
కార్డియాలజీ కౌన్సెలింగ్
ఇటీవల వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటున్నాయి. వీటి ప్రభావం గుండె మీద ఎలా ఉంటుంది? ఆ ప్రభావాన్ని అధిగమించడం ఎలా? విపులంగా చెప్పండి.
– సరస్వతమ్మ, గుంటూరు
వేసవి వేడి తీవ్రత ప్రభావం గుండె మీద ఉంటుందా అన్న ప్రశ్నకు అవుననే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అప్పటికే కొద్దిగా గుండె సమస్య ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువ. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చెమట పట్టి, అది ఆవిరి కావడం ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే ఇలా జరిగే క్రమంలో మన శరీరంలోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్తాయి. ఫలితంగా ఒంట్లో నీటిపాళ్లు తగ్గుతాయి. ఒంట్లోని నీటి పాళ్లు తగ్గినప్పుడు, రక్తపు పరిమాణం కూడా తగ్గి, రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) తగ్గుతుంది. దాంతో గుండె ఒకింత వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ఇలా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు స్వల్పంగా పెరిగే గుండె స్పందనలను ఆరోగ్యవంతులు తట్టుకోగలరు. కానీ సమస్య ఉన్న వారిలో మాత్రం గుండె మరింత శ్రమపడాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్లకు ఛాతీనొప్పి (యాంజైనా) వచ్చే అవకాశాలు ఉంటాయి. గుండెదడ వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో వేడితో గుండెపై పడే దుష్ప్రభావాల ఫలితాలు ఈ కింద పేర్కొన్న రూపంలో వ్యక్తం కావచ్చు.
∙యాంజైనా : అప్పటికే గుండెజబ్బులు (కరోనరీ హార్ట్ డిసీజ్) ఉన్నవారిలో ఛాతీనొప్పి వచ్చి, వాతావరణంలో వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు మరింత తీవ్రమవుతుంది. గుండెపై ఒత్తిడితో పాటు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. గుండెజబ్బులు ఉన్నవారు మరింత వేగంగా, చురుగ్గా పని చేయాల్సి రావడంతో ఈ కండిషన్ వస్తుంది.
∙హార్ట్ ఫెయిల్యూర్ : గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కండిషన్ ఉన్నవారు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారెప్పుడూ చల్లని ప్రదేశంలో ఉండాలి. హార్ట్‌ఫెయిల్యుర్ కండిషన్ అంటేనే రక్తాన్ని పంప్ చేయడంలో గుండె సరిగా పనిచేయలేని స్థితి అని అర్థం. ఏదైనా కారణాలతో మీరు ద్రవపదార్థాలను తక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తే తాము ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలో తప్పక డాక్టర్లను సంప్రదించి తెలుసుకోవాలి. ఇలాంటి వారు టాబ్లెట్లు తీసుకోగానే కాస్త కళ్లు తిరిగినట్లుగా లేదా మత్తుగా అనిపించినా, లేదా తల తేలిగ్గా అయినట్లుగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఇలాంటి సమయాల్లో మీ టాబ్లెట్ల మోతాదును తగ్గించడమో లేదా తాత్కాలికంగా ఆపేయడమో చేస్తారు. మీరు మామూలుగా మారాక మళ్లీ మందులను ప్రారంభిస్తారు.
ఇక గుండెజబ్బులు ఉన్నవారితో పాటు గుండెజబ్బులు లేని ఆరోగ్యవంతులు కూడా ఈ సీజన్‌లో తేలిగ్గా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఒంట్లోని ద్రవాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఒంట్లోని ద్రవాలు తగ్గడం అన్నది ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. విపరీతమైన చెమటలు, చర్మాన్ని మెలిపెడితే అది త్వరగా మామూలు స్థితికి రాకుండా.. అలా ముడతలు పడే ఉండటం, తల తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం, కండరాలు పట్టేయడం, ఒంటి మీద దద్దుర్లు, చీలమండలో వాపు, వేగంగా శ్వాస తీసుకోవడం, వికారం, వాంతులు వంటివి వడదెబ్బ లక్షణాలు. ఇలాంటివి కనిపించినప్పుడు వెంటనే రోగిని నీడలోకి తీసుకెళ్లి, బాగా గాలి తగిలేట్లుగా చేయడంతో పాటు వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడం వంటివి చేయాలి. గుండె జబ్బులు ఉన్నవారిలోనైతే మరింత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వయోవృద్ధులు, చిన్నపిల్లల్లో వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువ.
ఈ ముప్పు తప్పించుకోవడం ఎలా?
∙సాధారణంగా ఈ సీజన్ అంతా ఎక్కువగా నీళ్లు తాగాలి. అలాగే చక్కెర లేని ద్రవాహారాలు తీసుకోవచ్చు. (ఏదైనా కారణాల వల్ల ద్రవాలు ఎక్కువగా తీసుకోకూడదంటూ ఆంక్షలు ఉన్న రోగులు తమ డాక్టర్‌ను సంప్రదించి, వారి సూచనలు విధిగా పాటించాలి).
∙చలువ చేసే ఆహార పదార్థాలు అంటే ద్రవాల పాళ్లు ఎక్కువగా ఉండే వెజిటబుల్ సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇంట్లోనే ఉండాలి. వేడిగా ఉన్న వేళల్లో బయటి వేడిమి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంటిని చల్లగా ఉంచుకోవాలి.
∙వదులుగా ఉన్న తేలికపాటి రంగులుండే కాటన్ దుస్తులు వేసుకోవాలి.
∙ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లడం సరికాదు.
∙ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినా, వీలైనంత వరకు నీడపట్టునే నడుస్తుండాలి.
∙ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నవేళల్లో అలసిపోయే తీవ్రంగా ఉన్న వ్యాయామాలు చేయడం సరికాదు.
ఇలాంటి సాధారణ జాగ్రత్తలతో గుండెజబ్బులు ఉన్నవారు, లేనివారు కూడా వేసవి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు.
►వేసవిలో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం వడదెబ్బ నుంచి రక్షించడమే కాక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల
సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్,
సెంచరీ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.