Orissa
-
నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి రాక
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పర్యటన ఖరారైంది. డిసెంబరు నెల 4న పూరీ బ్లూ ఫ్లాగ్ తీరంలో నేవీ దినం వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సొంత జిల్లా మయూర్భంజ్ సందర్శిస్తారు. వచ్చే నెల 3న స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. మర్నాడు పూరీ సాగర తీరంలో జరగనున్న నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటారు. అదే రోజు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం ఓయూఏటీ 40వ కాన్వొకేషను కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబరు నెల 5న కొత్త జుడిషియల్ కోర్టు సముదాయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. మర్నాడు కోల్కత్తా మీదుగా ఆమె సొంత జిల్లా మయూర్భంజ్ చేరుతారు. కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక హెలికాప్టరులో మయూర్భంజ్ రొంగొమటియా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో దళిత గ్రామం ఉప్పొరొబెడా చేరుతారు. ఈ ప్రాంతంలో రాష్ట్రపతి విద్యాభ్యాసం పొందిన ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడి ఉపాధ్యాయులు, బాలలతో ప్రత్యక్షంగా సంభాషించి కాసేపు ముచ్చటగా కాలక్షేపం చేస్తారు. రాయరంగపూర్ తన సొంత ఇంటిలో ఆరోజు మద్యాహ్న భోజనం చేస్తారు. స్వగ్రామం ఆస్పత్రిలో అంబులెన్సు వాహన సేవల్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం రాయరంగపూర్ మహిళా కళాశాల సందర్శన పురస్కరించుకుని విద్యార్థినులతో సంభాషిస్తారు. అక్కడి పుణేశ్వర ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగియడంతో సొంత ఇంటికి చేరి రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానికులతో కలిసి మెలిసి కాసేపు గడిపి దండబోష్ ఎయిర్ స్ట్రిప్ నుంచి వాయు మార్గంలో బంగిరిపొషి చేరుతారు. ఆ ప్రాంతంలో 3 రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకు స్థాపన చేస్తారు. వీటిలో బాదం పహాడ్ – కెంజొహర్‌గొడొ, బంగిరపొషి – గోరుమొహిషాని మరియు బురామరా – చకులియా రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత పరిశోధన కేంద్రం నిర్మాణం, దండబోష్ ఎయిర్ స్ట్రిప్, సబ్ ఆస్పత్రి అభివృద్ధికి శంకు స్థాపన చేస్తారు. కార్యక్రమాలు ముగించుకుని కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారు. -
విద్యార్థుల మేధాశక్తికి ప్రదర్శనలు అవసరం
రాయగడ: విద్యార్థుల మేధాశక్తికి పదునుపెట్టేలా విధంగా విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కల్యాణసింగుపూర్ అటవీ శాఖ రేంజర్ చందన్ గొమాంగొ అన్నారు. జిల్లాలొని కల్యాణసింగుపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన విజ్ఞాన ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను కనబరిచేందుకు ఇలాంటివి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సమితిలో గల వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 80 ప్రాజెక్టులను ప్రదర్శించారు. సమితి ఏబీఈఓ మోహనరావు కొండగిరి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనకు బహుమతులను అందజేశారు. బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌పై కేసు నమోదు రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దేవి ప్రసాద్ పట్నాయక్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిసంకటక్‌లో గల ఆదివాసీ ఉన్నయన పరిషత్ తరఫున సొమవారం సాయంత్రం ఈ మేరకు పొలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడం విశేషం. ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అంగద్ కుట్రుక, సహకార్యదర్శి అభికలకకల నేతృత్వంలో ఆదివాసీలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పట్నాయక్ పై కేసు వేశారు. ఈ నెల 15వ తేదీన దేవి పట్నాయక్ తన వ్యక్తిగత ఫేస్బుక్లో ఈ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు ఎందుకూ పనికిరాని దద్దమ్మలని పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ఆ ప్రాంత ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అధ్యక్షులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. అది పొరపాటును పోస్ట్ అయ్యిందని, వెంటనే డిలీట్ చేశానని ఆయన అన్నారు. దీనిపై ఆదివాసీ నాయకులతో మాట్లాడతానన్నారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
● కనీస మద్దతు ధర రూ.2,300 ● సాగు పెట్టుబడి ప్రోత్సాహం రూ.800 ● డిప్యూటీ సీఎం కనక వర్ధన్ సింగ్ దేవ్ ప్రకటనభువనేశ్వర్: రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని డిప్యూటీ సీఎం, వ్యవసాయం, రైతు సాధికారిత విభాగం మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. ఈసారి ధాన్యం విక్రయించే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,300 లతో అదనంగా సాగు పెట్టుబడి ప్రోత్సాహం కింద రూ.800లు లభిస్తాయి. ఈ మొత్తం విడుదల డిసెంబర్ 8వ తేదీ నుంచి ఆరంభం అవుతుంది. రైతుల పొదుపు ఖాతాకు ప్రత్యక్షంగా ఈ సొమ్ము బదిలీ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. పారదర్శకంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు తొలిసారిగా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. పూర్తి విభిన్నంగా రైతులకు అనుకూలంగా ఉండే రీతిలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సమగ్ర ప్రక్రియ అత్యంత సరళంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేశారు. విక్రయానికి సిద్ధం చేసిన ధాన్యం నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేక ధాన్య నాణ్యత విశ్లేషకులను నియమించారు. వరి సేకరణ, కొనుగోళ్లు మండీ ప్రాంగణాల్లో ఈ యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. వరి సాగు పుష్కలంగా ఉండి అధికంగా విక్రయించే ప్రాంగణాల్లో ఈ నిపుణుల బృందాలను నియమించారు. కొన్ని ప్రాంతాలు మినహా అత్యధిక ప్రాంతాల్లో ధాన్యం నాణ్యత విశ్లేషకులు అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు. సందేహాల నివృత్తికి ధాన్యం విక్రయాలు పురస్కరించుకుని రైతాంగం సందేహాల నివృత్తికి సమగ్ర నియమావళి అందుబాటులో ఉంటుంది. వరి నాణ్యత (తేమ వంటి అంశాలు) విశ్లేషణ పారదర్శకంగా ప్రదర్శితం అవుతుంది. ఒక్కో రైతు వరి విక్రయం పురస్కరించుకుని 2 చొప్పున టోకెన్లు జారీ చేస్తారు. వీటిలో ఒకటి రైతు దగ్గర, మరొకటి ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని ఆధారంగా వరి విక్రయం లావాదేవీల సమగ్ర సమాచారం పారదర్శంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ లెక్కన ఈ ఏడాది వరి విక్రయం అత్యంత సరళీకర వ్యవస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా విజయవంతం కాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
వన్డే మ్యాచ్ టికెట్ ధరలు తగ్గింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ ధరల్ని తగ్గించినట్లు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ మంగళ వారం ప్రకటించారు. స్థానిక కళింగ స్టేడియంలో మంత్రి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 9వ తేదీన కటక్ బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. క్రీడా విభాగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఓసీఏ అధికార వర్గాలు, రాష్ట్ర క్రీడా విభాగం అధికారులు సమావేశమై చర్చించారు. లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన భారత్, ఇంగ్లండు వన్డే క్రికెటు మ్యాచ్ టికెటు ధరల్ని తగ్గించాలని నిర్ణయించారు. న్యూ పెవెలియన్, కార్పొరేటు బాక్సు టికెట్లు మినహా ఇతర వర్గాల టికెటు ధరల్ని తగ్గించారు. ఈ నిర్ణయం ప్రకారం మ్యాచ్ టికెటు తాజా ధరల వివరాలిలా ఉన్నాయి. ● 1, 3వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 12 వేల నుంచి రూ. 11 వేలకు తగ్గించారు. ● 2, 4వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 1,000 నుంచి రూ. 900కి తగ్గించారు. ● 5వ నంబరు గ్యాలరీ ధరని రూ. 1,500 నుంచి రూ. 1,200కి, 7వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 800 నుంచి రూ. 700కి తగ్గించారు. ● ఎన్‌క్లోజరు టికెటు ధరని రూ. 8 వేలు నుంచి రూ. 7 వేలకి తగ్గించారు. ● ఎయిర్ కండిషన్ గ్యాలరీ బాక్సు టికెటు ధరని రూ. 9 వేల నుంచి రూ. 8 వేలకి తగ్గించారు. ● లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన న్యూ పెవెలియన్ టికెటు ధర రూ. 10 వేలు, కార్పొరేటు బాక్సు టికెటు ధర రూ. 20,000గా కొనసాగుతుంది. -
వికసిత ఒడిశా రూపకల్పనకు సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్ర అవతరణ శతాబ్ధి దగ్గర పడుతోంది. 2036 సంవత్సరంలో రాష్ట్రం శతాబ్ధి పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికసిత ఒడిశా ఆవిష్కరించాలని నడుం బిగించింది. సాధికారిత సాధన దిశలో సరికొత్త ఆశలు, సృజనాత్మక కార్య శైలి, అభివృద్ధి చెందిన సమాజం వంటి ఉన్నత దృక్పథ కార్యాచరణ రూపకల్పన కోసం సమాజంలో అన్ని వర్గాల నుంచి అమూల్యమైన అభిప్రాయాల్ని ఆహ్వానించింది. ఈ గడువుని మరి కొద్ది కాలం పొడిగించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. లోగడ ప్రకటించిన ప్రకారం వికసిత ఒడిశా ఆవిష్కరణ ప్రతిపాదనల దాఖలు గడువు బుధవారం (ఈ నెల 20)తో ముగియాల్సి ఉంది. ఈ గడువుని డిసెంబరు నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047కి సంబంధించిన మార్గదర్శకాల్ని ప్రజలు దాఖలు చేసేందుకు వీలవుతుందని ప్రకటించారు. నీతీ ఆయోగ్ ప్రముఖ కార్యనిర్వాహక అధికారి సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ ఆవిష్కరణకు సంబంధించి ప్రజాభిప్రాయాల దాఖలు ఇతరేతర అనుబంధ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కమిషనరు అనూ గర్గ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయాల దాఖలు గడువుని పొడిగించినట్లు ప్రకటించారు. భావి అవసరాలు, సవాళ్లని దృష్టిలో ఉంచుకుని వికసిత్ ఒడిశా దార్శనిక (విజన్) పత్రం రూపకల్పన జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం సరికి సమాజంలో వివిధ వర్గాల నుంచి 15 వేల ప్రతిపాదనలు దాఖలైనట్లు అభివృద్ధి కమిషనరు తెలిపారు. డిసెంబరు నెల 5వ తేదీ వరకు ప్రతిపాదనల్ని దాఖలు చేసేందుకు వీలు అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా దాఖలు చేసేందుకు వీలు కల్పించారు. 63709–51920 నంబర్‌కు సూచనలు వాట్సాప్ చేయాలన్నారు. -
కార్చిచ్చు నివారణకు కసరత్తు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ హాల్ నంబర్ 1లో జిల్లా స్థాయి అగ్నినివారణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.ఆనంద్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా అటవీ రేంజ్ అధికారులు, తహసీల్దార్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. శీతాకాలంలో గజపతి జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతాల్లో గత ఏడాది 921 పాయింట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. ముఖ్యంగా మోహన, ఆర్.ఉదయగిరి, నువాగడ అటవీ ప్రాంతాల్లో 2024– 25అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు నివారించడానికి యాక్షన్ ప్లాన్ అవసరమని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అనేక విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కార్చిచ్చు ఆపడానికి తగు చర్యలను అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో దగ్గరలోని పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకుని అగ్నిప్రమాదాల నివారణకు ఉపక్రమిస్తే వారికి తగు పారితోషికం, సత్కారం అందిస్తామని డీఎఫ్ఓ తెలిపారు. -
23 ఎకరాల్లోని గంజాయి పంట దహనం
జయపురం: బొయిపరిగుడ సమితి జి.మఝిగుడ పంచాయతీ కాట్రగుడ, బంసుయగుడ, బంశుగుడ గ్రామాల ప్రాంతాల్లో 23 ఎకరాల్లో రైతులు పండించిన గంజాయి పంటను పోలీసులు గుర్తించి దహనం చేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మీడియాకు తెలిపారు. 23 ఎకరాల్లో 22,0300 గంజాయి మొక్కలను కాల్చివేసినట్లు వెల్లడించారు. జిల్లా వలంటరీ సురక్షా ఫోర్స్ సహకారంతో జరిగిన దాడుల్లో బొయిపరిగుడ పోలీసులు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, మెజిస్ట్రేట్ బాధ్యతలు నిర్వహిస్తున్న బొయిపరిగుడ అదనపు తహసీల్దార్ ఖొగేశ్వర సౌరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి మాఫియా బొయిపొరిగుడ సమితిలో స్థావరాలు ఏర్పరుచుకొని ఆదివాసీలను ప్రలోభ పరచి గంజాయి సాగు చేయిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే అలాంటి వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. -
ఆంగ్లం విశ్వ భాష
– విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ జయపురం: ఇంగ్లిస్ విశ్వ భాష అని పాఠశాల, విద్యా విభాగశాఖ మంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. మంగళవారం స్థానిక నేహ్రూనగర్ సిటీ ఉన్నత పాఠశాల సభా గృహంలో ఐదురోజుల ఇంగ్లిష్ భాష ఎన్రిచ్మెంట్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంగ్ల భాషను మనం మాట్లాడ గలుగుతున్నాం, కానీ అనర్గళంగా మాట్టాడేందుకు కష్టపడుతున్నామన్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషలో పాఠ్యాంశాలు బోధించటంలో సమస్యలు ఏర్పడుతున్నాయని, అందువలన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతునందని వెల్లడించారు. శిక్షణ పొందే ఉపాధ్యాయులు చక్కగా ఇంగ్లిష్ బోధించాలన్నారు. జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ.. ఐదు రోజులు జరుగనున్న శిక్షక్షణలో కొరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నుంచి 52 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని వెల్లడించారు. వారికి క్షీరబ్ కుమార్ బొటమిశ్ర, పార్ధసారథి పండా, దుర్యోధన ముదులి, సౌమ్యప్రసాద్ నాయక్, దేవేంద్ర కుమార్ దొర, రమేష్ చంద్ర సాహు, జయప్రకాశ్ మిశ్ర శిక్షణ ఇస్తారన్నారు. నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, కార్యక్రమ కో ఆర్డినేటర్ చంద్ర కళా బొగర్తీ, విక్రమదేవ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు మనోరంజన్ ప్రదాన్, సిటీ హైస్కూల్ హెచ్ఎం బి.సుజాత, తదితరులు పాల్గొన్నారు. -
ఏహెచ్‌పీ లబ్ధిదారులకు కేటాయింపు పత్రాల పంపిణీ
భువనేశ్వర్: నగరంలో సరసమైన గృహ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణం, నగర అభివృద్ధి విభాగం మంత్రి డాక్టరు కృష్ణ చంద్ర మహాపాత్రో కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. స్థానిక ఇడ్కో ఆడిటోరియంలో మంగళ వారం జరిగిన లాటరీ కార్యక్రమంలో అర్హులైన వారికి మంత్రి ఈ పత్రాల్ని ప్రత్యక్షంగా అందజేశారు. రాజధాని నగరంలో ఇల్లు కలిగి ఉండడం సామాన్యునికి అతి పెద్ద కల. ప్రభుత్వం సగటు మనిషి కలని సాకారం చేసే దిశలో ఈ చర్యపట్ల చొరవ తీసుకున్నట్లు మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. చంద్రశేఖర పూర్, నీల మాధవ్ ఆవాస్, సుబుద్ది పూర్ ప్రాంతాల్లో సరసమైన గృహ ప్రాజెక్టు పథకం నగర బీదల కోసం ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. ఈ ప్రాజెక్టుల కింద సమగ్రంగా 116 మందికి మంత్రి కేటాయింపు పత్రాలు అందజేశారు. చంద్రశేఖర పూర్ ప్రాంతంలో 47, నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 36, సుబుద్ధి పూర్ ప్రాంతంలో 28 ఇళ్లకు సంబంధించి కేటాయింపు పత్రాలు జారీ చేయడం పూర్తయ్యింది. చంద్రశేఖర పూర్ ప్రాంతం 20 ఎకరాల విస్తీర్ణంలో 2,600 ఇళ్ల నిర్మాణం చేపట్టి 820 నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో 737 మందికి అర్హులుగా పరిగణించి కేటాయింపు లేఖలు అందజేశారు. స్థానిక కేర్ ఆస్పత్రి చేరువలో నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 8.18 డెసిమల్ విస్తీర్ణపు స్థలంలో చేపట్టిన 1,200 ఇండ్ల నిర్మాణంలో 960 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 543 మంది అర్హులకు అందజేశారు. సుబుద్ధి పూర్ బరుణై ఎంక్లేవ్ ప్రాజెక్టు కింద 342 ఇండ్లు నిర్మించడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద 28 ఇళ్ళ నిర్మాణం పూర్తి కావడంతో అర్హులైన లబ్దిదారులకు కేటాయించారు. స్థానిక సత్య నగర్ ప్రాంతం 10 ఎకరాల సువిశాల విస్తీర్ణపు స్థలంలో కేశరి రెసిడెన్సీ బీదల వాడ పునరాభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ స్థలంలో 1,300 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా 560 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 454 మంది లబ్ధిదారులకు కేటాయించారు. -
సమస్యలు పరిష్కరించండి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితిలో మంగళవారం కలెక్టర్ వి.కీర్తి వాసన్ నిర్వహించిన ప్రజాభియోగ శిబిరంలో 40 ఫిర్యాదులు అందినట్లు బొరిగుమ్మ అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులలో వ్యక్తిగతమైనవి 13, కమ్యూనిటీకి చెందినవి 27 వచ్చాయన్నారు. బొరిగుమ్మ సమితి ఇంజినీర్‌పై కుచులి గ్రామం ప్రతాపహోత్త ఫిర్యాదు చేశారు. హోర్దిలి గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాంతంలో సమితి తరఫున నూతన గృహం నిర్మించామని, నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడచినా ఇంజినీర్ గుప్త దాస్ డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో ఆరోపించారు. తెలింగిరి డ్యామ్ నీరు కొద్ది రోజుల్లో బయటకు పోయి ఖాళీ అవుతుందని, సాగునీటి సమస్య పరిష్కరించాలని పోడాపొదర్ గ్రామం చిత్ర సేన్ నేతృత్వంలో రైతులు కోరారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు అదనపు బీడీఓ మాధురీ ఆచారి, ఏఈ ప్రకాశ్ ప్రధాన్, బీఈఓ సచిన్ కుమార్ మల్లిక్, సీడీపీఓ గాయత్రీ బాహిణీపతి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్ అరెస్ట్
భువనేశ్వర్: ఢెంకనాల్ కామాక్ష్య నగర్ సబ్ కలెక్టర్ నారాయణ చంద్ర నాయక్‌ని మంగళవారం విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా లెక్కాజమ లేని ఆస్తులు ఆర్జించినట్లు అతనికి వ్యతిరేకంగా ఆరోపణ. సోమవారం నిర్వహించిన సోదాల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో అరెస్టు చేసినట్లు వివరించారు. సోదాల్లో భాగంగా భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో 3 బహుళ అంతస్తు భవనాలు, 14 ఇళ్ల స్థలాలు, 365 గ్రాముల బంగారం, రూ.34,57,000 బ్యాంకు పొదుపు ఖాతాలో నిల్వ, రూ.1.48 లక్షల నగదు స్వాధీనపరచుకున్నారు. బ్రిటిష్ వంతెనపై హెచ్చరిక బోర్డులు కొరాపుట్: కొరాపుట్–నబరంగ్‌పూర్ జిల్లాలను విడదీస్తున్న ఇంద్రావతి నది పై బ్రిటిష్ వారు ఇనుప వంతెన నిర్మించారు. ఆ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. దాని మీద వాహనాలు రాకపోకలు లేనప్పటికీ పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ప్రమాదకర గోతులు కనిపిస్తున్నాయి. వీటిని గమనించిన నబరంగ్‌పూర్ పట్టణానికి చెందిన ఐకాన్స్ ఇన్ మొషన్ష్ యువజన సంస్థ సభ్యులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 5టి పాఠశాలల పరిశీలన రాయగడ: గత ప్రభుత్వం అమలు చేసిన 5టి పథకంలో భాగంగా అభివృద్ధి చెందిన వివిధ పాఠశాలలను బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా మునిగుడలొ గల నొడల్ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన 5టి పథకంలొ మంజూరైన నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సమితి ఏఈఓ ఐఽశ్వర్య భంజదేవ్ ఈ సందర్భంగా పాఠశాలలో గల వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నిధుల నుంచి అదనపు తరగతి గదులను నిర్మించేందుకు హామీ ఇచ్చారు. 25న అఖిల పక్ష సమావేశం భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఖరారైంది. శాసనసభలో ఆమె అధ్యక్షతన ఈ సమావేశం ఈనెల 25వ తేదీన జరుగుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మంగళవారం తెలిపారు. శాసనసభ శీతాకాలం సమావేశాలు పురస్కరించుకుని అఖిల పక్షాలతో స్పీకర్ సమావేశం కానున్నట్లు మంత్రి వివరించారు. ఈనెల 26వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు ఆరంభం అవుతాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో 25 పని దినాలు ఉంటాయి. పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. విపక్షాల అభ్యర్థనలపై సమర్ధవంతంగా స్పందించేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉందని మంత్రి ముఖేష్ మహా లింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విడత సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌ని సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. కొరాపుట్ @7.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొరాపుట్: జిల్లాలో కనీస స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 7.9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది. దీంతో చలిపులి పంజా విసిరింది. సాయంత్రం 6 గంటలకే ప్రజలు ఇళ్లకి పరిమితం అవుతున్నారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల్లో ప్రయాణికులు అల్పంగా ఉంటున్నారు. కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక అగ్గిమంట వద్ద చలి కాచుకుంటూ, ప్రస్తుతం రాజకీయ వాతావరణం కూడా చల్లబడి పోయిందని సామాజిక మాద్యమాల్లో పేర్కొన్నారు. -
ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
జయపురం: ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకోవాలని జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యా రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక నేహ్రూనగర్ జయపురం సిటీ ఉన్నత పాఠశాల శిశు ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల హెచ్ఎం బి.సుజాత అధ్యక్షతన జరిగిన శిశు ఉత్సవంలో ఆమె మాట్లాడుతూ తాము ఏమీ సాధించాలో విద్యా దశలోనే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. సాధించాలన్న పట్టుదల, కార్యదీక్ష ఉన్న నాడే గమ్యాన్ని చేరగలమన్నారు. శిశు ఉత్సవంలో పాఠశాల నిర్వాహకులు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన నృత్య, నాట్య ప్రదర్శనలు, చిన్నారుల విచిత్ర వేషధారణలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఇటీవల పాఠశాల యాజమాన్యం నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు సబ్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు శశిపట్నాయక్, తెలుగు సంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం
