
అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి విజయఢంకా మోగించారు. ఆ తర్వాత అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్‌ఎస్.. నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.. మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్తో పాటు పార్టీ నేతలు నివాళులు అర్పించారు.