
మ్యాచ్‌లో 2 నిమిషాల 56వ సెకను... కొలంబియా డిఫెన్స్‌ను ఛేదించుకొని జపాన్ ఆటగాడు యుయ ఒసాకా దూసుకొచ్చాడు. అతని షాట్‌ను కొలంబియా గోల్ కీపర్ డేవిడ్ ఒస్పినా సమర్థంగా అడ్డుకోగలిగినా... బంతి అతడి చేతుల్లోంచి వేగంగా మళ్లీ వెనక్కి వచ్చింది. అక్కడే కాచుకున్న షిన్జి కగావా బంతిని అంతే వేగంగా మళ్లీ పోస్ట్ వైపు పంపించాడు. అయితే కొలంబియా మిడ్‌ఫీల్డర్ కార్లోస్ శాంచెజ్ బంతిని ఆపే ప్రయత్నంలో అనూహ్యంగా తన కుడి చేతిని అడ్డంగా తెచ్చేశాడు! అంతే... మరో మాటకు తావు లేకుండా రిఫరీ అతడికి రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపడం, ఆ వెంటనే పెనాల్టీ కిక్‌ను కగావా గోల్‌గా మలచడం చకచకా జరిగిపోయాయి... ఆ క్షణం నుంచి పది మందితోనే ఆడిన ప్రత్యర్థి బలహీనతను వాడుకున్న జపాన్ సంచలనం నమోదు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో ఒక దక్షిణ అమెరికా జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా ఘనతకెక్కింది.
సరాన్స్క్: ‘ఫిఫా’ ప్రపంచ కప్ పోరును జపాన్ అద్భుత విజయంతో ఆరంభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో కొలంబియాను చిత్తు చేసింది. జపాన్ తరఫున షిన్జి కగావా (6వ నిమిషం), యుయ ఒసాకా (73వ నిమిషం) గోల్స్ సాధించగా... కొలంబియా తరఫున యువాన్ క్వాంటెరో (39వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ 3వ నిమిషంలోనే శాంచెజ్ రెడ్ కార్డుకు గురి కావడం కొలంబియా అవకాశాలను దెబ్బ తీసింది. ఈ వరల్డ్ కప్‌లో రెడ్ కార్డ్ శిక్షకు గురైన తొలి ఆటగాడు శాంచెజ్ కాగా... వరల్డ్ కప్‌లో మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి చూస్తే ఇది రెండో వేగవంతమైన కార్డు. 1986 వరల్డ్ కప్‌లో ఉరుగ్వే ఆటగాడు అల్బర్టో బటిస్టా 54వ సెకన్లోనే రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు.
జపాన్ దూకుడుగా...
టాస్ గెలిచిన కొలంబియా కెప్టెన్ తొలి అర్ధ భాగంలో ఎటు వైపు నుంచి ఆటను మొదలు పెట్టాలనే విషయంలో కొంత గందరగోళానికి గురి కావడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి నిమిషంలోనే జపాన్ ఆటగాడు ఒసాకా మెరుపులా దూసుకొచ్చి దాదాపు గోల్ చేసినంత పని చేసినా, కీపర్ ఒస్పినా సమర్థంగా అడ్డుకోగలిగాడు. అయితే మూడో నిమిషంలో శాంచెజ్ చేసిన పొరపాటుకు కొలంబియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. శాంచెజ్ ‘హ్యాండ్ బాల్’ దెబ్బకు పెనాల్టీ కిక్ లభించిన జపాన్ దానిని సద్వినియోగం చేసుకుంది. ఒత్తిడిని అధిగమించిన కగావా దానిని గోల్‌గా మలచడంతో జపాన్ ఆధిక్యంలో దూసుకుపోయింది. అనంతరం కొలంబియా పది మందితోనే ఎదురుదాడికి ప్రయత్నించింది. 15వ నిమిషంలో రాడమెల్ ఫాల్కావ్ గోల్‌కు చేరువగా వచ్చినా, జపాన్ కీపర్ దానిని నిరోధించగలిగాడు. ఆ తర్వాత 26వ నిమిషంలో కూడా క్వాడ్రాడో గోల్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎట్టకేలకు మరో 13 నిమిషాల తర్వాత కొలంబియాకు ఫ్రీకిక్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. అడ్డుగోడగా నిలబడిన జపాన్ బృందాన్ని ఏమార్చి యువాన్ క్వాంటెరో చక్కటి గోల్ చేశాడు. గోల్‌ను అడ్డుకునేందుకు అంతా పైకి ఎగరగా క్వాంటెరో మెల్లగా కింది వైపు నుంచి దానిని పాస్ చేశాడు. ఉదాసీనత కనబర్చిన జపాన్ కీపర్ ఎయిజి కవాషిమా ఆఖరి క్షణాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అది గోల్ కాదంటూ కవాషియా వాదించినా... రీప్లేలో బంతి పోస్ట్‌లోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది.
తగ్గని జోరు...
రెండో అర్ధ భాగంలో కూడా జపాన్ జోరు కొనసాగింది. కొన్ని సార్లు కొలంబియా సమర్థంగా అడ్డుకోగలిగినా ఎక్కువ భాగం జపాన్ ఆధిపత్యమే నడిచింది. రెండో అర్ధ భాగం తొలి 15 నిమిషాల్లో 74 శాతం సమయం బంతి జపాన్ ఆధీనంలోనే ఉండటం దీనిని చూపిస్తోంది. 57వ నిమిషంలో తకషుయ్ కొట్టిన బలమైన షాట్ నేరుగా కీపర్ చేతుల్లో పడటంతో జపాన్ కొంత అసహనానికి లోనైంది. 59వ నిమిషంలో కొలంబియా తమ స్టార్ జేమ్స్ రోడ్రిగ్స్‌ను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపింది. 70వ నిమిషంలో జపాన్ సీనియర్ ఆటగాడు కిసుకే హోండాను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకు రావడం వెంటనే ఫలితాన్ని అందించింది. తర్వాతి నిమిషంలో త్రుటిలో గోల్ చేజార్చుకున్న అతను మరో రెండు నిమిషాలకే గోల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఇచ్చిన అద్భుతమైన క్రాసింగ్ పాస్‌ను ఒసాకా హెడర్‌తో పోస్ట్‌లోకి పంపడంతో జపాన్ సంబరాలు చేసుకుంది. చివర్లో బంతి తమ నుంచి చేజారిపోకుండా జపాన్ చురుగ్గా వ్యవహరించడంతో కొలంబియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.
►ప్రపంచకప్ చరిత్రలో 1978 తర్వాత దక్షిణ అమెరికాకు చెందిన నాలుగు జట్లు తమ తొలి మ్యాచ్‌లో నెగ్గకపోవడం ఇదే తొలిసారి.
► జపాన్ ప్లేయర్ కెసుకె హోండా వేర్వేరు మూడు ప్రపంచకప్‌లలో తమ జట్టు సహచరులు గోల్స్ చేసేందుకు పరోక్షంగా సహాయపడ్డాడు.
►1966 తర్వాత ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ అతడే కావడం విశేషం.
►ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి జపాన్ తరఫున ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా ఇజి కవాషిమా (35 ఏళ్ల 91 రోజులు) రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment