
సాక్షి, హైదరాబాద్ : హీరోల అభిమానులు వల్ల సినిమాలు హిట్ కావని, ప్రేక్షకులందరూ చూసి.. ‘సినిమా బాగుంది’ అని అంటేనే హిట్ అవుతాయని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా అటు హీరోలు, ఇటు ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకోవాలని, ఇమేజ్ చట్రాలు, ఫ్యాన్స్ కోరికలు దాటి.. కథ మీద, దర్శకుడి మీద నమ్మకంతో సినిమాలు తీయాలని ఆయన ట్వీట్ చేశారు.
‘హీరో ఫ్యాన్స్ వల్ల సినిమాలు హిట్ అవ్వవు. ప్రేక్షకులు అందరూ, 'సినిమా బాగుంది' అని చూస్తే సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పటికైనా అటు హీరోలు, ఇటు ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకుని, ఇమేజ్ చట్రాలు, ఫ్యాన్స్ కోరికలు అని పోకుండా.. కథ మీద. దర్శకుడి ప్రతిభ మీద గౌరవం ఉంచి సినిమాలు చేస్తే బెటర్’ అంటూ కత్తి మహేశ్ హీరోలకు హితబోధ చేశారు.
ఈ శుక్రవారం విడుదలైన మూడు టాలీవుడ్ సినిమాలపై కత్తి మహేశ్ విభిన్నమైన రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా బాగుందని, తెలుగులో ఇటీవలికాలంలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఇదొక్కటని కత్తి కితాబిచ్చారు. సినిమాలో ప్రధాన తారాగణం అభినయం బాగుందని, కొత్త దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీర్చిదిద్దాడని ప్రశంసించారు. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కినప్పటికీ గాయత్రి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందని, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, అనవసరమైన ట్విస్టుల కారణంగా సినిమా విసుగుతెప్పించేలా మారిందని, అయితే, ఈ సినిమాలో మోహన్‌బాబు, నిఖిలా విమల్ నటన బాగుందని కత్తి ట్వీట్ చేశారు. ఇక వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయిందని కత్తి తేల్చేశాడు. ఈ నేపథ్యంలో తాజా సినిమాల గురించి వ్యాఖ్యానిస్తూ.. కత్తి మహేశ్ ఈమేరకు హీరోలకు హితబోధ చేసినట్టు కనిపిస్తోంది.