మెడా పెడా వాడకండి ప్లీజ్! | Please use meda peda | Sakshi
Sakshi News home page

మెడా పెడా వాడకండి ప్లీజ్!

Published Tue, Jun 9 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

మెడా పెడా వాడకండి ప్లీజ్!

మెడా పెడా వాడకండి ప్లీజ్!

సర్వైకల్ స్పాండిలోసిస్
 

మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరూ మెడనొప్పి ఉంటే మెడను ఎడామెడా వాడకూడదు. ఎందుకంటే...  
 శరీరంలోని అత్యంత కీలకమైన భాగం మెడ. అది సులువుగా, ఏ ఇబ్బందీ లేకుండా కదులుతూ ఉంటేనే హాయి. కానీ ఆ భాగంలో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా చాలు... అదెంతో  కష్టమనిపిస్తుంది. అలాంటిది మెడలోని వెన్నుపూసల నుంచి మొదలుకొని, భుజం చేతిలోకి దూసుకువస్తున్నట్లుగా వచ్చే నొప్పి. క్షణక్షణం మెడనూ, భుజాన్నీ నొక్కుకుంటూఉండి సాంత్వన పొందాలన్న ఆరాటం. ఎంతో బాధగాపరిణమిస్తూ... మెడ నుంచి చేతికి పాకుతున్నట్లుగా ఉండే ఈ నొప్పినే వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఈ కండిషన్‌కు కారణాలు, దీని నుంచి విముక్తి కోసం చేయాల్సిన ప్రయత్నాల గురించి తెలుసుకుందాం.
 
సర్వైకల్ స్పాండిలోసిస్ పేరిట వచ్చే మెడ నొప్పి చాలా సాధారణ సమస్య. మన జనాభాలో దాదాపు 80 శాతం మందికి తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మెడనొప్పి వస్తుంది. ఇది ఇంత సాధారణంగా కనిపించడానికి అనేక కారణాలున్నాయి. మరీ ముఖ్యంగా మన జీవితాల్లోకి కంప్యూటర్ ప్రవేశించాక... దానిపై సుదీర్ఘకాలం పనిచేస్తుంటాం. ఈ సమయంలో మనం తప్పుడు భంగిమలో కూర్చోవలసి రావడంతో ఎప్పుడూ తల భారం మెడపైన అదేపనిగా పడుతూ ఉంటుంది. దాంతో మెడపై భంగిమపరమైన ఒత్తిడి పడి అది అలసటకు (పోష్చరల్ ఫెటీగ్‌కు) గురవుతుంది. ఇదే క్రమక్రమంగా కొనసాగుతూ సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యకు దారితీస్తుంది.
 
 సర్వైకల్ స్పాండిలోసిస్ నొప్పి ఎలా వస్తుంది?
 మెడలోని వెన్నుపూసలను సర్వైకల్ ఎముకలు అంటారు. ఈ ఎముకల మధ్య ఒరిపిడినీ, రాపిడినీ తగ్గించడానికి ఒకింత మెత్తగా ఉండే డిస్క్‌లు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వెన్నుపూస డిస్క్‌లలో తేమ తగ్గుతుంది. దాంతో ఎముకబంధాలను పటిష్టంగా ఉంచే ప్రోటియోగ్లైకాన్ మ్యాట్రిక్స్ అనే ప్రోటీన్ బంధాలలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అన్ని మార్పుల ఫలితంగా ఎముకల మధ్య ఒరిపిడినీ, రాపిడినీ తగ్గించే మెత్తటి డిస్క్‌లు కాస్తా గట్టిగా, పెళుసుబారినట్లుగా అవుతాయి. ఇలా పెళుసుబారిన డిస్క్‌లలో చిన్న చిన్న పగుళ్లు, చీలికలు వస్తాయి. దాంతో రక్తనాళాలు ఈ పగుళ్లలోకి, చీలికల్లోకి ప్రవేశిస్తాయి.  దాంతోపాటు డిస్క్‌ల అరుగుదల కూడా మొదలవుతుంది. దాంతో వెన్నుపూసల మధ్య ఘర్షణ, రాపిడి చోటు చేసుకుంటుంది. దాంతో ఎముకలు ఒరుసుకుపోవడం, అరుగుదలకు దారితీయడం జరుగుతుంది. ఈ అరుగుదల జరుగుతున్న చోట అరుగుదలను భర్తీ చేసేందుకు కొత్తగా ఎముక పెరుగుదల ప్రారంభమవుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ సమయంలో ఈ ప్రక్రియ అంతా చాలా విపరీతమైన వేగంతో జరుగుతుంది. ఈ సమయంలో డిస్క్‌లు స్థానాలు తప్పడాలు, ఎముకల పెరుగుదల ప్రక్రియలు... అక్కడి  నరాలను, నరాల చివరలను బలంగా నొక్కుతాయి. నరాలు ఇలా నొక్కుకుపోవడం వల్ల నరం పొడవునా నొప్పి వస్తుంది. అందుకే నొప్పి పాకినట్లుగా జాలుగా వస్తుంటుంది. దాంతోపాటు భుజాల్లోకి నొప్పి పాకే సమయంలో అక్కడి కండరాలు కూడా బలహీనంగా మారతాయి. కొద్దిమేరకు స్పర్శలో మార్పులూ రావచ్చు.
 
