
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర డైరీ
అదే స్ఫూర్తి నాలోనూ ఉంది
10–02–2018, శనివారం బోడగుడిపాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ఈ రోజు ఉదయం దుండిగం గ్రామంలో పాడి రైతులు కలిశారు. నన్ను కలిశామన్న ఆనందం వాళ్ల కళ్లలో కనిపించినా.. గుండెల్లోంచి బాధ ఎగదన్నుకొచ్చింది. పైసా పైసా అప్పుచేసి పాడి గేదెలను సాకుతున్నారా రైతన్నలు. కరువు కాలంలోనైనా వేడినీళ్లకు చన్నీళ్లలా పాడి తోడుంటుం దని భావించారు. కానీ, నీళ్లకున్న రేటు కూడా పాలకు ఇవ్వడం లేదయ్యా.. అంటూ బాధపడ్డారు. మూగ జీవాలకు మేతే కష్టమవుతోం దట. గడ్డి రేట్లు మిద్దెక్కాయన్నారు. గొడ్డు చాకిరీ తప్పడం లేదన్నారు. ఇంత చేసినా ఆ పాలమ్మితే కన్నీళ్లే మిగులుతున్నాయని బావురుమన్నారు.
వారి ఆవేదన నా గుండెను పిండేసింది. ఆరుగాలం కష్టపడే రైతన్న ఎందుకు నష్టపోతున్నాడు? అదే రైతన్న దగ్గర పాలు తీసుకుని ప్రైవేటు వ్యక్తులు కోట్లాది రూపాయలెలా కూడబెడుతున్నారు? సహకార పాల సంఘాలను బలోపేతం చేస్తే.. పాడి రైతు ఇంత దారుణంగా మోసపోడు కదా. మన ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు లీటర్‌కు 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని చెప్పగానే.. సంబరపడ్డారు. ఆ మంచి రోజులు త్వరగా రావాలని ఆకాంక్షించారు.
నాన్నగారి హయాంలో రైతన్నల ఇంట ఎంత ఆనందం ఉండేదో ఏ ఒక్కరూ ఇంకా మర్చిపోలేదు. పాదయాత్ర దుండిగం దాటాక.. పద్మజ అనే ఓ అమ్మ ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. నాన్నగారి పాలన రైతన్నలకు ఓ స్వర్ణయుగం అని చెప్పింది. వరుణుడు కరుణించడమే కాదు.. పంటకు గిట్టుబాటు ధర ఉండేదని తెలిపింది. బోనస్ ఇవ్వడం ఆయనకే చెల్లిందని చెప్పింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వరికి మద్దతు ధర 13 శాతమే పెరిగితే.. నాన్నగారి కాలంలో 82 శాతం పెరగ డం చరిత్రలోనే గొప్ప విషయమంది. ఈ నాలుగేళ్లలో మద్దతు ధర 17శా తం మించలేదని అంకెలతో సహా వివరించింది. నాన్నగారిది రైతు రాజ్య మైతే.. చంద్రబాబుది రైతు వ్యతిరేక రాజ్యమంది. అందుకే నాన్నగారు అంతగా రైతన్నకు దగ్గరయ్యారేమో. అదే స్ఫూర్తి నాలోనూ ఉంది. ఐతంపాడు వద్ద రేషన్ డీలర్లు కలిశారు. నాలుగేళ్లుగా కష్టాల్లోనే కాలం గడుపుతున్నామన్నారు. ప్రతి కేజీకీ ప్రభుత్వం 70 పైసలు కమీషన్ ఇస్తోందట.
షాపు నిర్వహణకు కూడా అది చాలడం లేదట. వారికొస్తున్న సరుకును కాటా వేస్తే తేడా ఉంటోందట. పైవాళ్లకు చెప్పినా పట్టించుకునే నాథుడే లేడట. అధికార పార్టీ వాళ్లదే రాజ్యమట. ఏం పాపం చేశామని ఇలా వేధిస్తున్నారంటూ వాపోయారు. వ్యూహాత్మకంగా వెంటాడుతున్నార నేది వారి అనుమానం. నిజమే కావొచ్చు. తాజా పరిణామాలు చూస్తుం టే.. వాళ్ల ఆందోళనకు అర్థముంది. ఈ మధ్య చంద్రన్న మాల్స్ వెలుస్తు న్నాయి. పేదల పొట్టగొట్టి, బడాబాబుల జేబులు నింపే కార్యక్రమానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. రిలయన్స్, హెరిటేజ్‌లకు వాటా ఉన్న ఫ్యూచర్ గ్రూపునకు నామినేషన్ పద్ధతిలో వాటిని కట్టబెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా?
ఈ రోజు యాత్ర మొత్తం తాగునీటికి కటకటలాడుతున్న గ్రామాల నుంచి సాగింది. జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేసి, శాశ్వత కరువు నివారణకు చర్యలు తీసుకోకుండా.. కేవలం ప్రజలను మభ్యపెట్టి, మోసపుచ్చి ఓట్లు దండుకోవాలనుకునే నీతి లేని నేతలు పదవుల్లో ఉన్నంతకాలం ప్రజలకు ఈ ఇక్కట్లు తప్పవేమో! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ గత తొమ్మిదేళ్ల హయాంలోగానీ, నేటి పాలనలో గానీ.. గిట్టుబాటు ధర గురించి ఏనాడైనా ఆలోచించా రా? కేంద్రాన్ని ఒక్కసారైనా అభ్యర్థించారా? ఈ నాలుగేళ్లలో మద్దతు ధర పెంచాలని కనీసం ఒక్క లేఖ కూడా రాయకపోవడం సిగ్గుగా అనిపించలేదా?