
తెలంగాణ బంద్‌కు మద్దతు: సీపీఐ
ఖమ్మం జిల్లాలోని 136 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న ఖమ్మం జిల్లాలోని 136 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆర్డినెన్స్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్రప్రభుత్వ చర్యకు నిరసనగా గురువారం బంద్ పాటించాలన్నారు. పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లు తడి ఆరకముందే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సరవణలతో ఆర్డినెన్స్ జారీ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్యగా వెంటకరెడ్డి అభిప్రాయపడ్డారు.
బంద్‌కు సీపీఐ(ఎంఎల్- న్యూడెమోక్రసి) సంపూర్ణ మద్దతు
పోలవరం ముంపు సంబంధించి కేంద్రం తీసుకున్న చర్యకు నిరసనగా గురువారం జరిగే బంద్‌కు సీపీఐ(ఎంఎల్- న్యూడెమోక్రసి) నేత జి.గోవర్దన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పార్వర్డ్ బ్లాక్ తెలంగాణ శాఖ కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డిలు సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాగే తెలంగాణ అధికారులు- ఉద్యోగ-కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి కూడా మద్దతు పలికింది.