
పాఠశాలకు వెళ్లని చిన్నారులు 8000
బీఎంసీ సర్వేలో వెల్లడి
సాక్షి, ముంబై : నగరంలో దాదాపు 8,126 మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడంలేదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వీరిలో 4,480 మంది బాలురు, 3,646 మంది బాలికలు ఉన్నారని తేలింది. సర్వే కోసం 14,124 కార్పొరేషన్ సిబ్బందిని బీఎంసీ నియమించింది. వీరితోపాటు 11,587 టీచర్లు కూడా సర్వేలో పాల్గొన్నారు. విద్యను అభ్యసించని చిన్నారలను గుర్తించడానికి సర్వే చేపట్టినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సందర్భంగా హన్స్‌రాజ్ మోరార్జీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు మోహన్‌దాస్ పూజారి మాట్లాడుతూ.. జూహూలో జూహూ వీధి, దంగర్‌వాడి లోని దాదాపు 40కి పైగా కుటుంబాలను సందర్శించామని, అక్కడ పాఠశాలకు వెళ్లని 10 మంది పిల్లలను గుర్తించామని తెలిపారు. వీరి వివరాలు అధికారులకు అందజేశామన్నారు. మురికి వాడలను, ఇటుక బట్టీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫూట్ పాత్‌లపై తిరుగుతూ పాఠశాలలకు వెళ్లని చిన్నారులను టీచర్లు గుర్తించాల్సిందిగా అన్ ఎయిడెడ్ స్కూల్స్ ఫారమ్ సభ్యులకు పుణే మున్సిపల్ కార్పోరేషన్, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది.