హైదరాబాద్: ఈ నెల 17,18 వ తేదీల్లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 10 వ తరగతి పాస్/ఫెయిలైన విద్యార్థులతో పాటు ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, ఎంసీఏ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగి 18-35 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా జరగనుంది.
హైకోర్టు దగ్గరలోని సిటీ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీన హజరయ్యే అభ్యర్థులందరికి అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 18 వ తేదీన అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులకు సంబంధిత కంపెనీల హెచ్‌ఆర్‌లతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మేళాలలో దాదాపు 40 సంస్థలు పాల్గొంటున్నాయని... ఆసక్తి కలిగి, అర్హత ఉన్న అభ్యర్థులందరూ తమ విద్యార్హతలకు సంబంధించిన ఐదు జిరాక్స్ సెట్లతో పాటు బయోడెటాతో హజరు కావాలని సూచించారు.