కొరాపుట్: నబరంగ్‌పూర్ విధాన సభ స్థానంలో బీజేడీలో 25 మందిని సభ్యులుగా చేర్చాలనే లక్ష్యంగా పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ చంద్ర మజ్జి పిలుపునిచ్చారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో డొంబురు మజ్జి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యులను చేర్చాలని సూచించారు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత పాలకులు పేద ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వైఖరిని ఎత్తిచూపాలన్నారు. పార్టీ నాయకులు ప్రతిప్ మజ్జి, సదాశివ ప్రధాని తదితరులు ప్రసంగించారు. -
అటవీ శాఖ సిబ్బంది సస్పెన్షన్
భువనేశ్వర్: ఆహార అన్వేషణలో విద్యుదాఘాతానికి గురై మూడు ఏనుగులు దుర్మరణం పాలయిన ఘటనలో ముగ్గురు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు సీనియర్ అధికారులను బా ధ్యులుగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని దర్యాప్తు బృందం విభాగానికి సిఫారసు చేసింది. అలాగే వన్య ప్రాణులను చేజిక్కించుకునేందుకు విద్యుత్ తీగలు పన్నిన ముఠాకు చెందిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం స్థానిక పోలీసుల సహకారంతో గాలిస్తున్నారు. హైకోర్టులో వ్యాజ్యం విద్యుదాఘాతంతో ఏనుగుల గుంపు దుర్మరణం విచారకర ఘటనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా స్పందించింది. ఈ సంఘటనపై హైకోర్టు స్వయంగా ప్రజాహిత వ్యాజ్యం ప్రతిపాదించింది. ఈ వ్యాజ్యం విచారణకు ధర్మాసనం స్వీకరించి ప్రత్యర్థి వర్గాలకు తాఖీదులు జారీ చేసింది. వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది. -
ఆలిండియా బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ బాక్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాలల చాంపియన్ షిప్లో ఉత్తమప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు పతకాలు దక్కించుకోవడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారుల్లో ఎస్.తేజేశ్వర్ 48 కిలోల విభాగంలో బంగారుపతకం, ఎ.సాయి 51 కిలోల విభాగంలో బంగారు పతకం, జి.లిఖిత్‌రెడ్డి 92 కేజీల విభాగంలో బంగారు పతకం, ఎస్.కె.సుల్తానా కాంస్య పతకం దక్కించుకున్నారు. ఆ నలుగురు క్రీడాకారులు డిసెంబర్ 26 నుంచి జనవరి2వ తేదీవరకు పంజాబ్‌లో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ పోటీలకు ఆంధ్రా యూనివర్సీటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. యూనివర్సిటీ స్థాయిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోలా మన్మథకుమార్, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు ఎస్.ఈ.రాజు, పీఎల్.ప్రసాద్, రింగ్ ఆఫీషియల్స్ వి.సంతోష్‌కుమార్, పి.శ్రీనివాసరావు, బి.జగదీష్‌నాయుడు తదితరులు అభినందించారు. వచ్చే నెల 26నుంచి పంజాబ్‌లో పోటీలు -
రూ.20వేలకు పసికందు విక్రయం
రాయగడ: పేగు తెంచుకుని పుట్టిన పసికందును తొమ్మిది రోజుల వయసులోనే రూ.20వేలకు అమ్మేసిన ఉదంతం వెలుగుచూసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఆరొగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నువాపడ బస్తీలో నివసిస్తున్న కుముదుని గంట, రాహుల్‌లు దంపతులు. గర్భవతి అయిన కుముదుని ఈ నెల 3 వ తేదీన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, పిల్ల క్షేమంగా ఉండటంతో వారిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే ఈ దంపతులకు అప్పటికే ఒక మూడేళ్ల ఆడపిల్ల ఉండటంతో పాటు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. దీంతో వారు మధ్యవర్తుల సాయంతో మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పెదపెంకి ప్రాంతంలో నివసిస్తున్న కె.రాజశేఖర్ దంపతులకు కేవలం రూ.20 వేలకు బిడ్డను విక్రయించారు. విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. దీంతో సీడబ్ల్యూసీకి చెందిన ప్రియదర్శిని మహాంకుడో మరికొంతమంది సిబ్బంది మంగళవారం నువాపడ ప్రాంతనికి వెళ్లి దర్యాప్తు చేశారు. తమ బిడ్డను విక్రయించినట్లు వారు ఒప్పుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన వైద్య శాఖ -
నిధులు కేటాయించండి
జయపురం: జయపురంలో చారిత్రిక జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులలో మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, మునిసిపాలిటీ అధికారులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ నరేంఽద్రకుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత నేతృత్వంలో బీజేడీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి నిధుల కోసం రాజధాని భువనేశ్వర్‌కు మంగళవారం వెళ్లారు. జగన్నాథసాగర్ పనులు నిలిచిపోవటం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రోను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతితో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ ప్రధాన కార్యదర్శి ఉషా పాడిని కలిసి జగన్నాథ్ సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేడీ కౌన్సిలర్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్‌ను కలిసి జయపురం జగన్నాథ్ సాగర్ పురుద్ధరణ కోసం నిధులు వెంటనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నరేంద్రకుమార్ మహంతి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మారిన తరువాత జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణకు నిదులు విడుదల చేస్తారని ఆశించామని, నేటివరకు నిధులు రాలేదని వెల్లడించారు. పునురుద్ధరణ పనులు నిలిచిపోయాయని, అందువల్ల తామంతా భువనేశ్వర్ వచ్చామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. -
తాగునీటి పరీక్షలు నిర్వహించాలి
పార్వతీపురం: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విధిగా తాగునీటి పరీక్షలు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండాలని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. తాగునీరు లీకేజి ఎక్కడా ఉండకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇళ్లకు తక్షణం మంజూరు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని, మరుగుదొడ్ల వినియోగంపై అధికారులతో పాటు స్వయం సహాయక సంఘాలు కూడా ముందుకు వచ్చి అవగాహన కల్పించాలని కోరారు. విద్యాసంస్థల్లో చేతుల పరిశుభ్రతను చేపట్టి అవగాహన కల్పించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఒ. ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాలో జల్‌జీవన్ మిషన్ కింద రూ.494.53 కోట్లతో 2,859 పనులు మంజూరయ్యాయని ఇంతవరకు రూ.196కోట్లతో 1289 పనులు చేపట్టామని, అందులో 732 పనులు పూర్తయ్యాయని, 557 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డీపీఓ టి.కొండలరావు, డీఈఓ ఎన్. తిరుపతినాయుడు, భూగర్భ జలాల అధికారి ఎ.రాజశేఖరరెడ్డి, ఇరిగేషన్ ఈఈ ఆర్.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ సూచన -
డీజీఎం సుబాష్ పండా అరెస్టు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ పోలీసులు ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండాని మంగళవారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల ఆర్జన ఆరోపణ ఆధారంగా సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇళ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. వీటి సమగ్ర విలువ ఆదాయం కంటే 303 శాతం అధికంగా లెక్క తేలింది. తల లేని మృతదేహంలో కేసులో ఆరుగురు అరెస్టు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 57 గ్రామంలో నదిలో బస్తాలో కట్టి పడేసిన మృతదేహాన్ని గత గురువారం కలిమెల పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహానికి తల లేదు. దర్యాప్తులో మృతుడు సుర్లుకొండ గ్రామానికి చెందిన పదియా మడ్కమి (47)గా తెలిసింది. ఇతను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు పొలంలో నిద్రపోతున్న సమయంలో తల నరికేసి తలలో పడేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితులైన సోడి పోడియామి, రామ పోడియామి, మున్న పోడియామి, ఇర్మా పోడియామి, పధలం పోడియామి, రామ కావసీలను మంగళవారం సుర్లుకొండ గ్రామంలో అరెస్టు చేసి కలిమెల పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. ఈనెల 8న హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. రెండు బైక్‌లు ఢీ: నలుగురికి గాయాలు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 126 గ్రామం వద్ద ఈ రోజు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొని నలుగురు గాయపడ్డారు. కనిమెట్ల గ్రామానికి చెందిన గంగా పోడియామి, కార్తీక్ పోడియామిలు ఒక బైక్‌పై వస్తున్నారు. మోటు వైపు నుంచి భీమా మధిర, నీల్ మధిర అనే ఇద్దరు మరో బైక్‌పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. స్థానికులు చూసి వీరిని అంబులెన్స్ సాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్‌గిరి తరలించారు. ఐఐసీ చంద్రకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
రోగాలపై అప్రమత్తత అవసరం
రాయగడ: రోగం సంక్రమించక ముందే అప్రమత్తతతో వ్యవహరించాలని సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘమిత్రాదేవి అన్నారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురష్కరించుకుని స్థానిక సెంచూరియన్ ఫార్మసీ విభాగానికి చెందిన విద్యార్థులు మంగళవారం నిర్వహించిన అవగాహనర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక గజపతి కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జీసీడీ మైదానం వరకు కొనసాగింది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఫార్మసి విభాగానికి చెందిన డాక్టర్ చంద్ర శేఖర్ పాత్రో, అధ్యాపకులు గోపాలకృష్ణ పాడి, అవినాష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. ఏనుగు బాధితులకు పరిహారం ఇస్తాం పర్లాకిమిడి: కాశీనగర్ సమితిలోని జైగుడ గ్రామంలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆనంద్ తెలిపారు. కాశీనగర్‌లో ఏనుగుల సంచారంపై ట్రాక్ చేస్తూ, టాటా విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపడుతున్నామని ఆయన అన్నారు. ఏనుగులు పంట పొలాలు నాశనం చేస్తున్నాయన్న ఫిర్యాదులపై డీఎఫ్ఓ ఆనంద్ స్పందిస్తూ దీనిపై పంట నష్టపరిహారం అంచనాలు వేస్తున్నామని, 45 రోజుల్లోగా నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభం రాయగడ: స్థానిక రైల్వే గ్రౌండ్లో మంగళవారం జిల్లా స్థాయి మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభమైంది. రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలొ కలెక్టర్ ఫరూల్ పట్వారి, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో వలలు దగ్ధం ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తదిబ్బలపాలెం సముద్ర తీరంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో చేపల వలలు దగ్ధమయ్యాయి. