
అంబేడ్కర్‌కు నివాళి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 62వ వర్ధంతి ‘మహాపరినిర్వాణ్ దివస్’ను గురువారం దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. బాబా సాహెబ్‌కు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. తమ ప్రభుత్వ నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంబేడ్కర్ స్ఫూర్తిగా తీసుకున్నదేనని మోదీ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.‘చరిత్రను మర్చిపోయిన వారు చరిత్ర సృష్టించలేరు’ అన్న అంబేడ్కర్ సూక్తిని ఉదహరిస్తూ.. అంబేడ్కర్ విగ్రహం ఎదుట చేతులు జోడించి నిలబడి ఉన్న తన ఫొటోను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
చైత్యభూమి వద్ద..
ముంబైలో అంబేడ్కర్ సమాధి ఉన్న ‘చైత్యభూమి’ వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి, నివాళులర్పించారు. చైత్యభూమి వద్ద జరిగే కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంబేడ్కర్ అభిమానులు భారీ తెరను ఏర్పాటు చేశారు. మహా పరినిర్వాణ దివస్ ప్రాముఖ్యం తెలిపే లక్ష కరపత్రాలను బృహన్ ముంబై కార్పొరేషన్ పంచిపెట్టింది. బౌద్ధమతాన్ని అవలంబించిన బాబా సాహెబ్ వర్ధంతిని ఏటా మహాపరినిర్వాణ్ దివస్‌గా జరుపుకుంటారు.