
ఆంటిగ్వా: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా భారత జట్టులో హార్దిక్ రెగ్యులర్ ఆటగాడిగా ఎదిగిన తీరును పొలార్డ్ కొనియాడాడు. భారత జట్టులో చోటు సంపాదించడం కోసం హార్దిక్ కష్టపడిన తీరే ఇప్పుడు అతన్ని సూపర్ స్టార్‌గా నిలబెట్టిందన్నాడు. ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ ఒక స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
‘నేను ఎప్పుడైతే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడటం మొదలు పెట్టానో అప్పట్నుంచి హార్దిక్‌ను చూస్తున్నాను. తనేంటో నిరూపించుకోవడం కోసం హార్దిక్ ఎప్పుడూ తపించి పోయేవాడు. ఇదేమీ నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఐపీఎల్‌లో నిరూపించుకున్న హార్దిక్.. ఇప్పుడు భారత్ క్రికెట్ జట్టులోని కీలకంగా మారిపోయాడు. భారత్‌కు దొరికిన కచ్చితమైన ఆల్ రౌండర్ హార్దిక్.
వ్యక్తిగతంగా హార్దిక్‌తో నాకు మంచి స్నేహం ఉంది. ఇద్దరం ఎప్పుడూ తప్పులను సరిదిద్దుకోవడం కోసం చర్చించుకునే వాళ్లం. ఆఫ్ ఫీల్డ్‌లో ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో.. అప్పుడే ఆన్ ఫీల్డ్‌లో కూడా మన ప్రదర్శన బయటకు వస్తుంది. అది నిన్ను ఉన్నత స్థానంలో నిలుపుతుంది. అలా ఆత్మవిశ్వాసంతో ఉన్న క్రికెటర్లలో హార్దిక్ ఒకడు. చాలా తక్కువ సమయంలో హార్దిక్ చాలా బాగా ఎదిగాడు. అతని కష్టించే తత్వమే హార్దిక్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని పొలార్డ్ పేర్కొన్నాడు.