
కూల్ గురూ!
సమ్మర్ ధమాకా
అదివారం హాయి హాయిగా గడిచిపోయింది. సోమవారం తరుముకొచ్చేసింది. మళ్లీ ఆరు రోజుల పాటు ఆఫీస్. ఒకపక్క ఎండలు మండిపోతుంటే కాలు బయటపెట్టాలంటే ఒళ్లు మండిపోతుందని భయం అనుకుంటూ టీవీ ఆన్ చేసింది ఆ టీనేజ్ గాళ్. తెరపై కాజల్ అగర్వాల్ తళుక్కుమంది. ఓ యాడ్‌లో మెరిసిపోయింది. ఆ.. ఏముందిలే? ఎంచక్కా మేకప్ వేసుకుని ఉంటుంది. ఆ మేకప్ చెరిగిపోకుండా పక్కనే టచప్ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్లు ఓ ముగ్గురైనా ఉంటారనుకుంది ఆ అమ్మాయి. అంతలోనే సమ్మర్‌కి స్టార్స్ అయినా ఒకటే.., కామన్ పీపుల్ అయినా ఒకటే కదా..
పైగా స్టార్స్ ఎప్పుడూ అందంగానే కనిపించాలాయె. మరి.. సమ్మర్‌లో అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో? ఏమో అనుకుంది. సరిగ్గా ఈ విషయాన్నే కాజల్ అగర్వాల్ ముందుంచింది ‘సాక్షి’. సమ్మర్‌లో అందాన్ని కాపాడుకోవడానికి మీరేం చేస్తారో చెప్పడంతో పాటు కొన్ని టిప్స్ కూడా ఇవ్వండి అంటే.. ‘కూల్ గురూ’ అంటూ కాజల్ అగర్వాల్ చక్రాల్లాంటి కళ్లు తిప్పుకుంటూ టకా టకా చెప్పేసింది.
* ఈసారి ఎండలు బాగానే ఉన్నాయి. హీరోయిన్ అయిన ఈ తొమ్మిదేళ్లల్లో ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఇంత ఎండలను నేను దాదాపు చూడలేదు. అలాగని షూటింగ్ లేకపోతే బాగుంటుందనుకోవడం లేదు. ఏ సీజన్ అయినా నాకు నో ప్రాబ్లమ్. చేతినిండా పని ఉంటే చాలు. కానీ, సీజన్‌కి తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ని కొంత మార్చుకుంటా.
* సమ్మర్, వింటర్ ఏ సీజన్‌కైనా అలోవెరా బెస్ట్. ఆ గుజ్జుని ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే ఎండకు కమిలిపోయిన చర్మానికి పూర్వ నిగారింపు వచ్చేస్తుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములతో పోల్చితే ఇంట్లోనే పెంచుకోవడానికి వీలైన అలోవెరా బెస్ట్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా నేను విటమిన్ సి సీరమ్ కూడా ఉపయోగిస్తా. అందుకే నా చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.
* ఏదైనా క్రీములు వాడాలనిపిస్తే ఫ్రూట్ మాయిశ్చరైజర్స్ వాడండి. నేను వాటినే ప్రిఫర్ చేస్తాను. కెమికల్ క్రీమ్స్‌తో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లోనైనా ఇబ్బందే. అందుకే వాటి జోలికి మాత్రం వెళ్లను. ముఖ్యంగా కోకోనట్‌తో చేసిన మాయిశ్చరైజర్స్‌ను వాడితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
* వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను కచ్చితంగా ఒంటికి పట్టించండి. అలాగే వీలైనంతగా ఒంటిని కవర్ చేసుకుని వెళ్లండి. ఎందుకంటే డెరైక్ట్‌గా సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే చర్మం కమిలిపోయే ప్రమాదం ఉంది.
* ఈ సీన్‌లో కాటన్ దుస్తులు హాయిగా ఉంటాయి. షూటింగ్స్‌లో సీన్‌కి అనుగుణంగా డ్రెస్సులు వాడతాం కాబట్టి, మెటీరియల్ సెలక్ట్ చేసుకునే వీలుండదు. అందుకే విడిగా మాత్రం కాటన్ దుస్తులు వాడతాను. వదులుగా ఉండేవి సెలక్ట్ చేసుకుంటాను.
* వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగండి. ఎక్కడికెళ్లినా చేతిలో ఓ నీళ్ల బాటిల్ మాత్రం తప్పనిసరిగా ఉంచుకోండి. రోజుకు కనీసం రెండుసార్లయినా కొబ్బరినీళ్లు తాగండి. అలాగే మజ్జిగ మాత్రం మిస్ కాకండి.
* ఈ వేసవిలో మన శరీరానికి బాగా చల్లదనాన్ని ఇచ్చేవాటిలో ఫ్రూట్స్‌కి ప్రధాన స్థానం ఇవ్వాలి. అందుకే పండ్ల రసాలు బాగా తాగండి.
* సమ్మర్‌లో దుమ్ము బాగా ఉంటుంది. ఆ దుమ్ము ఎంచక్కా కూరగాయాల మీద సెటిలైపోతుంది. అందుకే వండే ముందు బాగా కడగండి. ఉప్పు నీటిలో కడిగితే ఇంకా బెస్ట్.
* వేసవిలో చాలా మంది భయపడేది వడదెబ్బకే. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు నెత్తి మీద టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసస్ పెట్టుకోవాలి.
* చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సమ్మర్‌ని హాయిగా సాగనంపేయొచ్చు. మరి... వింటర్‌లో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి సమ్మర్‌లో తగినంత కేర్ తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.