
‘ఆర్‌హెచ్‌పీ’ చేపట్టే సొసైటీలకు రాయితీ
♦ ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వనున్న బీఎంసీ
♦ నీటి నిల్వలు పడిపోతున్న నేపథ్యంలో నిర్ణయం
♦ త్వరలో స్థాయీసమితి ముందుకు ప్రతిపాదన
సాక్షి, ముంబై : నగరంలో ‘రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు’ (ఆర్‌హెచ్‌పీ) ఏర్పాటు చేసుకునే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వాలని బృహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం యోచిస్తోంది. రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక పక్క ముంబైలో కొత్తగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ అంతస్తుల భవనాల వల్ల నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మరోపక్క తారు రోడ్లన్నీ సిమెంట్, కాంక్రీట్ (సీసీ) రోడ్లుగా మారడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ముంబైలో నీటి కొరత సమస్య ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని గ్రహించిన బీఎంసీ పరిపాలన విభాగం, కొత్తగా నిర్మించే భవనాల్లో రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు తప్పనిసరిగా చేపట్టాలని నిబంధనలు విధించింది.
తొలుత విముఖత
ఆర్‌హెచ్‌పీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో బిల్డర్లు తొలుత విముఖత చూపించారు. ఈ ప్రాజెక్టు చేపట్టే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇస్తామని బీఎంసీ చివరకు ప్రకటించింది. అయినా స్థలం కొరత వల్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొత్తగా నిర్మించే భవనాల టై, కాంపౌండ్‌లో 300 చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వైశాల్యంలో చేపట్టే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. నగరంలోఉన్న భవనాలు, చాల్స్, మురికివాడల్లో పొగైన చెత్తను తరలించేందుకు అవసరమైన ప్లాస్టిక్ కుండీలను బీఎంసీ త్వరలో కొనుగోలు చేయనుంది.