ధోనీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. అయినా ప్చ్!
అంటిగ్వా: 108.. అక్షరాలా మహేంద్రసింగ్ ధోనీ హాఫ్ సెంచరీ చేయడానికి తీసుకున్న బంతులివి. ఆదివారం అంటిగ్వాలో జరిగిన భారత్-వెస్టిండీస్ నాలుగో వన్డేలో 46 ఓవర్ వరకు ఎంతో నిదానంగా.. మరెంతో ఓపిగ్గా ఆడిన ధోనీ అర్ధసెంచరీ చేశాడు. ధోనీ కెరీర్‌లోనే ఇది అత్యంత నిదానమైన అర్ధసెంచరీగా మిగిలిపోయింది. అంతేకాదు గత 16 ఏళ్లలో భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యంత స్లోయెస్ట్ హాఫ్ సెంచరీగా కూడా ఇది 'నత్త' రికార్డును మూటగట్టుకుంది.
లక్ష్యం చిన్నది కావడంతో ఇంత కష్టపడి, మైదానంలో ఎంతో ఓపిగ్గా చివరివరకు ఉన్న ధోనీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయాడు. అంతంతమాత్రంగానే ఆడుతున్న వెస్టిండీస్ జట్టు విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిలబెట్టుకోలేకపోయింది. ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజ్‌లో ధోనీ ఉండటంతో చివరివరకు అభిమానులు ఆశల్లో ఊరేగారు. కానీ, ధోనీ ఈ పిచ్‌పై పరుగులు రాబట్టడం గగనమైంది. సింగిల్స్ కూడా కష్టమైన దశలో ధోనీ 49వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. లక్ష్యఛేదనకు ఏడు బంతులకు 14 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ ఔటవ్వడంతో వెస్టిండీస్ విజయం ఖాయమైంది. ఆ జట్టు ఆటగాళ్ల మోములో సంతోషం విరబూసింది. ఆ తర్వాత టీమిండియా ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 49.4 ఓవర్‌లో 178 పరుగులకు భారత్ ఆలౌటైంది. 11 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం. ఇటీవలికాలంలో ఇంత తక్కువస్కోరును చేసి విజయం సాధించిన జట్టు లేదు. మొత్తానికి పుంజుకున్న వెస్టిండీస్ జట్టు జమైకాలో జరిగే ఐదో వన్డే పట్ల ఆసక్తి పెంచింది.