మరో 12 సింగరేణి బొగ్గు గనులు | Another 12 Singareni coal mines | Sakshi
Sakshi News home page

మరో 12 సింగరేణి బొగ్గు గనులు

Published Mon, Nov 20 2017 2:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Another 12 Singareni coal mines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కొత్తగా 12 గనులను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో సింగరేణి ప్రాంతంలో పర్యటించి ఆరు భూగర్భ గనులు, మరో ఆరు ఓపెన్‌ కాస్ట్‌ గనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మందమర్రిలో కల్యాణి ఖని–6, కాసిపేట్‌–2, మణుగూరులో కొండాపురం, కొత్తగూడెంలో రాంపూర్, భూపాలపల్లిలో కాకతీయ ఖని–3 లాంగ్‌ వాల్, కాకతీయ ఖని–5 లాంగ్‌ వాల్‌ భూగర్భ గనులతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కిష్టాపురం ఓసీ, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఇందారం, శ్రావణ్‌పల్లి, భూపాలపల్లిలో కాకతీయ ఖని ఓసీ–3, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కోయగూడెం–3, పెద్దపల్లిలో గోదావరి ఖని–10 ఓపెన్‌ కాస్ట్‌ గనులు కొత్తగా రానున్నాయి.

ఈ గనుల్లో తవ్వకాలు జరిపేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాయి. ఈ 12 గనుల ద్వారా సింగరేణి సంస్థ ఏటా 21.07 మెట్రిక్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం సింగరేణి సంస్థకు 29 భూగర్భ, 17 ఓపెన్‌ కాస్ట్‌ గనులు కలిపి మొత్తం 45 బొగ్గు గనులు ఉండగా, కొత్త గనులను ప్రారంభించాక మొత్తం సంఖ్య 57కు పెరగనుంది. ఓపెన్‌ కాస్ట్‌ గనులతో పోల్చితే భూగర్భ గనులతో ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆరు భూగర్భ గనులతో సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రూ.2,300 కోట్ల పెట్టుబడులు
త్వరలో ప్రారంభించనున్న 6 భూగర్భ గనులపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ రూ.2,300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. మందమర్రిలో కల్యాణి ఖని–6పై రూ.430.62 కోట్లు, కాసిపేట్‌–2 ఖనిపై రూ.57.86 కోట్లు, మణుగూరులోని కొండాపురం ఖనిపై రూ.447.21 కోట్లు, కొత్తగూడెంలోని రాంపూర్‌ ఖనిపై రూ.390.64 కోట్లు, భూపాలపల్లిలోని కాకతీయ ఖని–3 లాంగ్‌ వాల్‌పై రూ.564.30 కోట్లు, కాకతీయ ఖని–5 లాంగ్‌ వాల్‌పై రూ.409.5 కోట్ల పెట్టుబడి వ్యయాన్ని సింగరేణి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement