2వేల నోటులో ఈ సెక్యూరిటీ ఫీచర్ మీకు తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత.. కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోటు గురించి ఇప్పటికే అనేక విషయాలు బయటకు వచ్చాయి. కానీ, అందులో ఉన్న ఒక సెక్యూరిటీ ఫీచర్ గురించి మాత్రం ఇంతవరకు ఎక్కడా పెద్దగా తెలియలేదు. తాజాగా ఆ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. ఇందులో ''ఇంటాగ్లియో'' అనే ఫీచర్ ఉందని, ఇందులో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్‌ను చొప్పిస్తారని వివరించింది. అసలైన నోటు ఏదో.. నకిలీ నోటు ఏదో గుర్తించాలంటే ఒక వస్త్రాన్ని తీసుకుని దాంతో నోటు మీద రుద్దాలని, అలా రుద్దినపుడు టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పుడుతుందని ఆర్థికశాఖ చెప్పింది. నోటులో ఉన్న ఇంకు వస్త్రంలోకి బదిలీ కావడం వల్ల అలా జరుగుతుందని తెలిపింది. చిన్నపాటి షాక్ లాంటిది తగిలితే అది అసలైన నోటు అని, తగలకపోతే అది నకిలీనోటు అని గుర్తించవచ్చని ఇప్పుడు స్పష్టమైంది.
అయితే ఇంతకుముందు మాత్రం.. ఈ నోటులో కొత్త భద్రతా ఫీచర్లను ఏమీ జోడించలేదని కొంత ప్రచారం జరిగింది. హై సెక్యూరిటీ ఫీచర్లను జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని, ఈ ప్ర్రక్రియకు కనీసం ఐదు నుంచి ఆరేళ్ల సమయం పడుతుందని మొదట్లో చెప్పారు. వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్తచిత్రం లాంటి ఇతర ఫీచర్లు చేర్చడానికి అనేక అనుమతులు, మంత్రివర్గ ఆమోదం అవసరమని అన్నారు. కానీ ఇప్పుడు ఆర్థికశాఖ ఈ కొత్త విషయాన్ని వెల్లడించడంతో కొత్తనోట్ల భద్రత విషయమై ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలు తొలగిపోవచ్చు.