Sakshi Special
-
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే..
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.సర్వే జరిగేది ఇలా.. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్‌తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్‌లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి..
ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది.. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. ‘మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..‘ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణ ‘క’సినిమాలోనిదని మీకీ పాటికే అర్థమై ఉంటుంది. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఊరే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురపాక గ్రామం. రీల్స్, వీడియోలతో ఇప్పుడా ఊరు నెట్టింట సందడి చేస్తోంది. – సాక్షి, పెద్దపల్లినాలుగు గుట్టల మధ్య.. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం నాలుగు గుట్టల మధ్య.. హుస్సేనిమియా వాగు చెంత.. పచ్చని ప్రకృతి నిలయంగా ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకులు గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్య భౌగోళిక పరిస్థితులను గమనించిన శాతవాహనులు ఈ ఊరు వెలుపల నంబులాద్రీశ్వరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. గ్రామ ప్రత్యేకతను శిలాఫలకంపై చెక్కించారు. ఆలస్యంగా ఉదయం.. తొందరగా సాయంత్రం.. సాధారణంగా 3 గంటలకు ఒక్కజాము చొప్పున రోజులో మొత్తం 8 జాములుంటాయి. పగటిపూట నాలుగు, రాత్రిపూట నాలుగు జాములుగా లెక్కిస్తారు. తూర్పున ఉన్న గొల్లగుట్ట ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కునున్న రంగనాయకులు గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో కొండల నీడతో ఈ గ్రామాన్ని చీకటి తొందరగానే అలుముకుంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రాత్రితో కలిసిపోతుండటంతో పగటి సమయం తగ్గిపోతోంది. దీంతో ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాకగా పిలుస్తున్నారు. ఆ ఊరికి సాయంత్రం జాము లేకపోవడంతో.. సాయంత్రం 4 గంటలకే ఇళ్లలో దీపాలు, వీధి దీపాలు వెలిగించాల్సి వస్తోంది. దేవుడు లేని ఆలయం ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రంగనాయకులు గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. దీంతో ప్రతీ దసరాకు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం నుంచి నంబులాద్రి నరసింహస్వామిని రథయాత్రతో తీసుకొచ్చి.. ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత తిరిగి దేవునిపల్లికి తీసుకెళ్తారు. దీంతో ఏడాదిలో ఆ ఒక్కరోజే ఆ గుడిలో వేడుకలు నిర్వహిస్తారు.పర్యాటకంగా అభివృద్ధి చేయాలి మా గ్రామాన్ని చూడటానికి ఎంతోమంది ఎక్కడినుంచో వచ్చి పోతున్నారు. వచ్చిపోయే వారికి గ్రామంలో సౌకర్యాలు కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – బాలాజీరావు, స్థానికుడు నలుదిక్కులా గుట్టలు మా ఊరుకు నలుదిక్కులా గుట్టలు ఉండటంతో ఉదయం ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. తొందరగానే సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో సాయంత్రం 4 గంటలు దాటిందంటే ప్రతీ ఇంట దీపం వెలిగించుకోవలసిందే. – రాజగౌడ్, స్థానికుడు -
అమెరికాలో పోలింగ్ నేడే.. కమల వికాసమా! ట్రంప్‌కే పట్టమా!