నియంత్రణ ఎలా?  ... సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే మెడ నొప్పిని నివారించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మంచి మార్గం. దాంతో పాటు నొప్పినివారణ కోసం ఉపయోగించే  పైపూత మందులు సురక్షితం. ఈ పైపూత మందులను మృదువుగా మసాజ్ చేసినట్లుగా రాయాలి. ఇక ఐస్‌ను కాపడం పెట్టినట్లుగా నొప్పి ఉన్న చోట అద్దడం చేయాలి. ఇవన్నీ కుదరకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు మాత్రమే నొప్పినివారణ మందులు వాడాల్సిరావచ్చు. వీటి కంటే తల భారాన్ని పూర్తిగా ఎముకలపైనే పడనివ్వకుండా మెడ కండరాలను బలంగా చేసేందుకు మెడ వ్యాయామాలను (ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సెజైస్) చేయాలి. ఫిజియోల సలహాల మేరకు వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి చాలావరకు ఉపశమిస్తుంది.
 
డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు..?

మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్‌కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి అలా పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటున్నా వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతేనొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా ఉంటేపై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉంటేకాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్‌నెస్‌తో) ఉంటేమెడపై ముట్టుకున్నా ఇబ్బందిగా (టెండర్‌నెస్) ఉంటే శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్‌ను సూచిస్తాయి.
 
చికిత్స... మెడలోని వెన్నుపూసలు అరిగి, అక్కడి నరాలు, నరాల అంకురాల చివర్లు నొక్కుకుపోతూ వస్తున్న నొప్పిని తగ్గించేందుకు ప్రీగ్యాబలిన్, గాబాపెంటిన్ వంటి నరాల కణాలను పుట్టించే ప్రోటీన్లు ఉండే ‘న్యూరోట్రాఫిక్’ మందులు బాగా ఉపయోగపడతాయి. ఇక కొన్నిసార్లు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స  కూడా అవసరం కావచ్చు.
 
 ఎవరెవరిలో ఎక్కువ...
 సాధారణంగా పురుషులలో సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య ఎక్కువ. ప్రధానంగా నిటారుగా కూర్చుని డ్రైవింగ్ చేసేవారు, పొగతాగేవారు, చాలా ఎక్కువ బరువున్న వస్తువులను మోసేవారిలో సర్వైకల్ స్పాండిలోసిస్ రిస్క్ పాళ్లు అధికం.
 
 లక్షణాలివి...
  మెడ నొప్పిగా ఉండటం  ఆయా అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి  చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపించడం  కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్‌నెస్) అనిపించడం  నడకలో ఇబ్బంది  కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు.
 
 
 డాక్టర్ హరి శర్మ
 సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్,
 అపోలో హాస్పిటల్స్,
 హైదర్‌గూడ, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement