
కుప్పకూలిన పురాతన భవనం : ఇద్దరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ పురాతన భవనం సోమవారం రాత్రి కుప్పకూలిపోయి.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిలకలగూడ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడ 1940 సమయంలో నిర్మించిన ఓ పాత భవనంలో ఒక చికెన్ షాపు, మరో జిరాక్స్ షాపు ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయంలో జిరాక్స్ షాపును యజమాని మూసేసి వెళ్లిపోయాడు. చికెన్ దుకాణం తెరిచే ఉంది. రాత్రి 9.45 సమయంలో ఆ భవనం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికెన్ దుకాణంలో ఉన్న దాని యజమాని అక్బర్(30), వాజిద్ (25) శిథిలాల కింద చిక్కుకుపోయారు.
స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి, గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో.. ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది భయాందోళనకు గురయ్యారు.