
ఫ్లాష్ లైట్ వెలుగులో చిన్నారికి చికిత్స చేస్తున్న వైద్యుడు
లక్నో : యూపీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆసుపత్రిలో కరెంట్ లేకపోవటంతో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స చేయటం విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని శంబాల్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం శంబాల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో.. లో ఓల్టేజ్ కారణంగా కరెంట్ పోయింది. తరుచూ కరెంట్ వస్తూ పోతూ ఉంది. దీంతో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులోనే రోగులకు చికిత్స చేశారు వైద్యులు. చీకటి గదిలో ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు సెల్‌ఫోన్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పట్టుకోగా వాటి వెలుగులో రోగులకు చికిత్స చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావటంతో ఆసుపత్రి వర్గాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. ఏకే గుప్తా మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కరెంట్ పోయింది. ఫ్లాష్ లైట్ వెలుగులో వాళ్లు ఎందుకు చికిత్స చేశారో తెలియటంలేదు. మేము ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామ’’ని చెప్పారు. దీనిపై స్పందించిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దీపేంద్ర కుమార్.. ఆసుపత్రి అధికారులు తప్పు చేసినట్లు రుజువైతే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.