
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు... నేడు అసెంబ్లీ రద్దు ఊహాగానాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం హడావుడిగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఒక్కరోజే గడువు ఉందని సీఎం కేసీఆర్ అనధికారికంగా పార్టీ నేతలకు తెలియజేయడంతో జిల్లాల్లో ఈ హంగామా కనిపించింది. అధికారులు, ఇతర టీఆర్‌ఎస్ నేతలు ఉరుకులు పరుగుల పెట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్ష నేతలూ తమ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కరోజే వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మరిన్ని వందల కోట్ల పనులు ప్రారంభం అయ్యాయి.
పలుచోట్ల వివిధ పథకాల చెక్కుల పంపిణీ జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రులు కేటీఆర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత... పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా పలుచోట్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment