వాషింగ్టన్: సిరియా సంక్షోభం పరిష్కారానికి దౌత్య మార్గాన్ని అన్వేషించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. అయితే, ఒకవేళ చర్చలు విఫలమైతే తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆయన సూచించారు. వైట్‌హౌస్ నుంచి టీవీ చానళ్ల ద్వారా బుధవారం చేసిన ప్రసంగంలో ఒబామా, సిరియా రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణకు అప్పగించాలన్న రష్యా ప్రతిపాదన సానుకూల సంకేతమని అన్నారు. ఈ అంశంపై అమెరికా, రష్యా అధికారులు చర్చలు జరుపుతారని, తాను కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చిస్తానని చెప్పారు. సిరియాపై సైనిక దాడి కోసం తాను కోరిన అనుమతిపై ఓటింగును వాయిదా వేయాలని ఒబామా సెనేట్‌ను కోరారు. సిరియా విషాదానికి ముగింపు పలికేందుకు భద్రతా మండలి ప్రభావ వంతమైన పాత్ర పోషించాలని ఐరాస అధినేత బాన్ కీ మూన్ అన్నారు.