
ఎవరు అనుకున్నారు..ఈ ఏడాది ప్రపంచం స్తంభించిపోతుందని.. కంటికి కనిపించని ఓ పరాన్న జీవి..రాజు, పేద తేడాల్లేకుండా వణికించేస్తుందని.. సగం మానవాళిని ఇళ్లకే పరిమితం చేస్తుందని! ఉద్యోగం.. వ్యాపారం.. విహారం.. వినోదంఅన్నీ ఆగిపోతాయని.. అయినా చైనాలో పుట్టి ప్రపంచాన్ని కబళించేస్తున్న కరోనా మహమ్మారి.. స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. గత డిసెంబర్ 31న చైనా తొలిసారిగా వైరస్ గురించి ప్రకటించింది. జనవరి 1న వూహాన్ సీఫుడ్ మార్కెట్‌ను షట్‌డౌన్ చేశారు..
ఈ వంద రోజుల్లో ఏం జరిగింది?
డిసెంబర్ 31, 2019.. ఒక పక్క ప్రపంచం కొత్త సంవత్సరం ఆహ్వానించడానికి సిద్ధమవుతుండగా.. చైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఓ వార్త ఫ్లాష్ అయ్యింది. ‘కారణం తెలియకుండానే కొందరికి న్యుమోనియా సోకింది’ అన్న ఆ వార్తను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చైనా దక్షిణ ప్రాంతంలో సముద్రజీవుల మాంసం విక్రయించే మార్కెట్‌లో ఓ మధ్య వయస్కురాలితో పాటు మరో 30 మందిలో కనిపించిన ఆ న్యుమోనియా లక్షణాలపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక పంపారు. మరిచిపోయారు.. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా, పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలో మసూచీ, అఫ్గానిస్తాన్‌లో డెంగీ వంటి దాదాపు 12 వ్యాధుల నివేదికలతో బిజీగా ఉన్నడబ్ల్యూహెచ్‌వో.. చైనా నివేదికపై గుర్తించామన్న ముద్ర వేసేసింది. చైనా బయట ఈ కరోనా లక్షణాలేవీ అప్పటికి కనిపించలేదు కూడా. కానీ ఆ తర్వాత ఒక్కో రోజు గడుస్తుంటే ప్రళయం సరిహద్దులు దాటి.. మన దేశానికి.. మన నగరానికి, మన వీధిలోకి.. మన నట్టింట్లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో ప్రజలందరికీ వంద రోజుల్లోనే అర్థమైపోయింది.
చైనా దాటి థాయ్‌లాండ్‌లోకి..
వూహాన్‌లో వ్యాధికి కారణమేమిటన్న విషయం స్పష్టమైన కొన్ని రోజులకే ప్రాణాంతక కరోనా వైరస్ చైనా సరిహద్దులు దాటుకుని థాయ్‌లాండ్‌లో ప్రత్యక్షమైంది. వూహాన్‌లో ఉండే 61 ఏళ్ల వ్యక్తి ఒకరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులు థర్మల్ స్కానర్ల సాయంతో గుర్తించారు. ఒకట్రెండు వారాల్లోనే చాలా ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలున్న వారు భారీ సంఖ్యలో చేరుతున్నట్లు ౖ వూహాన్‌లో వెద్యులు గుర్తించారు. జనవరి 20వ తేదీ అంటే.. వైరస్ ఉనికి స్పష్టమైన 20 రోజులకు గువాంగ్‌డాంగ్ ప్రాంతంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. వీరికి వూహాన్‌తో ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. దీన్నిబట్టి వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతున్నట్లు స్పష్టమయ్యింది.
ఈయూలోని పలు దేశాల్లో..
యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా.. వద్ద అన్న అంశంపై నాలుగేళ్లు మల్లగుల్లాలు పడ్డ బ్రిటన్.. ఎట్టకేలకు జనవరి 31న వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఈ సమస్య తీరిందో లేదో యూనియన్‌లోని పలు దేశాల్లో కరోనా కోరలు చాచడం మొదలుపెట్టింది. స్పెయిన్, ఇటలీల్లో తొలి కేసులు నమోదయ్యాయి. చైనాలో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 వేల మంది వైరస్ బారిన పడ్డారు. చైనా వెళ్లి వచ్చిన వారిపై అమెరికాలో నిషేధం మొదలైంది. జనవరి నెలాఖరుకల్లా వైరస్ భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, రష్యా, స్వీడన్, బ్రిటన్‌లకూ విస్తరించింది. కేరళలో ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 4వ తేదీకల్లా చైనాలో 425 మంది ప్రాణాలు కోల్పోగా, 20 వేల మంది వైరస్ బారినపడినట్లు తేలింది. వూహాన్ నివాసి ఒకరు ఫిలిప్పీన్స్‌లో మరణించడంతో చైనా బయట తొలి కరోనా మరణం నమోదైంది.
మహమ్మారిగా అవతారం..
వైరస్ ఉనికి బయటపడ్డ 71వ రోజున కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1.16 లక్షలకు చేరుకుంది. అమెరికా, బ్రిటన్‌లో స్టాక్‌మార్కెట్లు పతనమైపోయాయి. ఇటలీ, స్పెయిన్లలో మరణాల రేటు ఊపందు కుంది. బ్రిటన్‌లో 456 కేసులు నమోద య్యాయి. భారత్ విషయానికి వస్తే.. మార్చి 12న సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మరణంతో భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. భారత్‌లో మార్చి 22న ఒక రోజు జనతా కర్ఫ్యూ, ఒక రోజు విరామం తర్వాత మార్చి 24 నుంచి 3 వారాల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించారు.
వూహాన్ సీఫుడ్ మార్కెట్ షట్‌డౌన్ జరిగి 100వ రోజున అంటే ఏప్రిల్ 9 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 15.77 లక్షలకు చేరగా, మరణాలు 93 వేలు దాటాయి.
వూహాన్‌లో పుట్టి.. ప్రపంచాన్ని చుట్టి
► 31 డిసెంబర్ 2019: మొదటిరోజు 31 కేసులు,
► 09 జనవరి 2020 : 10వ రోజు 63 కేసులు, ఒకరి మృతి
► 19 జనవరి 2020: 20వ రోజు 122 కేసులు, 3 మరణాలు
► 29 జనవరి 2020 : 30వ రోజు 6,166 కేసులు, 133 మరణాలు
► 08 ఫిబ్రవరి 2020: 40వ రోజు 37,120 కేసులు 806 మరణాలు
► 18 ఫిబ్రవరి 2020 : 50వ రోజు 75,136 కేసులు 2,007 మరణాలు
► 28 ఫిబ్రవరి 2020 : 60వ రోజు 84,112 కేసులు, 2,872 మరణాలు
► 09 మార్చి 2020: 70వ రోజు 1,13,590 కేసులు, 3,988 మరణాలు
►19 మార్చి 2020: 80వ రోజు 2,42,570 కేసులు, 9,867 మరణాలు
► 29 మార్చి 2020: 90వ రోజు 7,20,140 కేసులు, 33,925 మరణాలు
► 08 ఏప్రిల్ 2020: 100వ రోజు 15,11,104 కేసులు, 88,338 మరణాలు
Comments
Please login to add a commentAdd a comment