాది వైపు వెళితే ‘బాజీగర్’, ‘డాన్’ వంటి చిత్రాల్లో యాంటీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో షారుక్ ఖాన్ మెప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడ హీరోగా చేస్తూ విలన్‌గా కూడా చేస్తున్న యువనటుడు నీల్ నితిన్ ముఖేష్ తెలుగు ‘కత్తి’లో విలన్‌గా నటించారు.
ఇప్పుడు అందరి దృష్టీ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ మీద ఉంది. ‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇన్నాళ్లూ హీరోగా ‘గుడ్‌బాయ్’ పాత్రలు చేసిన తనకు ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌తో ఢీ కొనడం చాలా ఎంజాయబుల్‌గా ఉందని అక్షయ్ పేర్కొన్నారు.
ఇప్పుడైతే విలన్లుగా మారుతున్న హీరోల జాబితా ఎక్కువైంది కానీ, ఒకప్పుడు ఇదే సీన్ రివర్స్‌లో ఉండేది. ముందు విలన్లుగా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారిన నటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ ముందు విలన్‌గానే ఎంటరై, ఆ తర్వాత హీరో అయ్యారు.. ఫైనల్లీ సూపర్ స్టార్ అయ్యారు. మోహన్‌బాబుని తీసుకుంటే.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు కోణాలను నిరూపించుకుని, పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. చిరంజీవి కూడా ముందు విలన్.. ఆ తర్వాతే హీరో.. తర్వాత మెగాస్టార్. కమల్‌హాసన్‌ని తీసుకుంటే హీరోగా చేస్తూనే, యాంటీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఆ తరం తర్వాత వచ్చినవాళ్లల్లో శ్రీకాంత్ ముందు విలన్. తర్వాత ఫ్యామిలీ హీరో. గోపీచంద్ రెండు సినిమాల్లో విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయినా ఆ ప్రభావం ఆయన కెరీర్ పై పడలేదు.
ఫైనల్‌గా చెప్పాలంటే.. ఒక్కసారి హీరోగా మారాక మళ్లీ విలన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు, పరిశ్రమ విలన్ పాత్రలకే ఫిక్స్ చేసే ప్రమాదం ఉందని భయపడతారు. కానీ, ఇప్పటి హీరోలు అలాంటి భయాలేం పెట్టుకోవడంలేదు. విలన్‌గానూ మెప్పించి, హీరోగానూ కంటిన్యూ అవుతున్నారు. ఇలా విలనిజాన్ని ప్రదర్శించడంలో హీరోయిజమ్ చూపించి, ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అనిపించుకుంటున్నారు.