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్ తాళ్లతో ఉన్న వలలకు నిప్పంటుకోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో వలలు కాలిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు చీకటి పండువాడు, రాము, సూరాడ కూర్మయ్య, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత అక్టోబర్ 21న డి.మత్స్యలేశం తీరంలోనూ ఇలాగే వలలు కాలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందో కారణం తెలియలేదు. ప్రమాదమా? వ్యక్తిగత కక్షలతో నిప్పుడు పెడుతున్నారా అన్నది తెలియడం లేదు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ డీవీవీ.ప్రసాదరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ కేవీ.జ్వాలాముఖి ఎంపికై న క్రీడాకారుల జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు. పోటీలలో అండర్–6 బాలికల విభాగంలో జి.వేద సాయి శ్రీ(పీఎస్ఆర్ స్కూల్) ఎన్.ధాన్విక (భాష్యం స్కూల్) సీహెచ్.రేణూశ్రీ (చాణక్య స్కూల్).. బాలుర విభాగంలో ధీరజ్(ఫోర్ట్ సిటీ స్కూల్) యశస్విన్ (చాణక్య స్కూల్) ఎంపికై నట్లు తెలిపారు. అదేవిధంగా అండర్–8 బాలికల విభాగంలో జాష్విక(ఫోర్ట్సిటీ స్కూల్) అనన్య(బీసెంట్ స్కూల్)..బాలుర విభాగంలో ధనుష్(ఆదిత్య స్కూల్) హిమాంక్(ఇన్స్పైర్ స్కూల్), అండర్–10 బాలికల విభాగంలో అమృత(కేంద్రీయ విద్యాలయ), వైష్ణవి(ప్రభుత్వ పాఠశాల, తిమిడి), బాలుర విభాగంలో పర్వేష్(బీసెంట్ స్కూల్) జిగ్నేష్(కేంద్రీయ విద్యాలయ) ఎంపికై నట్లు పేర్కొన్నారు. అలాగే అండర్–12 బాలికల విభాగంలో సాయి ధృతి(సన్ స్కూల్) గరిమ సంస్కృతి(నేషనల్ స్కూల్)..బాలుర విభాగంలో ఆదిత్య(మానస స్కూల్), చైతన్య శ్రీనివాస్(సెయింట్ జోసెఫ్ స్కూల్) ఎంపికయ్యారు. అండర్–14 బాలికల విభాగంలో బి. షణ్ముఖ ప్రియ(సెయింట్ ఆన్స్ ప్రభుత్వ పాఠశాల), జి. కుందన ప్రియ(నేషనల్ స్కూల్), బాలుర విభాగంలో జీకేఎం అభినవ్ రెడ్డి(బీపీఎం ప్రభుత్వ పాఠశాల), వి.లోకేష్(భాష్యం) ఎంపికయ్యారని ప్రకటించారు. అండర్–16 బాలికల విభాగంలో కె.లహరి(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరడాం), సీహెచ్. గాయత్రి దేవి(ఏపీ మోడల్ స్కూల్, మరుపల్లి), బాలుర విభాగంలో డి.లీలా మనోహర్(ఫోర్ట్ సిటీ స్కూల్) కె.హర్ష వర్థన్(పల్లవి స్కూల్)లు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. -
మిల్లు తిప్పి ఉపాధి కల్పించండి
నెల్లిమర: అక్రమ లాకౌట్‌లో ఉన్న జూట్‌మిల్లును తిప్పి కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వద్ద నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై జాయింట్ సమావేశానికి సీఐటీయూ అనుబంధ సంఘం జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ తరఫున కిల్లంపల్లి రామారావు, అప్పలనర్సయ్య, ఐఎఫ్టీయూ తరఫున నామాల తిరుపతి రావు, కె.అప్పల సూరి, టి.అప్పారావు, శ్రామిక సంఘం తరఫున చిక్కాల గోవింద రావు, సముద్రపు సత్య నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 9సంవత్సరాలుగా జూట్‌మిల్లు యాజమాన్యం గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వలేదని, అలాగే పోస్ట్ డెటెడ్ చెక్‌లు ఇచ్చి రిటైర్డ్ కార్మికులు బ్యాంకు వద్దకు వెళ్తే ఖాతాలో నగదు లేక యాజమాన్యం ఇచ్చిన చెక్‌లు బౌనన్స్ అయిపోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా గడిచిన 3సంవత్సరాలుగా యాజమాన్యం ఈఎస్ఐ, పీఎఫ్ నగదు కార్మికులనుంచి తీసుకుంటూ సంబంధిత అధికారులకు చెల్లించలేదని ఆరోపించారు. కార్మికులనుంచి యాజమాన్యం డెత్ ఫండ్ వసూలు చేసి రెండు, మూడు నెలల తరువాత ఆయా కుటుంబాలకు యాజమాన్యం వాటా లేకుండా ఇస్తోందన్నారు. లాకౌట్ అన్యాయం ముడిసరుకు కొరత విషయంలో కార్మికులు సహకరించలేదని జూట్‌మిల్లు యాజమాన్యం చెప్పడం భావ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. 1989నుంచి కార్మికులు రూ. 5,రూ.10,రూ.18 కార్మికులనుంచి యాజమాన్యానికి రుణంగా ఇచ్చి సహకరించినట్లు తెలిపారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని జూట్ యాజమాన్యానికి కార్మికులు సహకరిస్తుంటే యాజమాన్యం మాత్రం ముడి సరుకు కొరత పేరిట మిల్లును అక్రమ లాకౌట్ చేసి ఉపాధి లేకుండా చేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మిల్లు తిప్పి ఉపాధి కల్పించడమే కార్మిక సంఘాల లక్ష్యమని పేర్కొన్నారు. లేకపోతే మిల్లు తిప్పి ఉపాధి కల్పిస్తారా? ఇతర మిల్లుల్లా గ్రాట్యుటీ బకాయిల చెల్లింపుతో పాటు కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.5, రూ.10,రూ.18 తిరిగి చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీఎల్ వచ్చే నెల 17కి చర్చలు వాయిదా వేస్తున్నామని అప్పటికీ యాజమాన్యం రాకపొతే కలెక్టర్, ఉన్నాతాధికారులకు నివేదిస్తామని ఏసీఎల్ చెప్పినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఉమా జూట్మిల్స్ కన్సొలేషన్ మీటింగ్ వాయిదాకొత్తవలస: మండలంలోని కోటపాడు రోడ్డు సీతంపేట సమీపంలో గల ఉమా జూట్మిల్స్ను ఈ ఏడాది జూలై–15 వతేదీన యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించి మూసేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి కార్మిక సంఘం ఎఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయగనరం డీసీఎల్, విశాఖపట్నం జేసీఎల్లు యాజమాన్యం, కార్మికులతో 9 పర్యాయాలు చర్చలు నిర్వహించినా యాజమాన్యం గైర్హాజరవుతూ వస్తోంది. దీంతో చివరిగా డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే కన్సొలేషన్ చర్చలకు యాజమాన్యం కచ్చితంగా హాజరుకావాలని జేసీఎల్ ఆదేశించినట్లు కార్మిక సంఘం అధ్యక్షుడు గణేష్ పండా మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి యాజమాన్యం హాజరు కాకపోతే కేసును ముగించి ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీఎల్ స్పష్టం చేసినట్లు పండా తెలిపారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి -
