లండన్: బ్రిటన్‌లో భీకర అగ్నిప్రమాదం సంభవించింది. వెస్ట్ లండన్‌లోని 27 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాంకస్టర్ వెస్ట్‌ఎస్టేట్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్ రెండో అంతస్తులో మంటలంటుకున్నాయి. పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. పక్కనున్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 40 ఫైరింజన్లతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం) మంటలు చెలరేగినట్టు సమాచారం. 1974లో నిర్మించిన గ్రెన్‌ఫెల్ టవర్‌లో 120 ఫ్లాట్‌లు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో ఎంత చిక్కుకున్నారన్నది వెల్లడికాలేదు.
పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతూ మండే అగ్నిగోళాన్ని తలపిస్తున్న భవనాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. జనం నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పలువురు సజీవదహనం అయిపోవడం కళ్లారా కనిపిస్తోందని ప్రత్యక్షసాక్షులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేశారు.
దాదాపుగా అన్ని ఫ్లాట్లు మంటల్లో చిక్కుకుపోయాయి. లోపలున్న జనం బయటకు రావడానికి కూడా వీలులేనంతగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా అతికష్టం మీద లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. లోపలున్న జనం సహాయం కోసం పెద్దఎత్తున హాహాకారాలు చేస్తున్నారు. మంటల ధాటికి భవనం కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే జరిగితే పెనువిషాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
27 అంతస్తులున్న ఈ భవంతి లోపలి రాకపోకలకు ఒకే మార్గం ఉంది. సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ప్రమాదకరమని గతంలోనే అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చిన్న ప్రమాదమైన నష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని, జాగ్రత్త వహించాలని ఆదేశించారు. అయినా అపార్ట్‌మెంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడం పెను ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.