భారత మూలాలున్న కమలా హారిస్ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోరులో పైచేయి సాధించి డొనాల్డ్ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది. 60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్ కొద్ది నెలలుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్‌లోనూ వారిద్దరూ సమవుజ్జీలుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్‌కు ఒక్క రోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలితాలను నిర్దేశించే కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అభ్యర్థులిద్దరి మధ్యా హోరాహోరీ ఉండగా తాజాగా వాటన్నింట్లోనూ ట్రంపే ముందంజ వేసినట్టు పలు పోల్స్ తేల్చాయి. అదే సమయంలో రిపబ్లికన్ల కంచుకోటైన అయోవాలో హారిస్ పైచేయి సాధించినట్టు మరో పోల్‌లో వెల్లడవడం విశేషం. అంశాలవారీగా చూస్తే అమెరికన్లను ప్రధాన సమస్యలుగా భావిస్తున్న ఎనాకమీతో పాటు అక్రమ వలసలు తదితరాల్లో తొలినుంచీ ట్రంప్‌కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనైతేనే దేశానికి గట్టి నాయ కత్వం అందించగలరన్న అభిప్రాయమూ అమెరికన్లలో నెలకొంది. మరోవైపు హారిస్కేమో భార త, నల్లజాతి మూలాలు బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యమున్న ఓటర్లంతా ఆమెకే ఓటేయడం ఖాయ మంటున్నారు. దీనికి తోడు ఈసారి స్వింగ్ స్టేట్లను తోసిరాజని అధ్యక్షున్ని తేల్చడంలో నిర్ణాయకంగా మారగలదని భావిస్తున్న మహిళా ఓటర్ల మద్దతూ హారిస్‌కే ఉండటం అతి పెద్ద సానుకూలాంశం. అబార్షన్ల వంటి పలు కీలకాంశాల్లో కూడా హారిస్‌దే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తటస్థ ఓటర్లే ఫలితాన్ని నిర్దేశించేలా ఉన్నారు...ఓటేసిన కమల అధ్యక్షుడు జో బైడెన్ బాటలో హారిస్ కూడా ఈసారి ముందస్తుగా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం డెట్రాయిట్లో ఈ మేరకు విలేకరులకు వెల్లడించారు. ‘‘నేనిప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశాను. అది త్వరలో కాలిఫోరి్నయా చేరనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’’ అని తెలిపారు. మెయిల్ ఓటింగ్ వ్యవస్థను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ ఇటీవలే తన స్వస్థలం డెలావెర్‌లో ముందస్తు ఓటు వేయడం తెలిసిందే. స్వింగ్ స్టేట్లలో చివరి ప్రయత్నాలు హారిస్, ట్రంప్ ఇద్దరూ కొద్ది రోజులుగా స్వింగ్ స్టేట్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆది, సోమవారాల్లో ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివారం మిషిగన్‌లో కలియదిరిగిన హారిస్ సోమవారం పెన్సిల్వేనియాలో ర్యాలీల్లో ప్రసంగించారు.2020లో పోలింగ్ 66 శాతమే అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్ నమోదైంది.అమెరికా జనాభా - 34.6 కోట్లు అర్హులైన ఓటర్లు - 23.5 కోట్ల పై చిలుకు నమోదైన ఓటర్లు - 16,14,22,000 ఇప్పటికే ఓటేసింది - 7.7 కోట్ల పై చిలుకు తొలిసారి ఓటేస్తున్నది - 1.9 కోట్ల పై చిలుకు ప్రచార నినాదాలు హారిస్ → అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ → రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ ట్రంప్ → దేశ ఆర్థిక పునరి్నర్మాణం → అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట పోలింగ్ వేళలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా (భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకాకొనసాగుతుంది) అసలు ఎన్నిక డిసెంబర్ 16న!విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లేఅమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. జనవరి 6న ఫలితంజనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమా వేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలేస్తారు. సెనేట్ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న (ఆ రోజు ఆదివారమైతే మర్నాడు) ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్ తర్వాతా ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది!టై అయితే?ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ, అంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. అందుకు ఆస్కారం అతి తక్కువగా కనిపిస్తున్నా, ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్‌లో జెఫర్సన్ విజేతగా నిలిచారు.అత్యధిక ఓట్లొచ్చినా గ్యారెంటీ లేదుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ప్రత్యర్థి ట్రంప్ కంటే 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓడారు. 