అమెరికా: సిరియా దాడి చేయడానికి అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరిపి 1,300 మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై సైనిక చర్యను ప్రస్తుతానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ సభ్యుల ఆమోదం లభించిన తరువాత దాడి చర్యపై ఆలోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబమా స్పష్టం చేశారు. అంతకుముందు సిరియా పౌరులపై దాడి ఖండించిన అమెరికా దాని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సిరియా ప్రభుత్వంపై తొలుత దాడి చేయాలని భావించినా వెనక్కుతగ్గక తప్పలేదు.
గతవారం బ్రిటన్ పార్లమెంట్ లో సిరియాపై దాడి తీర్మానం ప్రవేశ పెట్టగా అది వీగిపోయింది. ప్రధాని కామెరాన్ యుద్ధ ప్రయత్నాలను పార్లమెంటు 285-272 ఓట్ల తేడాతో తిరస్కరించింది. లక కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు కూడా కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. సరైన ఆధారాలు లేకుండా సిరియా ప్రభుత్వంపై దాడి చేయడం సబబు కాదని అత్యధిక మంది సభ్యులు తెలిపారు. పా దీంతో ప్రజలు, పార్లమెంటు వ్యతిరేకిస్తున్నందున సిరియాలో జోక్యం చేసుకోబోమని ప్రధాని కామెరాన్ ప్రకటించవలసి వచ్చింది. ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటామని కామెరూన్ తెలపడంతో అమెరికా కూడా వెనకడుగు వేసింది.
కాగా, బరి తెగించి తమపై ఎవరు దాడులకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా, తగిన బుద్ధి చెప్తామని సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ హెచ్చరించారు. సిరియాపై దాడిచేయాలని కోరుకుంటున్న శక్తులకు రసాయన ఆయుధాలు ఒక సాకు మాత్రమేనన్నారు. సిరియన్లు శాంతియుత స్వేచ్ఛా జీవితం గడపడం ఇష్టంలేని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
రసాయన ఆయుధాలు ఉపయోగించింది తిరుగుబాటు సైన్యమేనని అసద్ స్పష్టం చేశారు. దూకుడుగా వ్యవహరించి సిరియాపై సైనిక దాడి చేస్తే.. అది సాహసమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము రసాయన ఆయుధాలు ప్రయోగించామని చెప్పేందుకు ఏ సాక్ష్యాధారాలున్నాయో చూపాలని అసద్ సవాల్ విసిరారు. ఓ వైపు.. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం తనిఖీ నివేదికలు ఇంకా ఇవ్వకుండానే.. తీర్పులు ఇచ్చేస్తున్న శక్తుల ఉద్దేశాలు వేరని వ్యాఖ్యానించారు.