
'ముంబై ప్రజలారా.. అప్రమత్తంగా ఉండండి'
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు రేపు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ అజోయ్ మెహతా హెచ్చరించారు. మరో 24 గంటలూ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్రతీరాలు, బీచ్ ప్రాంతాలకు వెళ్లకూడదని అక్కడి స్థానిక సంస్థ ప్రజలను హెచ్చరించింది. ఈ భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే.
ముంబై నగరంలోని ప్రభుత్వ స్కూళ్లకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్థుల పరీక్షలను వాయిదా వేశారు. ప్రైవేటు స్కూళ్లు సెలవును ప్రకటించక పోవడంతో పిల్లలను పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రలకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వారు హెచ్చరికలు జారీచేశారు. నగరంలో రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపినట్లు రక్షణశాఖ ఓప్రకటనలో పేర్కొంది. శనివారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయటకు రావచ్చని పశ్చిమ రైల్వే పత్రికా ప్రకటనలో తెలిపింది. రేపు కురిసే వర్షాల తీవ్రతను బట్టి స్థానిక రైలు సర్వీసులను నడుపనున్నట్లు ఓ అధికారి వివరించారు.