2000లో అల్ గోర్ (డెమొక్రాట్) కూడా జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించినా ఓడారు. మెయిన్, నెబ్రాస్కా మినహా 48 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విన్నర్ టేక్స్ ఆల్ విధానమే ఇందుకు కారణం. దాని ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ దక్కుతాయి.న్యూయార్క్‌లో బెంగాలీ బ్యాలెట్లుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్‌లో బ్యాలెట్ పేపర్లపై బెంగాలీ భాష చోటుచేసుకోవడం విశేషం. అధికారక భాషగా ఇంగ్లిష్ కాకుండా బెంగాలీతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు బ్యాలెట్ పేపర్లపై చోటుదక్కింది. న్యూయార్క్‌లో బెంగాలీలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికం. న్యూయార్క్‌లో ఏకంగా 200కు పైగా భాషలు మాట్లాడేవాళ్లు నివసిస్తుండటం విశేషం. హారిస్ సానుకూలతలు1. ట్రంప్ పట్ల భయాందోళనలుఅమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షునిగా ట్రంప్ అప్రతిష్టపాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా పేరుండటం హారిస్‌కు కలిసొచ్చే అంశం. అందుకే ట్రంప్‌ను ఫాసిస్టుగా, ప్రజస్వామ్యానికే ప్రమాదకారిగా హారిస్ తన ప్రచారంలో పదేపదే అభివర్ణించారు. ఆయన గెలిస్తే అమెరికన్లను మరోసారి విడదీస్తారని హెచ్చరించారు.2. బైడెన్‌కు సమర్థ ప్రత్యామ్నాయండెమొక్రాట్ల అభ్యర్థిగా ఒక దశలో అధ్యక్షుడు బైడెన్ పేరు దాదాపుగా ఖరారైంది. వయోభారం, మతి మరుపు తదితర సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల ఓటర్లంతా పెదవి విరుస్తున్నట్టు అన్ని పోల్స్‌లోనూ స్పష్టమైంది. దాంతో ఒక దశలో డెమొక్రాట్లు గెలుపుపైనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే సమయం మించిపోకుండా ఆయన్ను తప్పించి హారిస్‌ను తెరపైకి తీసుకురావడంతో పోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.3. మహిళల హక్కుల యోధురాలుమహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్ ఎంతో ఎత్తున నిలిచారు. ముఖ్యంగా కీలకమైన అబార్షన్ అంశంపై హారిస్‌కు మహిళల్లో ఆదరణ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో ట్రంప్ కూడా అబార్షన్ల హక్కును వ్యతిరేకించే విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికతో పాటే అబార్షన్ హక్కులపైనా ఓటింగ్ జరుగుతోంది. ఇది హారిస్‌కు మరింత కలిసొస్తుందని చెబుతున్నారు.4. ఓటింగ్ శాతంట్రంప్ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంతాల ప్రజలే. హారిస్ మద్దతుదారుల్లో జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ వారే అధిక సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు హారిస్‌కు బాగా సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.5. ముమ్మర ప్రచారం, వ్యయంఅమెరికా ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ట్రంప్‌తో పోలిస్తే హారిస్ భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడమే గాక ప్రచారంపై ఎక్కువ వ్యయం చేశారు. ఆలస్యంగా జూలైలో రేసులోకి వచ్చిన ఆమె, జనవరి నుంచి 11 నెలల వ్యవధిలో ట్రంప్ సేకరించిన దానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం విశేషం. ముఖ్యంగా కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో విరాళాల సేకరణలో హారిసే ముందున్నారు. ట్రంప్ సానుకూలతలు1. ప్రభుత్వ వ్యతిరేకతఅమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతి పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత ట్రంప్‌కు బాగా కలిసి రానుంది. ఉపాధ్యక్షురాలు హారిస్‌కు ఇది బాగా ప్రతికూలంగా మారవచ్చు. తమ ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా మారాయని ఏకంగా 62 శాతం మంది అమెరికన్లు చెబుతుండటం విశేషం. 79 శాతం మంది దేశం తిరోగమన బాటలో ఉందని భావిస్తున్నారు.2. తగ్గని ప్రజాదరణ2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా క్యాపిటల్ హిల్‌పైకి దాడులకు మద్దతుదారులను ఉసిగొల్పినా, క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న చెత్త రికార్డును మూటగట్టుకున్నా ట్రంప్‌కు జనాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది పొడవునా కనీసం 40 శాతం, అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆయనకు మద్దతు పలకడం విశేషం.3. అక్రమ వలసలురెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానన్న ట్రంప్ ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అబార్షన్లపై హారిస్ వైఖరిపైనే డెమొక్రాట్లు ఆశలు పెట్టుకోగా ట్రంప్ ప్రధానంగా అక్రమ వలసల అంశమే తనను గట్టెక్కిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.4. సామాన్యుల దన్నుగ్రామీణులు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న వారు ట్రంప్‌ను మొదట్నుంచీ అభిమానిస్తూ వస్తున్నారు. వారిలో ఆయనకు ఆదరణ ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు డెమొక్రాట్ల మద్దతిచ్చే కార్మిక సంఘాలు కూడా ఈసారి ట్రంప్‌కు జై కొడుతున్నాయి. గ్రామీణ ఓటర్లు, స్వింగ్ స్టేట్లలోని పట్టణ శివారు ప్రాంత ఓటర్లు భారీగా ఓటేసేలా చూడగలిగితే ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరుగుతాయి.5. గట్టి నేతగా పేరుఅంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఆధిప త్యాన్ని పరిరక్షించగల సామర్థ్యం ట్రంప్‌కే ఉందని మెజా రిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన అధ్యక్షు నిగా ఉండగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జర గని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సోలార్ పవర్ డైరెక్టుగా స్పేస్ నుంచే
కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్‌ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..ఆకాశంలోనే అడ్డా వేసి..భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!1. స్పేస్‌లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రేడియో వేవ్స్‌గా మార్చి భూమి మీదకు పంపుతారు.3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.రేడియో తరంగాల రూపంలో పంపుతూ..ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్‌ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్‌గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్‌ల్యాండ్‌లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్‌ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది. ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.మూడు కంపెనీలు కలసి.. యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్‌ల్యాండ్‌కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్‌ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్‌వర్క్‌గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు. - సాక్షి సెంట్రల్డెస్క్ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది. ⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్‌ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. ⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. ⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్‌ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్‌పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది. -
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్‌లోని ‘గో ఓట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్‌పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్‌లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్‌కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్‌లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్‌తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వోయేజర్–1 పునరుత్థానం!
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్ను పడితే కబ్జా.. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు మాయం
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు మాయమవుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్లోని రెండు మండలాల్లో వేల ఎకరాల అటవీ భూములను కాజేశారు. ప్రభుత్వ స్థలాలు, శిఖం, సీలింగ్ భూములను కూడా వదలడం లేదు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో కొందరు ప్రభుత్వ భూములను కాజేయగా.. మరికొందరు అక్రమంగా ధరణిలో పేర్లు నమోదు చేయించి.. సీలింగ్ భూములను సైతం కాజేశారు. భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.– సాక్షి ప్రతినిధి, నల్లగొండరాజకీయ పలుకుబడితో కబ్జాలు కృష్ణపట్టె పరిధిలోకి వచ్చే మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవుల పల్లి మండలాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కొందరు ఈ దందాకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ కబ్జాల పర్వం కొనసాగగా, ఇ ప్పటికీ కబ్జాలు ఆగడం లేదు. కఠినంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. 5వేల హెక్టార్లకు పైగా అడవి మాయంఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు 9వేల హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. అందులో దాదాపు 5వేల హెక్టార్లకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. అదే మండలంలోని వజీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో 855.69 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉండగా, అందులోనూ కబ్జాలు జరిగాయి. రాజగట్టు బ్లాక్ పరి«ధిలో 309.91 హెక్టార్ల భూమి ఉండగా, దానిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపు బాధి తులకు పునరావాసం కింద కేటాయించారు.ఫార్మ్– డి పట్టాలు జారీ చేశారు. సాగునీటి సదుపాయం లేకపోవడంతో బాధితులు సాగు చేయకపోవడంతో అధికారులతో కుమ్మక్కైన కొందరు దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు తెలిసింది. వీర్లపాలెం బ్లాక్ పరిధిలో 2,389.72 హెక్టార్ల అటవీ భూమిలో దాదాపు 500 హెక్టార్ల భూమిని రాజకీయ పలుకు బడితో కొందరు ఆక్రమించుకున్నారు. దిలావర్పూర్ బ్లాక్ పరిధిలో 1,679.42 హెక్టార్ల అటవీ భూమి ఉండగా 200 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. మొల్కచర్ల బ్లాక్ పరిధిలో 2726.26 హెక్టార్ల భూమి ఉండగా 724.10 హెక్టార్ల భూమిని సాగర్ ముంపు బాధితులకు కేటాయించారు. ఆ భూములను కూడా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్లు కూడా వేసుకున్నట్లు తెలిసింది. కేజేఆర్ కాలనీ పరిధిలో దాదాపు వంద ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదామరచర్ల మండలంలోనే 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో తప్పుడు పట్టాలను సృష్టించారు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో ఈభూములను కబ్జా చేయడం గమనార్హం. చట్ట విరుద్ధంగా ఇచ్చిన పట్టాలపై 2010లోనే ఆర్డీవో విచారణ జరిపి దొంగ పట్టాలను రద్దు చేశారు. అవి రద్దయి 15 ఏళ్లు కావస్తున్నా.. నేటికీ భూములు కబ్జాదారుల అధీనంలోనే ఉన్నాయి. దామరచర్ల పీఏసీఎస్‌లో 12 మంది 18 నకిలీ పట్టాలను సృష్టించి రూ.కోట్లు రుణంగా పొందారు. ఉల్సాయిపాలెం పరిధిలోని 145 సర్వే నంబర్లోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో అధికారులు అక్రమంగా పట్టాలు జారీ చేశారు.మిర్యాలగూడలోనూ భారీగా కబ్జాలుమిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామ రుద్రప్ప చెరువు 310 ఎకరాల్లో ఉండగా, అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ వద్ద 66, 67 సర్వే నంబర్లలో 3.22 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ప్రస్తుతం ఆ భూమి కబ్జాపై విచారణ కొనసాగుతోంది. పట్టణ శివారు లోని చింతపల్లి, హైదలాపురంలో సర్వే నంబరు 5లో స్వాతంత్య్ర సమరయోధుల పేరిట సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు.నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై 626 సర్వే నంబరులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. పట్టణం నడి బొడ్డులోని పాత బస్టాండ్ ఎదురుగా రూ.కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిని నకిలీ దత్తత పత్రాలు సృష్టించి కాజేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణంలోని బస్టాండ్ పక్కనే 4 గుంటల ప్రభుత్వ భూమిని బడా వ్యాపారి ఆక్రమించుకున్నట్లు ఆరోప ణలున్నాయి. అడవిదేవులపల్లి మండలంలో 900.04 హెక్టార్ల భూమి ఉండగా అందులో దాదాపు 600 హెక్టార్లు కబ్జాకు గురైనట్లు అధికారులు భావిస్తున్నా రు. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతి నిధుల అండదండలతో కొందరు ఆ భూముల్లో వరి, బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు.తాత్కాలిక చర్యలతో ఆగని కబ్జాలు..దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సమీపంలో తాళ్లవీరప్పగూడెం వద్ద 66వ సర్వే నంబరులో 15.08 ఎకరాలు, 67వ సర్వే నంబరులో 8.29 ఎకరాల భూమి జాబిశెట్టి శేషమ్మ పేరుతో ఉండగా 1997లో సీలింగ్ యాక్టు ప్రకారం పట్టాదారు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ధరణిలో కొందరు ఆ భూములపై పట్టాలు పొందారు. అంబటి రామాంజనేయులు 6 ఎకరాలు, వింజం ముసలయ్య 5.29 ఎకరాలు, సాధినేని శ్రీనివాస్‌రావు 2.25 ఎకరాలు, రాయికింది దివ్య 3 ఎకరాలు, నాలావత్ కమిలి 3 ఎకరాలు, ఇండియా సిమెంట్స్ 1 ఎకరం పట్టా పొందారు. ఈ పట్టాలను రద్దు చేసి, ఇటీవల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. మిర్యాలగూడ పట్టణ శివారు పందిళ్లపల్లి చెరువు 480 ఎకరాల్లో ఉంది. ఆ భూములను కబ్జా చేసేందుకు కొందరు కంచె నిర్మించగా అధికారులు దానిని తొలగించారు. అప్పుడప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నా కబ్జాలు మాత్రం ఆగడం లేదు. -
తారను మాయం చేయనున్న జాబిల్లి
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది. భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుగువారి బాహుబలి.. ఇనుప కండలు.. ఉక్కు నరాలు!