వరిపంట దగ్ధం
బలిజిపేట: మండలంలోని కూర్మనాథపురం రెవెన్యూ పరిధిలో గల 52సెంట్ల భూమిలో వరిపంట ప్రమాదవశాత్తు మంగళవారం దగ్ధమైంది. గ్రామానికి చెందిన బి.లక్ష్మణరావు భూమిలో సుమారు రూ.30వేల విలువైన పంటకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారుచేసి అధికారులకు అందించనున్నట్లు వీఆర్ఓ స్వామినాయుడు చెప్పారు. కార్యక్రమంలో పలువరు రైతులు పాల్గొన్నారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరాజాం సిటీ: మండల పరిధి సోపేరు గ్రామానికి చెందిన కోటగిరి మధు (48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఎస్సై నర్సింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మధు కొన్నేళ్లుగా కాళ్లూచేతులు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో తీవ్రమనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెందాడు. ఈ నేపథ్యంలో వ్యవసాయం నిమిత్తం ఇంట్లో ఉంచిన పురుగుమందును ఈ నెల 18న తాగేశాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రూ.50వేల నగదు చోరీగుర్ల: మండలంలోని పాలవలస గ్రామంలో మంగళవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన తాడ్డి గౌరినాయుడు ఇంట్లో దొంగలు పడి బీరువాను పగలగొట్టారు. బీరువాలో బంగారు అభరణాలు ఉన్నప్పటికీ సుమారు రూ.50 వేల నగదు అపహరించినట్లు గౌరినాయుడు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దొంగతనంపై బాధితులు గుర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై పి.నారాయణ రావు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో మరో నిందితుడి అరెస్ట్విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో మరో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడి గ్రామశివారులో ఇటీవల ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఈనెల 12న వారిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు భువనేశ్వర్‌కు చెందిన రాజేష్ బాగ్‌ను విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడి దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని, రూ.210 నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ లక్ష్మణరావు, ఎస్సై వి.అశోక్ కుమార్‌లను డీఎస్పీ అభినందించారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రామానందం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమీప గ్రామ/వార్డు సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, పోస్టాఫీస్ వారిని సంప్రదించి ఎన్పీసీఐ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే డబ్బులు జమకావన్నారు. చెరకు టన్ను రూ.3151 ● మద్దతుధర ప్రకటించిన సంకిలి ఈఐడీ చక్కెర కర్మాగారం ● ఈనెల 20 నుంచి క్రషింగ్ ప్రారంభం రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరకు రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 20 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కర్మాగారం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి టన్ను చెరకకు రూ.3,151లు మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించారు. గత ఏడాది కంటే టన్నుకు రూ.71లు పెంచినట్టు పేర్కొన్నారు. క్రషింగ్ సీజన్ అనంతరం రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో కేన్ డీజీఎం ఆర్.రమేష్ పాల్గొన్నారు. -
పింఛన్ల రికవరీపై విచారణ
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన అనర్హులైన ఏడుగురు వ్యక్తులు పింఛన్లు తీసుకుంటున్నారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదుతో పలుమార్లు విచారణ చేపట్టిన అధికారులు తాజాగా మంగళవారం మళ్లీ గ్రామంలో మరోమారు విచారణ చేపట్టారు. పాలకొండ డీఎల్డీఓ వి.గోపాలకృష్ణ, తహసీల్దార్ చందక సత్యనారాయణ, ఎంపీడీఓ బి.వెంకటరమణలు పింఛన్‌దారులను పిలిపించి వివరాలు సేకరించారు. గత టీడీపీ పాలనలో 2018–19 మధ్య కాలంలో గ్రామానికి చెందిన ఎన్.లచ్చిశెట్టి రూ.23,500(11 నెలలు),గంట రాము రూ.23,500(11 నెలలు),బోను అప్పయ్య రూ.34,750( 21 నెలలు), కొమరాపు పోతయ్య రూ.34,750(21 నెలలు),బి.లక్ష్మం రూ.34,750 (21నెలలు) వై.వెంకయ్య రూ.32,500(19 నెలలు) కె.సీతమ్మ రూ.29,000(14 నెలలు) మొత్తం రూ.2,12,750 లు వృధ్యాప్యపు పింఛన్ల ద్వారా తీసుకున్నారని, వారంతా అనర్హులని గ్రామానికి చెందిన యామక అప్పలనాయుడు అప్పట్లో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలుమార్లు అధికారులు విచారణ చేశారు. 2019లో డిసెంబర్లో వీరికి వస్తున్న పింఛన్లను అధికారులు నిలిపివేశారు. వారి నుంచి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. రికవరీ ఎందుకు చేయలేదని మరోమారు లోకాయుక్త నుంచి ఆదేశాలు రావడంతో విచారణ చేపట్టినట్లు డీఎల్డీఓ గోపాలకృష్ణ తెలిపారు.అయితే వారిలో ఇద్దరు వ్యక్తులు వై.వెంకయ్య,కె.సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినట్లు గుర్తించారు.మిగిలిన వారిని పిలిచి విచారణ చేశామని అధికారులు తెలిపారు. తొందరగా తీసుకున్న సొమ్ము తిరిగి కట్టాలని వారిని ఆదేశించామని అధికారులు చెప్పారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన యంత్రాంగం