
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ కుంభకోణం దేశంలోని పెద్ద కుంభకోణాల్లో ఒకటని సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్ అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన విలేకరులతో ఇష్టాగోష్టికి ఆయన హాజరయ్యారు. పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. కాంగ్రెస్‌కు బోఫోర్స్‌లాగే బీజేపీని రాఫెల్ మచ్చ వెంటాడటం ఖాయమని, ఈ కుంభకోణం బీజేపీకి భవిష్యత్తులో చాలా నష్టం చేస్తుందని అన్నారు. అర్హతలున్న హిందుస్తాన్ ఏరోనాటికల్ సంస్థను కాదని డసాల్ట్ ఏవియేషన్‌కు కాంట్రాక్ట్ దక్కేలా ప్రధాని మోదీ చొరవ చూపడం సరికాదని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వాస్తవాలు వివరించి వారిని చైతన్యవంతులను చేయగలిగే సమర్థత రాహుల్‌గాంధీకి ఉందని తాను విశ్వసించడం లేదన్నారు. రాఫెల్‌పై కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు చట్టాలను ఎగతాళి చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. 1989లో బోఫోర్స్ కుంభకోణం గురించి జనాలకు వివరించడంలో నాటి ప్రతిపక్షనేత వీపీ సింగ్ నుంచి ఎన్టీఆర్ దాకా అందరూ సఫలీకృతులయ్యారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు మాయావతి, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్‌యాదవ్, అఖిలేశ్‌లు చొరవ తీసుకుని, రాఫెల్ కుంభకోణాన్ని ప్రజలకు వివరించాలని, ఆ బాధ్యత వారిపై ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుడిగా మోదీ తీరు వల్ల తాను చాలా నిరుత్సాహానికి గురయ్యానన్నారు. మానవహక్కులు పోలీసులకైనా, తీవ్రవాదులకైనా, ఎవరికైనా ఒకటేనన్న సంగతి మరవవద్దని సూచించారు.
శోధనతోనే వృత్తికి శోభ
ప్రస్తుతం మీడియాపై అప్రకటిత సెన్సార్ నడుస్తోందని కరణ్ థాపర్ ఆవేదన చెందారు. మీడియాలో క్రౌడ్ ఫండింగ్ గురించి మాట్లాడుతూ బీబీసీ లాంటి సంస్థలకు అక్కడి ప్రభుత్వాలు నిధులు సమకూర్చినా అవి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడాన్ని ఆపలేదని గుర్తుచేశారు. విజ్ఞత, పరిశీలన, శోధనే పాత్రికేయ వృత్తికి అసలైన కొలమానాలని పేర్కొన్నారు. సూటిగా, సిసలైన ప్రశ్నలను అడగాలని, అప్పుడే విలేకరులు, రాజకీయ నాయకుల్లోని సామర్థ్యాలు బయటపడతాయన్నారు. సునిశిత పరిశీలన, లోతైన విశ్లేషణతో నిజాలను నిర్భయంగా రాయాలని జర్నలిస్టులకు సూచించారు.
మీడియాలో మీరు వెళుతున్న మార్గం సరైనది కాకపోతే తరాలకు తరాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మీడియాలో ఉన్న ఒత్తిళ్ల కారణంగా పాత్రికేయులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ లాంటి వేదికలు ఇండియాను నిర్దేశించలేవని థాపర్ అభిప్రాయపడ్డారు. కొందరికే మాత్రమే పరిమితమై ట్విట్టర్, సోషల్ మీడియా.. పరిమిత పదాలతో అభిప్రాయాలను పూర్తిస్థాయిలో వ్యక్తీకరించలేని వేదికలని అభివర్ణించారు. నేరవార్తల ప్రసారంలో అత్యుత్సాహం పనికిరాదని హితవు పలికారు.