
రాఖీ... ఒక బంధం... తోబుట్టువుల మధ్య అనుబంధాలను ముడివేసే రక్షాబంధన్.. ఈ ఆనంద వేడుకలకు నగరం సన్నద్ధమైంది. అందమైన రాఖీలతో మార్కెట్‌లు కళకళలాడుతున్నాయి. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం నగరంలో వీటి అమ్మకాలతో దుకాణాలు కిటకిటలాడాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రతి ఏటా వైవిధ్యభరితమైన రాఖీలను అందుబాటులోకి తెచ్చే ధూల్‌పేట్ కళాకారులు ఈసారి కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో రాఖీలను రూపొందించారు. కేవలం అందంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే రంగురాళ్లు, రుద్రాక్షలు పొదిగిన జరీ రాఖీలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా నుంచి నగరానికి దిగుమతి అయ్యే ఫ్యాన్సీ రాఖీలపై మహిళలు ఆసక్తి చూపారు. పిల్లలను ఆకట్టుకొనే లైటింగ్, మ్యూజిక్ రాఖీలు వందలాది వెరైటీలతో మార్కెట్‌లో కొలువుదీరాయి. ధూల్‌పేట్, బేగంపేట్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో బుధవారం రాఖీల విక్రయాలతో సందడి నెలకొంది.
సాక్షి, సిటీబ్యూరో :అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అపురూప ప్రేమానురాగాలను ముడివేసే రక్షాబంధన్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దీంతో పాటు రాఖీల తయారీలో శతాబ్దాల ఘన చరిత ధూల్‌పేట్ సొంతం. నిజాంల కాలం నుంచే ధూల్‌పేట్ రాఖీలకు పెట్టింది పేరు. అద్భుత సృజనాత్మకతకు ఆలవాలం. ఇక్కడి కళాకారులు సమున్నత ప్రతిభ చాటుతారు. రాఖీ పండగ వచ్చిందంటే ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమగా మారుతుంది. 2 నెలల ముందు నుంచే రాఖీలను తయారు చేయడంలో నిమగ్నమవుతారు. లక్షల కొద్దీ డజన్లలో మార్కెట్‌కు చేరవేస్తారు. ఈ అందమైన రాఖీల్లో ఇప్పుడు మరిన్ని వెరైటీలు మార్కెట్‌లో
దర్శనమిస్తున్నాయి.
ఎన్ని వెరైటీలో..
కోల్‌కతా నుంచి ఫ్యాన్సీ, ధూల్‌పేట నుంచి జరీ రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. జరీ రాఖీల్లోనూ 400 వరకు వెరైటీలు ఉన్నట్లు ధూల్‌పేట్‌లోని కోటా రాఖీ భండార్ నిర్వాహకులు రవీందర్ చెప్పారు. తెలుపు, ఎరుపు పూసలతో రాఖీలను రూపొందిస్తున్నారు. వాటిలో ఏడీ, సీటూ రాళ్లు పొదుగుతున్నారు. ఇవి అచ్చం ఆభరణాల్లాగే ఉంటాయి. ‘ఈ తరహా జరీ రాఖీల ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది’ అని రవీందర్ తెలిపారు. వెల్‌వెట్ క్లాత్‌పై రకరకాల స్టోన్స్‌తో రాఖీలను రూపొందిస్తున్నారు. ఈ రాఖీలు రూ.50 నుంచి రూ.500 వరకు కూడా లభిస్తున్నాయి. కొన్నింటి ధరలు రూ.1000 వరకు ఉన్నాయి. వీటిని వెండితో తయారు చేశారు. ఆకట్టుకునే మెటల్స్‌ను వినియోగించారు. మరోవైపు కేవలంఆకర్షణ కోసం వినియోగించే రాళ్లే కాకుండా నాణ్యమైన రంగురాళ్లను కూడా రాఖీల్లో కూర్చారు. ‘రక్షాబంధన్ అన్నదమ్ములతో తమ అనుబంధాలను పంచుకోవడమే కాకుండా వారికి ఆయురారోగ్యాలను, అదృష్టాలను ప్రసాదించాలని కోరుకొనే వేడుక. అందుకే అదృష్ట రాళ్లు పొదిగిన రాఖీలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. వీటిని ఒక్క రోజు ధరించి వదిలివేయకుండా ఆ రాయిని ఏడాది పొడవునా ధరించవచ్చు. వినియోగదారుల అభిరుచి మేరకు రుద్రాక్షలను కూడా జత చేస్తున్నామ’ని ఓ కళాకారుడు వివరించారు.
ఇదీ చరిత్ర..
♦ రక్షాబంధన్‌కు గొప్ప చరిత్ర ఉంది. శిశుపాలుని వధించే క్రమంలో సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి వేలికి గాయమవుతుంది. ఆ గాయానికి ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకడుతుంది. చెల్లెలుగా తన అనుబంధాన్ని చాటుకుంటుంది.
♦ పురుషోత్తముడికి అలెగ్జాండర్‌కు జరిగిన యుద్ధం సందర్భంగా తన భర్తను రక్షించాలని కోరుతూ అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీని అందజేస్తుంది.
♦ మొఘలుల కాలంలో చిత్తోడ్ రాణి కర్నావటి అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీని అందజేసి రక్షణ కోరినట్లు చరిత్ర చెబుతోంది.
♦ జాతీయోద్యమకాలంలో ప్రజల మధ్య ఐక్యతను, సంఘటితత్వాన్ని ఏర్పరిచేందుకు రాఖీలను ధరించేలా ప్రోత్సహించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపునిచ్చారు.
♦ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే రాఖీ పండగ తొలినాళ్లలో కేవలం తెల్లటి నూలు దారానికి పసుపు రుద్ది కంకణంలా కట్టేవారు. ఆ తర్వాత రకరకాల రంగుల్లో దారాలను తయారు చేశారు. వాటికి పైన దారంతోనే పూల ఆకృతులను రూపొందించారు.
♦ అనంతరం స్పాంజ్‌తో రాఖీలను తయారు చేశారు. వీటిపై మెరుపు కాగితాలను అతికించి వాటిని అందంగా అలంకరించారు. ఇవి మణికట్టు నిండా ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి.
♦ ఇప్పుడు ఫ్యాన్సీ, జరీ రాఖీలు ఎక్కువగా తయారు చేస్తున్నారు. వీటిలోనూ వందలకొద్దీ వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి.
పోలీస్ బ్రదర్స్.. మా సేవియర్స్
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మ్యాజిక్ ఎఫ్‌ఎం రేడియో 106.4 ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, షీ టీమ్స్ సిబ్బందికి రాఖీలు కట్టారు. ప్రజారక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు క్షేమంగా ఉండాలని రాఖీలు కడుతున్నామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ ఇందిర, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ మాణిక్ రాజ్, షీ టీమ్స్ సీఐ సునీత, ఎఫ్‌ఎం రేడియో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాఖీ కట్టండి.. హెల్మెట్ ఇవ్వండి
మణికొండ: రాఖీలు కట్టడంతో పాటు తమ సోదరులకు ఓ హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చి వారి మేలు కోరాలని రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్, ఎనర్జీ సలహాదారు ఏకే గోయల్ పేర్కొన్నారు. బుధవారం గండిపేట మండలం, వట్టినాగులపల్లి శివారులోని శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిస్టర్ ఫర్ చేంజ్– గిఫ్ట్ ఎ హెల్మెట్’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి, కళాశాల జాతీయ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ వాడకపోవటంతోనే మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ మల్లీశ్వరి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
టామ్ – జెర్రీ .. సూపర్‌మ్యాన్..
రాజస్థాన్‌లో విత్తనాల రాఖీలు,. ఆర్మీ జవాన్‌లకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు.. భోపాల్‌లో మోదీ రాఖీలు.. ఇలా ఈ ఏడాది దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన రాఖీలు ఫేమస్ అవుతున్నాయి. కొత్త ట్రెండ్ పట్ల, కొత్త తయారీ పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఈసారి నగర అంగళ్ల నుంచి ఆన్‌లైన్ దుకాణాల వరకూ ఎన్నో రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్న రాఖీలు ఇలా ఉన్నాయి..
ఎకో రక్షా బంధన్..
దూది, బంగారు, వెండి, మెరుపు కాగితం రాఖీలకు కాలం చెల్లిపోయింది. ఎన్నో రకాల కాన్సెప్టులు, డిజైన్‌లు, మెటీరియల్స్‌తో రాఖీలు రూపొందాయి. ముఖ్యంగా పర్యవరణ హిత రాఖీలపై ఆసక్తి పెరిగింది. నువ్వూ, నేను, మనందరం కలిసి ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలనే బాధ్యతను ఈ బీజ్ (విత్తన) రాఖీల ద్వారా తెలియచేయవచ్చుంటున్నారు రాఖీ తయారీ దారులు, కొనుగోలుదారులు. పండగ తర్వాత రాఖీ చెత్తలోకి కాకుండా పూర్తిగా మట్టిలో కలిసి పోవటం, అందులో విత్తనం మొక్కగా నాటుకోవటం.. చక్కటి బహుమతి, ఆనుభూతి అంటూ మురిసిపోతున్నారు. ఉభయకుశలోపరి అన్నట్టు ఎకో ఫ్రెండ్‌లీ రాఖీలపై ఈసారి ఆసక్తి బాగా పెరిగిందంటున్నారు టెర్రకోట రాఖీల తయారు చేసే కృష్ణలతా అంకెం.
తినే రాఖీ..
పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు అంటే ఎంతిష్టమో విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చేతికి కట్టిన రాఖీ, లాలీపాప్‌లా తినొచ్చు అంటే మారాం లేకుండా రాఖీ కట్టించుకునేందుకు రెడీ అయిపోతారు చిన్నారులు. అందుకే నగరంలో బేకర్స్ ఈ రాఖీల తయారీ ముందు నుంచే మొదలుపెట్టారు.
గేమ్స్.. కార్టూన్స్.. రాఖీస్..
రాఖీ పండుగ అనగానే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, టీనేజర్లే ప్రముఖంగా గుర్తుకు వస్తారు. పిల్లలను బాగా ఆకట్టుకునే చోటా భీం, డోరెమాన్, నోబితా, టామ్‌అండ్‌జెర్రీ, సూపర్‌మ్యాన్ తదితర కార్టూన్‌లతో కూడిన ఎన్నో రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది రాఖీ పండగ, స్వాతంత్య్ర దినోత్సవం ఒకేసారి రావడంతో జాతీయ జెండా రంగులున్న రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. దేశభక్తి, సోదర ప్రేమను ఏక కాలంలో చాటుకోవడానికి ఈ రాఖీలను ఎంచుకుంటున్నారు.
ఎంతెత్తుకెదిగినా తమ్ముడే కదా..!
అంబర్‌పేట: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నచందంగా.. ఆయన ఎంత ఎదిగినా అక్కలకు మాత్రం తమ్ముడే. ఇద్దరు అక్కల చిన్న తమ్ముడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఏటా తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకుంటారు. ప్రతి రాఖీ పండగకు ఇద్దరు అక్కలు ఆయన నివాసానికి వచ్చి మనసారా దీవించి రాఖీ కడతారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి మహిళలందరితో ఒక అన్నగా ఆప్యాయతను పంచుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండగకు మాత్రం ఆయన కేంద్రమంత్రి హోదాలో ఢిల్లీలో గడపనున్నారు.
బ్రహ్మకుమారీలు ప్రత్యేకం..
రాయదుర్గం: రాఖీ పౌర్ణమిని ‡బ్రహ్మకుమారీలు ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నుంచి మొదలుకుని సామాన్య పౌరుడికి సైతం గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని బ్రహ్మకుమారీలు రాఖీలు కడతారు. వీరు కట్టే రాఖీలు ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. వీటిపై పరమాత్మ బొమ్మ బిందు స్వరూపం ఉంటుంది. రాఖీలను ఆత్మ, బిందు, పరమాత్మ స్వరూపాలకు ప్రతీకగా వీరు భావిస్తారు. విజయానికి ప్రతీకగా భావించే చందన తిలకాన్ని కూడా దిద్దుతారు. చివరగా ఆప్యాయత, ప్రేమను పంచడానికి మిఠాయిలు తినిపిస్తారు. ఇలా ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరంలో ఈ నెల 11 నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించారు. మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు, బుధవారం టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి రాఖీలు కట్టారు. నేడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్‌కు రాఖీలు కట్టనున్నారు.
పర్యావరణ ‘బంధం’
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పర్యావరణ హిత రాఖీలను చూడముచ్చటగా తయారు చేశారు. సామాజిక బాధ్యతలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఇంట్లోనే లభించే ముడిసరుకుతో, వాడి పారేసిన వస్తువులతో వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంట్లోనే లభించే దూది, దారంతో పాటు పూల నుంచి తీసుకున్న రంగులను వీటికి అద్ది మరింత ఆకట్టుకునేలా చేశారు. పర్యావరణహిత ఆవశ్యకతను ఇలా చాటి చెప్పారు. విభిన్న రకాల రాఖీలను రూపొందించి రక్షాబంధన్ వేడుకలను పాఠశాల ఆవరణలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ రాఖీలను విక్రయించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును పాఠశాలలో అభివృద్ధి కోసం తమవంతు సాయంగా అందిస్తామని విద్యార్థులు తెలిపారు. రక్షా బంధన్ వేడుకలను తమ విద్యార్థులు సామాజిక స్ఫూర్తితో నిర్వహించారని పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అనిత ఆనందం వ్యక్తం చేశారు.
మీరే మాకు రక్ష!
కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని 1ఈఎంఈ సెంటర్‌లో ఆర్మీ జవాన్‌లు ఒకరోజు ముందుగానే రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండే జవాన్లకు స్థానిక పాఠశాలల విద్యార్థులు రాఖీ కట్టి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. దేశరక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులను దేశపౌరులంతా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉండటం ఎంతో స్ఫూర్తినిస్తోందని 1ఈఎంఈ సెంటర్ అఫీషియేటింగ్ కమాండెంట్ కల్నల్ దేబబస నందా అన్నారు. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, మెహిదీ పట్నంలోని ఎంఎన్‌ఆర్ స్కూలు విద్యార్థినులు ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు.