పారిశ్రామిక పరిధి పెంపు!
* హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు
* పరిశ్రమలకు అనుగుణంగా భూ వినియోగం
* భూ కేటాయింపు, రాయితీలపై రాని స్పష్టత
* ప్రతిపాదిత ప్రాంతంలో మౌలిక వసతుల కరవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించిన కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల పరిధిని మరింత పెంచాలని భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 30 కి.మీ. దూరంలో తయారీ, ఫార్మా బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల భవిష్యత్ పారిశ్రామిక వాడలకు 200 చ.కి.మీ.(50వేల ఎకరాల) విస్తీర్ణాన్ని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. ఇప్పటికే 65 చ.కి.మీ. మేర పారిశ్రామిక ప్రాంతం ఉంది.
గతంలో ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలతో రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో కొత్తగా పారిశ్రామిక వాడలను గుర్తించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 2 లక్షల ఎకరాల భూమి కేటాయించాలని సీఎం భావిస్తోన్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంత పరిధి విసృ్తతి అంశం తాజాగా తెరపైకి వచ్చింది. వాస్తవానికి అత్యధిక శాతం పరిశ్రమలు హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లోనే ఉన్నాయి. నగరంలోని వివిధ పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలకు తరలించాల్సి ఉన్నా అక్కడ ఆశించిన మేర ప్రభుత్వ భూమి లేకపోవడం ప్రతికూలంగా మారింది.
‘ప్లాన్’లో మార్పులు...
ఇండస్ట్రియల్ జోన్ పరిధిని మరింత విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు అనివార్యమవుతాయి. కొత్త ప్రాంతాలను పరిశ్రమల జోన్‌కు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేటాయించిన 50 వేల ఎకరాల భూ వినియోగంపై కూడా ఓ స్పష్టత లేదు. పారిశ్రామిక వాడల ఏర్పాటుపై ప్రభుత్వం నిగ్గుతేలిస్తే అక్కడ భూ వినియోగాన్ని పరిశ్రమల జోన్‌కు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చే సేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధంగా ఉంది.
మౌలిక వసతులేవీ...?
పారిశ్రామిక వాడల కోసం ఔటర్ వెలుపల ఇంతవరకు స్థల సేకరణ జరపలేదు, కేటాయింపుల్లేవు, మౌలిక వసతులు అసలే లేవు. అయినా ప్రభుత్వ ఉత్తర్వులు కొత్త పారిశ్రామిక వేత్తల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఔటర్ వెలుపల 45 ప్రాంతాల ను పారిశ్రామిక వాడల కోసం కేటాయించినట్లు గత ప్రభుత్వం వెల్లడించింది. ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాన్ని చెప్పలేదు. ఔటర్ బయటకు తరలివెళ్లే పరిశ్రమలకు భూ కేటాయింపు, రాయితీలపై సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది.
ఐటీఐఆర్‌లకు మరో ప్రణాళిక...
ఐటీఐఆర్(ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు కింద కేంద్ర నిధు లు రాబట్టుకునేందుకు సర్కార్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఐటీ ఐఆర్‌ల కోసం అవసరమైతే ప్రత్యేకంగా మరో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిం చాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులకు ఆదేశించారు. నిజానికి హెచ్‌ఎండీఏ యాక్టు ప్రకారం నగరంలో మరో అథార్టీ ఉండకూడదు. ఇప్పటీకీ హెచ్‌ఎండీఏ రూపొందించి అమలు చేస్తున్న విస్తరిత ప్రాం త మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌లకు ప్రత్యేకంగా భూములు కేటాయించలేదు. ఇప్పుడు ఐటీ ఐఆర్‌ల కోసం ఆ మాస్టర్‌ప్లాన్‌ను సవరించా ల్సి ఉంటుంది. సాంకేతికంగా ఇది ఇబ్బందులతో కూడుకున్న అంశం కనుక ప్రత్యేకించి ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం మరో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలి. ఇది జరగాలంటే... ఓ ఫంక్షనల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి దాని కింద ఐటీఐఆర్‌లను పెట్టవచ్చని అధికారుల పరిశీలనలో తేలింది. అది కూడా హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉంటుందని చెబుతున్నారు.
రెండు దశల్లో: ఐటీఐఆర్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని సర్కార్ పక్కా ప్రణాళికను రూపొందించింది. మొదటి దశ (2013-2018)లో పూర్తిగా మౌలిక వసతులపైనే దృష్టి కేంద్రీకరించాలన్నది నిర్ణయం. నగరంలో రవాణా మెరుగుదలకు తొలి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఐటీఐఆర్‌ల్లోని 5 జోన్లలో 9 రేడియల్ రోడ్లను గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో మొదటి దశలో 4 రేడియల్ రోడ్లు, రెండో దశలో 5 రోడ్లను నిర్మించాలన్నది లక్ష్యం. తొలి దశలో భాగంగా (రేడియల్ రోడ్ నం.6) నానాల్‌నగర్-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో వరకు, (రే.రో.నం.7) పంజాగుట్ట- ఈదులనాగులపల్లి వరకు, (రే. రో. నం.8) మూసాపేట-బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వరకు, (రే.రో. నం.30) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో - వట్టినాగులపల్లి వరకు రహదారులను మరింత విస్తరించి రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు.