సాక్షి, ముంబైః పదోన్నతులు, జీతాలు, పదవీ విరమణ పెంపు తదితర డిమాండ్లతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ గెజిటెడ్ మెడికల్ ఆఫీసర్స్’ (మాగ్మో) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డాక్టర్ల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో చర్చల అనంతరం మాగ్మో అధ్యక్షుడు రాజేష్ గైక్వాడ్ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. సందర్భంగా రాజేశ్ గైక్వాడ్ మాట్లాడుతూ ‘గత ఆరు రోజులుగా కొనసాగిన సమ్మె కారణంగా ఇబ్బందిపడ్డ రోగులకు మేం క్షమాపణలు చెబుతున్నాం. ఇక నుంచి మా డాక్టర్లంతా రోజుకు రెండు గంటలు అదనంగా పనిచేస్తారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు మేం సమ్మెను విరమిస్తున్నాం’ అని ప్రకటించారు.
మాగ్మో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం అనేక ఆస్పత్రుల రోగులపై పడింది. పరిస్థితి విషమిస్తుండడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం ఆందోళనకు దిగిన డాక్టర్లతో చర్చలు నిర్వహించారు. సహ్యాద్రి అతిథి గృహంలో మధ్యాహ్నం మాగ్మో నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లతోపాటు అనేక విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం సమ్మె చేపట్టినవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జల్గావ్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతి చెందిన అనంతరం సమ్మె నిర్వహిస్తున్న డాక్టర్లపై ‘మహారాష్ట్ర ఎస్సెన్షియల్ సర్వీస్ అండ్ మెయింటెన్స్’ (మెస్మా) పోలీసు ఠాణేలో ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సుజాతా సైనిక్ సూచించారు. సమ్మె విరమించేదాకా చర్చలు ఉండబోవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
అయితే సమ్మె చేపట్టిన ఆరవ రోజు ఎట్టకేలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వారితో చర్చలకు అంగీకరించారు. ఇక నుంచి బీఏఎమ్మెస్ డాక్టర్లకు త్వరగా పదోన్నతులు కల్పించడం, పదవీ విరమణ వయసును పెంచడం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్ల సేవలను క్రమబద్దీకరిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే మాగ్మో సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అష్టకష్టాలకు గురయ్యారు. చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు.
డాక్టర్ల సమ్మె విరమణ
Published Mon, Jul 7 2014 11:17 PM | Last Updated on Mon, Oct 8 2018 5:52 PM
Advertisement
Advertisement