‘తిండి కలిగితె కండకలదోయ్.. కండకలవాడేనుమనిషోయ్’ అని చెప్పిన మహాకవి గురజాడ నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే ప్రపంచం మెచ్చిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి నాయుడు కూడా తిరుగాడారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్క్యులస్గా, మల్లమార్తాండగా ప్రపంచదేశాల్లో భారత కీర్తిప్రతిష్టలు చాటిచెప్పారు. తన భుజ బలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు. బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించడం, ఒకటిన్నర టన్నుల బరువును గుండెలపై పెట్టించి మోయడం, ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవడం వంటి వళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసిన రామ్మూర్తినాయుడు గురించి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటిచేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు శభాష్ అన్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం. నేడు ఈ మల్లయోధుడి 142వ జయంతివీరఘట్టం: కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు వీరఘట్టంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారబంతో రామ్మూర్తి నాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మాకొడుతూ వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవాడు. కొడుకును చదివించాలనే దృష్టి ఉన్న వెంకన్న రామ్మూర్తిని విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణ స్వామి ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లినా రామ్మూర్తి చదువు కంటే వ్యాయామం వైపే మొగ్గు చూపుతుండటంతో పినతండ్రి రామ్మూర్తిని మద్రాస్ పంపి వ్యాయామ కళాశాలలో చేర్పించాడు. తర్వాత విజయనగరంలో తను చదివిన కళాశాలలోనే రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కొన్నాళ్లకు విజయనగరంంలో రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఊపిరి బిగబట్టి.. ఉక్కు గొలుసులు తెంపి రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో మరింత కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తిని ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంతవేగంగా నడిపించినా అవి కదిలేవి కాదు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామ్మూర్తినాయుడు పూణె వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రామ్మూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.1920 సంవత్సరంలో కార్లను ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతున్న రామ్మూర్తి ప్రదర్శన చూసి బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మింటో ఆశ్చర్యపోయారు. రామ్మూర్తి బృందాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లి బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి ముందుప్రదర్శన ఇప్పించారు. రామ్మూర్తి నాయుడు ప్రదర్శనకు మెచ్చిన ఇంగ్లండ్ రాణి అతనికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుతో సత్కరించారు. యూరప్‌లో పలు ప్రదర్శనలు ఇచ్చిన రామ్మూర్తినాయుడు అనంతరం జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలో స్థిరపడ్డారు. చేతికి ఎముకలేని దాత కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి, ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేసారని, అప్పటినుంచి ఆయన దైవచింతనలో ఉండేవారని చెబుతారు.ఆ సాధువు నుంచే రామ్మూర్తి జలస్తంభన, వాయుస్తంభన విద్యలు నేర్చుకున్నాడు. సర్కస్ కంపెనీ ద్వారా అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన రామ్మూర్తి భారీగా దానధర్మాలు, విరాళాలు అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సైతం తనవంతు సాయం అందించారు. జీవిత చరమాంకంలో రామ్మూర్తినాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముట్టాయి. కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాదీశుని పోషణలో ఉండగా 1942 జనవరి 16వ తేదీన రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. ‘కోడి’ బయోపిక్.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రెండేళ్ల కిందట కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ నటుడు దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఈ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి కోడి రామ్మూర్తినాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన అటువంటి మహానుభావుని చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించాలి. రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నార్త్ కరోలిన్, అమెరికాపాఠ్యాంశంగా చేర్చాలి 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది. కాలక్రమేణ సిలబస్ మారడంతో దాన్ని తొలగించారు. ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఇంకో నెల తర్వాతే మాకు దీపావళి’
దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్‌లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు. -
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్‌కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్‌తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్‌కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్ వద్దు..!
అలెక్స్ హేలీ ‘రూట్స్’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్ పురాతన ఫ్రెంచ్ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. పెరిగిన జాత్యాహంకార నేరాలు ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్ మెర్జౌక్ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్ ఆఫ్రికన్ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.మా విశ్వాసాలంటే చులకన 2015లో ఇస్లామిక్ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్లో స్థిరపడ్డారామె. ‘‘ఫ్రాన్స్ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. వెంటాడుతున్న వివక్ష.. మెంకా గోమెస్దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్–వర్డ్ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్‌లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్‌హౌస్‌లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?
యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.మెరుపు స్థాయిలో మోహరింపు కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు. పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతంరక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి. ఎగుమతులకూ ప్రోత్సాహం దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరగనున్న ఉపాధి అవకాశాలుఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది.