ఊరు కదిలింది. ఇంటికొకరు తరలి వచ్చిండ్రు.
ఊరు కదిలింది. ఇంటికొకరు తరలి వచ్చిండ్రు. చెత్తపై యుద్ధం ప్రకటించిండ్రు. చీపుర్లు పట్టిండ్రు. చెత్త కనిపించకుండా కొన్ని గంటల్లో ఊరు మొత్తాన్ని ఊడ్చిండ్రు. అంతే, ఊరంతా తళుక్కుమని మెరిసిపోయింది.
భీమ్‌గల్: భీమ్గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో శుక్రవారం స్థానిక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా స్వచ్ఛ భారత్‌కు ఊరు కదిలివచ్చింది. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఆడామగా అనే తేడా లేకుండా ఇంటికొకరు తరలివచ్చారు. చీపుర్లు పట్టి గ్రామంలోని రోడ్లన్నీ ఊడ్చేశారు. మురికి కాల్వలలో పూడిక తీసి బ్లీచింగ్ చల్లారు. కాలనీలలో చెత్తను వేసేందుకు సిమెంటుతో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. ఊడ్చిన చెత్తను తరలించేందుకు నూతనంగా తోపుడు బండ్లను తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జడ్‌పీటీసీ సభ్యురాలు బాదావత్ లక్ష్మీ శర్మన్ నాయక్, భీమ్‌గల్ సొసైటీ చైర్మన్ చౌట్‌పల్లి రవిలు కూడా గ్రామస్తులతో కలిసి చెత్తను ఊడ్చారు. యువకుల కృషిని, గ్రామస్తుల సహకారాన్ని అభినందించారు. గ్రామాన్ని చెత్త రహితంగా ఉంచుతామని గ్రామస్తులందరూ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు చెత్తతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.
కార్యక్రమంలో యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు మానిక్యాల శ్రీనివాస్, మెండోరా ఎంపీటీసీ ఆరె రవీందర్, స్థానిక సర్పంచ్ సత్తెమ్మ, ఈజీఎస్ ఏపీఎం శకుంతల, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు సిద్దపల్లి రాములు, తుపాకుల గంగారాం, కృష్ణ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ధర్పల్లి రాజన్న, భీమ లింబాద్రి, మార్పాక రాజన్న, గొల్ల భూమన్న పాల్గొన్నారు. ఇది మిగతా గ్రామాలకూ ఆరదర్శం కావాలని ఆశిద్దాం.