
అభిమానులకు సినిమా దేవుళ్లు!
హైదరాబాద్: సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా చాలామందికి కాస్తంత తక్కువ అభిప్రాయం. వాటి గురించి, వాళ్ల గురించి ఎంతో ఆసక్తి ఉన్నా... పైకి మాత్రం ఆ మాట చెప్పరు. కానీ, తీరా ఆ వ్యక్తులు అనుకోకుండా ఎదురుపడినప్పుడు అసలు ఆసక్తి బయటకొచ్చేస్తుంది. హైదరాబాద్‌లో ఇటీవల ఒక యువ హీరో పెళ్లి రంగరంగవైభవంగా జరిగినప్పుడు ఈ సంగతే మరోసారి స్పష్టమైంది. దక్షిణాదిలోని వివిధ భాషా సినీ పరిశ్రమల నుంచి భాగ్యనగరికి దిగివచ్చినవేళ... ఎర్రటి ఎండలోనూ జనంలో అభిమానం వెల్లువెత్తింది. తెల్లటి దుస్తుల్లో, మేకప్, విగ్గు లేకుండా ఆరు పదుల రజనీకాంత్ నడిచివస్తుంటే, ఆయనతో సెల్ఫీలు దిగడం కోసం కల్యాణ ప్రాంగణం వద్ద పెళ్ళికి వచ్చిన మహా మహా అతిథులు సైతం పోటీ పడడం కనిపించింది.
ఇక, తెలుగునాట కూడా పాపులరైన తమిళ హీరో సూర్య వచ్చినప్పుడైతే, పెళ్లికి వచ్చిన పురోహితుల్లో ఒకరు... ఆ పనికి కాస్తంత గ్యాప్ ఇచ్చి, సూర్యను దగ్గరగా చూసి, మాట్లాడేందుకు ఉత్సాహపడ్డారు. చిన్నపిల్లవాడైన తన కుమారుణ్ణి తీసుకొచ్చి, సూర్య కాళ్ళకు నమస్కారం చేయించబోయారు. ఆ యువ కథానాయకుడి నుంచి ఆశీస్సులు తీసుకొనేందుకు పసివాణ్ణి ప్రోత్సహించారు. ఈ మొత్తం వ్యవహారం కాస్తం ఇబ్బందిగా అనిపించిన సూర్య చాలా వినయంగానే ఆ అభ్యర్థనల్ని ఒకటికి, రెండుసార్లు సున్నితంగా తిరస్కరించారు. పొరుగు తారల మీదే ఇంతటి ఆసక్తి కనబడితే, ఇక మన సూపర్‌స్టార్స్ మహేశ్, ప్రభాస్ లాంటి వారు వచ్చినప్పుడు అక్కడ ఎంత హంగామా జరిగిందో వేరే చెప్పాలా? సినిమా తారల్ని వెండితెర వేల్పులనేది బహుశా ఇందుకేనేమో!