
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి భూములు పొందుతున్న విద్యా సంస్థలు షరతులకు లోబడి లేకపోతే వాటిపైన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. శాసనమండలిలో శుక్రవారం రాజధాని పరిధిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ రాజధానిలో విట్, అమృత, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలకు ఎకరం రూ. 50 లక్షల చొప్పున ఆరు వందల ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. అలానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎకరం రూ. 50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమని కేటాయించారని పేర్కొన్నారు. అయితే ఈ యూనివర్సిటీల్లో ఎక్కడా పిల్లలు ఫ్రీగా చదువుకునే అవకాశం లేదని బొత్స మండిపడ్డారు. విద్యా సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు ప్రభుత్వం కొన్ని షరతులు విధిస్తుందని.. వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు ఇంకా ఒక్క పంట కూడా సాగు చేయలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వల్లే రైతు ఆత్మహత్యలు అంటూ టీడీపీ సభ్యులు తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 1160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారిలో కేవలం 454 మందికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారన్నారు. మిగిలిన 706 మందివి రైతు ఆత్మహత్యలా కాదా అనే విషయాన్ని తమ ప్రభుత్వం విచారిస్తుందని.. అర్హులందరికి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు.
అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
730 ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 551 ప్రైవేట్ హాస్పటల్స్‌లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో అస్తవ్యస్తంగా మారిన ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో భాగంగా ఏ ఆస్పత్రిలోనైనా అవినీతికి పాల్పడితే.. అంతకు పది రెట్ల పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అవినీతికి పాల్పడిన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామని హెచ్చరించారు.
తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు బడ్జెట్ ప్రేవశపెట్టామన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు మిషన్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.