
ఆశ్చర్యపోయిన ఆర్నాల్డ్
కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న నటుడు సూర్య. హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్ జెంజర్. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురయితే అది నిజంగా అరుదయిన సంఘటనే అవుతుంది. ఆర్నాల్డ్ లాంటి నటుడు తన సమీపంలో ఉంటే ఆయన్ని ఎంతగానో అభిమానించే సూర్య తన అనుభూతుల్ని ఆయనతో పంచుకోకుండా ఉంటారా? సూర్య మంచి హ్యాండ్సమ్‌గా ఉంటారన్న విషయం తెలియంది కాదు. అందుకు కారణం ఆయన చేసే ఎక్సర్‌సైజ్‌లే. సూర్య నిత్యం తన నివాసం సమీపంలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌లోని జిమ్‌కు వెళతారు. అదే విధంగా సోమవారం ఉదయం కూడా అక్కడ తను శరీర వ్యాయామాన్ని చేస్తున్నారు.
అయితే అనూహ్యంగా అక్కడ హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆస్కార్ రవిచంద్రన్ సోదరుడు రమేష్ బాబు ఆర్నాల్డ్‌కు సూర్యను పరిచయం చేశారు. తాను అభిమానించే నటుడు ఆర్నాల్డ్ తన కళ్ల ముందుండడంతో యమా ఖుషి అయిన సూర్య ఆయనంటే ఎంత అభిమానమో చాటుకునేలా తాను పదిలపరచుకున్న ఆర్నాల్డ్ బయోగ్రఫీ పుస్తకాన్ని సమీపంలోనే ఉన్న తన ఇంటి నుంచి తెప్పించుకుని చూపించారు. ఇది ఊహించని ఆర్నాల్డ్, సూర్య అభిమానానికి ఆశ్చర్యపోయారు. ఆర్నాల్డ్ ఐ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి విచ్చేసిన విషయం తెలిసిందే.