స్లీప్ పెరాలసిస్ అంటే..?
నా వయసు 50. నా సమస్య ఏమిటంటే... నేను నిద్రలేచాక చాలాసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- కె. రామస్వామి, మిర్యాలగూడ
మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్‌కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్ పెరాలసిస్ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది... నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు.
స్లీప్ పెరాలసిస్ అన్నది చాలా అరుదైన రుగ్మత కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో (అడాలసెన్స్‌లో) ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్ పెరాలసిస్ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇది వచ్చేందుకు దోహదపడే మరికొన్ని అంశాలివి...
నిద్రలేమి మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) తీవ్ర అవమానానికి గురికావడం
చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 - 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు.
డాక్టర్ వి.వి. రమణ ప్రసాద్
స్లీప్ స్పెషలిస్ట్ -
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
స్లీప్ కౌన్సెలింగ్
Published Thu, Jul 9 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement