Sakshi Special
-
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యోగానికి ఓకే
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..! ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది. చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి. దీంతోపాటు, కెఫెల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్‌టైం జాబ్‌కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్‌లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు. పైపెచ్చు, పగలంతా మేం జాబ్లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిన్జిన్ అనే బీజింగ్‌కు చెందిన టీచర్‌కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది. పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్‌గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఆ పథకం ‘గ్యాసే’నా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అందని ద్రాక్షగానే తయారైంది. ఒక కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. లబి్ధదారులు కలెక్టరేట్ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దరఖాస్తులు సవరించుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపేదలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాదిరిగానే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాపాలనలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్ కుటుంబాలను గుర్తించింది. అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత సాధించిన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం అందడం లేదు. ఇదీ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ పరిధిలో అధికారికంగా గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్ కలిగిన కుటుంబాలు 30.18 లక్షలకు పైనే ఉన్నాయి. అందులో 20 శాతం మినహా మిగతా 80 శాతం కుటుంబాలు మ హాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం పది శాతం దరఖాస్తుదారులకు కూడా గ్యాస్ సబ్బిడీ వర్తించలేదు. పరిష్కారమేదీ? గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్యాస్కనెక్షన్ నెంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్లను సవరించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్’
సాక్షి, సెంట్రల్ డెస్క్: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్ కూడా చాలా పాపులర్. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబర్ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అండా సెల్లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుడ్డు ఆకారంలో..⇒ అండా సెల్ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్మెంట్లుగా విభజితమై ఉంటుంది.⇒ మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఈ అండా సెల్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్ జైళ్లలోనూ ఈ అండా సెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.⇒ 1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.⇒అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్ వాండెట్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్స్టర్లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.⇒ అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అరుణ్‌కుమార్ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్ సింగ్ జిందా, సుఖ్‌దేవ్ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా సెల్లో తొలిసారిగా ఉంచారు.అండా సెల్స్ ఎందుకు?అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులుఅండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్ కూడా అండా సెల్లోనే అటాచ్డ్గా ఉంటాయి. అండా సెల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'గారం' భారంగా.. మన మధ్య పిల్లలెందుకు?!
భార్యాభర్తలకు పిల్లలు భారమవుతున్నారు. అందుకే పలు జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నాయి. ఇద్దరూ కష్టపడి సంపాదించినా బతకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచి.. వారిని ప్రయోజకుల్ని చేయడం పెనుభారంగా మారుతోంది. లక్షలకు లక్షలు పోసి వారిని చదివించాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఇక వారి ఆలనా పాలనా చూడటంతోనే తమ జీవితమంతా కరిగిపోతోందని జంటలు భయపడుతున్నాయి. అందుకే పలువురు భార్యాభర్తలు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు.పూర్వకాలంలో పిల్లల్ని కనడానికి ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. భార్యాభర్తలు ఎంతమందినైనా కనొచ్చు. పది, పదిహేను మంది పిల్లల్ని కనేవారు. ముగ్గురు, నలుగురు పిల్లలుండటం అనేది సర్వసాధారణం ఆ రోజుల్లో. అంతెందుకు షాజహాన్ ప్రేమతో తాజ్‌మహల్ కట్టేలా చేసిన ముంతాజ్‌కు పద్నాలుగు మంది పిల్లలు. భారతంలో కుంతీదేవికి ఆరుగురు కుమారులు, రామాయణంలో దశరధుడికి నలుగురు సంతానం. ఇక ఎన్టీ రామారావుకి 12 మంది పిల్లలు. ఇక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న వారి సంఖ్య లెక్కే లేదు. అలాంటి మన కుటుంబ వ్యవస్థలోకి ఇప్పుడు డ్యుయల్ ఇన్‌కం నో కిడ్స్(డింక్) సంస్కృతి చొచ్చుకొచి్చంది. భార్యాభర్తలు ఉద్యోగం చేసి వచి్చన డబ్బుతో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనినే డింక్ విధానంగా పిలుస్తున్నారు. ఇప్పుడిది దేశంలోనూ వేగంగా విస్తరిస్తోందని ఇటీవల విడుదలైన ‘లాన్సెట్ నివేదిక’ స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే బాగా ఇది విస్తరించింది. ఇక మన దేశంలో నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోనూ వేగంగా చొచ్చుకొస్తోంది. ఈ డింక్స్ కల్చర్ వలన 2050 నాటికి 90 దేశాల్లో జనాభా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది.కోరికలను చంపుకొని..పిల్లల్ని పెంచడం కోసం రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు కట్టడమే భార్యభర్తలకు సరిపోతుంది. దీంతో చాలా మంది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఒత్తిడికి లోనై, మానసిక ఆందోళనలు, కోరికలు చంపుకొని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం.. ఒక బిడ్డను 17 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచాలంటే దాదాపు 3 లక్షల డాలర్లకు పైగా ఖర్చవుతుంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే డబ్బంతా ఖర్చయితే తమ పరిస్థితేంటని నేటి తరంలో దాదాపు 61 శాతం మంది భార్యాభర్తలు ఆలోచిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. 18 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న డింక్ జంటల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో పిల్లలను కనడం లేదని వెల్లడించారు.మనదేశంలోనూ వేగంగా..మన దేశంలోనూ డింక్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాదిలోనే ఇది ఎక్కువగా ఉంది. లాన్సెట్ నివేదిక ప్రకారం..1950లో భారత్‌లో సంతానోత్పత్తి రేటు 6.18 శాతంగా ఉండగా, ఇది 1980 నాటికి 4.60కు చేరింది. 2021లో 1.91 శాతానికి పడిపోయింది. మన దేశంలో 30 శాతం మంది డింక్ సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఇందులో మరో ఆశ్చర్యమేంటంటే.. పట్టణాల్లో 22 శాతం మంది డింక్‌లుగా మారితే, గ్రామాల్లో 42 శాతం మంది ఉన్నారు. యుక్త వయసులో బానే ఉంటుంది గానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి విస్తరిస్తున్న డింక్ సంస్కృతి వల్ల పిల్లలు లేకుండా జీవించడం యుక్త వయసులో బానే ఉంటుంది.. కానీ కొన్నేళ్ల తర్వాత అందరూ ముసలివాళ్లే మిగులుతారు. వారి ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ ఉండరు. దంపతుల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగానే బతకాలి. అది వారికి నరకంగా మారుతుంది. అలాగే కుటుంబం, సమాజంలోనూ సహజత్వంలో మార్పు వస్తుంది. ఇది సమాజంలోని విలువలు, సంప్రదాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. -
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
Philadelphia: అవిభక్త కవలల సర్జరీ సక్సెస్
అవిభక్త కవలలుగా పుట్టిన ఇద్దరు అబ్బాయిలను విజయవంతంగా వేరుచేసి వారికి పునర్జన్మనిచ్చింది అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రి. వేరుచేశాక గత నెల 29న ఈ చిన్నారులు తొలి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్న షనేకా రూఫిన్, టిమ్ దంపతులకు అవిభక్త కవల పిల్లలు జన్మించారు. ఆ అబ్బాయిలకు అమరీ, జవార్ రూఫిన్ అని పేర్లు పెట్టుకున్నారు. కౌగిలించుకున్నట్లుగా ఎదురెదురుగా పొట్ట ప్రాంతమంతా అతుక్కుని పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరి బరువు కలిపి కేవలం 2.7 కేజీలు మాత్రమే. వాస్తవానికి అవిభక్తవ కవలల తల్లి షనేకా రూఫిన్ 12 వారాల గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భస్త శిశువులు అతుక్కున్నట్లు కనిపించింది. పుట్టే చిన్నారులకు శారీరక సమస్యలు వస్తాయని, ఆనాడే తల్లిని వైద్యులు హెచ్చరించారు. తల్లి మనసు ఊరుకోదుగా. గర్భస్రావం చేయించుకోనని తెగేసి చెప్పింది. ఎలాగైనా నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తానని కరాఖండీగా చెప్పేసింది. భర్త టిమ్ సైతం ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. పిల్లలు అతుక్కుని పుడితే వచ్చే సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు మరో ఆస్పత్రిని వెతికారు. అప్పుడే వాళ్లకు ‘చాప్’ చిల్డ్రెన్స్ ఆసుపత్రి ఆశాదీపంగా కనిపించింది. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చిన్నారులను అతుక్కుని పుట్టినాసరే వేరుచేయవచ్చని అక్కడి వైద్యులు భరోసా ఇచ్చారు. పిల్లల ఉమ్మడి శరీరంలో పొట్టతోపాటు కాలేయంలో కొంత భాగం కలిసే ఉంది. పిల్లలకు 11 నెలల వయసు వచ్చాక ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 21వ తేదీన 24 మందికిపైగా నిష్ణాతులైన వైద్యులు, మత్తుమందు డాక్టర్లు, రేడియాలజిస్టులు, నర్సులు ఇలా భారీ వైద్యబృందం ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు శ్రమించి చిన్నారులను విజయవంతంగా వేరుచేసింది. పొట్టను వేరుచేసేటపుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా మెష్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి వారిని వేరుచేశాక ఇద్దరి పొత్తి కడుపులను జాగ్రత్తగా బయటి నుంచి కుట్టేశారు. కొద్దిరోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ తర్వాత చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌కు ముందు ఆస్పత్రి యాజమాన్యం గత నెల 29వ తేదీన ఘనంగా వీళ్ల పుట్టినరోజు వేడుక జరిపింది. ‘‘ఇద్దరినీ ఇలా వేరువేరుగా చూడటం వర్ణనాతీతమైన అనుభూతినిస్తోంది’’ అని తల్లి రూఫిన్ ఆనందం వ్యక్తంచేశారు. టిమ్ దంపతులకు అంతకుముందే కైలమ్, అనోరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ‘‘ఆపరేషన్ తర్వాత మా కుటుంబసభ్యుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆనందమయ జీవన ప్రయాణాన్ని ఇక ఆరంభిస్తాం. దీనిని సుసాధ్యం చేసిన నిపుణుల బృందానికి మా కృతజ్ఞతలు’’ అని తల్లి చెప్పారు. ప్రతి 35వేల నుంచి 80వేల కవలల జననాల్లో ఇలా అవిభక్త కవలలు పుడతారని వైద్యశాస్త్రం చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అతని ఫౌజీ సాజిదా
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భర్త, మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుతో కలిసి మన దేశంలో అడుగుపెట్టిన సాజిదాకు ‘బెంగళూరు డేస్’ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉందా! అవును. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా బెంగళూరులో డిగ్రీ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ముయిజ్జుతో వివాహం అయింది. ‘ఆమె అతడి అదృష్టం’ అనే మాట ఎలా ఉన్నా ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అని మరోసారి గట్టిగా చెప్పడానికి బలమైన ఉదాహరణ సాజిదా మొహమ్మద్....మాల్దీవుల రాజధాని మాలేలో పుట్టింది సాజిదా. తండ్రి షేక్ మహ్మద్ ఇబ్రహీం ప్రఖ్యాత పండితుడు. రాజకీయ, సామాజిక విషయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉన్న సాజిదా రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేసింది. సాజిదా స్వేచ్ఛకు తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడ్డు పడలేదు.బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సాజిదా యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌లో సివిల్ సర్వెంట్‌గా పనిచేసింది. యూనిసెఫ్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లల ఆరోగ్యం నుంచి సృజనాత్మక ప్రతిభను పెం΄÷ందించడం వరకు ఎన్నో కార్యక్రమాలలో భాగం అవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ‘5 మిలియన్ ట్రీ ప్రాజెక్ట్’ ను లాంచ్ చేసింది. తలసీమియా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే తలసీమియా చికిత్సపై దృష్టి పెట్టింది.సాజిదా ప్రసంగాలలోని వాడి, వేడి ఏమిటో 2023 అధ్యక్ష ఎన్నిక సమయంలో లోకానికి తెలిసింది. తన అద్భుతమైన ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకునేది. భర్త విజయానికి ఆమె ప్రసంగాలు ఒక కారణంగా చెప్పవచ్చు.మాల్దీవులలో సైన్స్ రంగంలో మహిళలను, బాలికలను ్ర΄ోత్సహించడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ రంగాలలో మహిళల సంఖ్యను పెంచడానికి దేశ ప్రథమ మహిళగా ఎంతో కృషి చేస్తోంది సాజిదా.‘లింగ వివక్ష లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి’ అనే విషయాన్ని గట్టిగా చెబుతుంది.‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనేది ఆంగ్ల సామెత.తాను మాట్లాడబోయే అంశాలను ఇంట్లో భార్యతో పంచుకోవడం మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుకు అలవాటు. తన ఆలోచనలను సాజిదాతో పంచుకోవడమే కాదు ఆమె సలహాలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో తమ ముగ్గురు పిల్లలు యాస్మిన్, ఉమైర్, జాయెద్‌ల గురించి కుటుంబ విషయాలను ఎంత సహజంగా మాట్లాడుకుంటారో జెండర్ ఈక్వాలిటీ నుంచి జీరో వేస్ట్ప్రాజెక్ట్ల వరకు ఎన్నో సామాజిక విషయాలను అంతే సహజంగా మాట్లాడుకుంటారు.‘మా ఆలోచనలు ఎప్పుడు ఒకేరకంగా ఉంటాయి’ అని భార్య గురించి మురిసి΄ోతుంటాడు డా. మొహమ్మద్ ముయిజ్జు. -
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్ అధినేత కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. ‘ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’రిజిస్టర్ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్‌కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్‌పేట్ సర్వే నంబర్ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్ సర్వే నంబర్ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్ పొందేందుకు అనర్హులు. విక్రయించడం చట్టవిరుద్ధం ఒకరి ప్లాట్‌ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్‌లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 800 మందిని తొలగించే ప్రయత్నం.. సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ‘రియల్’దందా కోసమే.. సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్’కహానీ రెండో భాగంలో.. ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం. క్లబ్ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది. – ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు10 శాతానికి మించి ఉండొద్దు.. కో–ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడుసొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్ జూబ్లీహిల్స్ ఫేజ్–4. కాస్ట్ టు కాస్ట్ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్‌గా ముందుకు వచ్చాం. వెంచర్‌ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. – రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్‌ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. -
సంక్రాంతి పందెం పుంజులకు స్పెషల్ ట్రైనింగ్!
సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.అత్యంత గోప్యంగా..కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.5 వేలకు పైగా కోళ్లుకోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.మేత దర్జానే వేరుశిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు. -
సంచలనాల వ్యవస్థకు ఐదేళ్లు
సాక్షి, అమరావతి: బాపూజీ మహాత్మా గాంధీ కలలుగన్న అసలైన గ్రామ స్వరాజ్యానికి నిలువటద్దంగా.. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా రాష్ట్రంలో సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 77 ఏళ్ల పాటు రూ.లక్షల కోట్లు వెచ్చి0చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే పటిష్ట వ్యవస్థ లేనందున లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉండింది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో 2019 అక్టోబరు 2వ తేదీన అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019కి ముందు రాష్టంలో దాదాపు 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో చాలా పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ ఆఫీసు తప్ప మరో ప్రభుత్వ ఆఫీసు లేని దుస్థితి.నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అనంతరం కొత్తగా 1.34 లక్షల శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటికప్పుడే మంజూరు చేసింది. కేవలం నాలుగు నెలల కాలంలో వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఫలితంగా ప్రతి గ్రామంలో 8–10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా పని చేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణాలు, నగరాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. మరో వైపు జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవిన్యూ డివిజన్లను 52 నుంచి 77కు పెంచింది. అధునాతన వసతులు.. పారదర్శక సేవలు » గతంలో పంచాయతీ ఆఫీసులు ఇరుకు భవనాల్లో కొనసాగితే.. గత ప్రభుత్వం ప్రతి చోటా ఒక్కోదానికి రూ.43.60 లక్షలు ఖర్చు పెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల సచివాలయం భవనాలను నిరి్మంచింది. మొత్తం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా, అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. » ఒక్కో సచివాలయంలో రెండేసి కంప్యూటర్లను యూపీఎస్ సహా అందించింది. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్‌లు, 15,002 ప్రింటర్లతో పాటు 3 వేల ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతో పాటు ఇతర సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించడం కోసం, టెక్నాలజీని ఉపయోగించడం కోసం 2,91,590 స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డులతో ఇచ్చింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ తీరు » వలంటీర్లకు నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వం» ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని హామీ.. ఆచరణలో గత నాలుగు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించని ప్రభుత్వం.» లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి తూట్లు. వలంటీర్లకు కాకుండా సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యత అప్పగింత. దీంతో చాలా చోట్ల సచివాలయాల వద్దకే లబ్ధిదారులను పిలిపించుకొని పింఛన్ల పంపిణీ. » ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకోసం మళ్లీ మండలాలు, పట్టణాల్లో ఉండే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి.» బుడమేరు (విజయవాడ)వరదలో గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోని ప్రభుత్వం. ఫలితంగా ప్రభుత్వ సాయం కోసం జిల్లా కలెక్టరేట్ చూట్టు తిరుగుతున్న బాధితులు.» ప్రస్తుతం ఎక్కువగా కరెంటు బిల్లుల చెల్లింపుల వినతుల పరిష్కారానికి పరిమితం. » నాలుగు నెలలుగా వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించని వైనం.. మూడు నెలలుగా అందని గౌరవ వేతనం. » గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం చంద్రబాబు స్టిక్కర్లను ఇంటింటికీ అంటించే పని అప్పగింత.మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు : 15,004» వీటిలో జగన్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1.34లక్షలు» గ్రామ, వార్డు వలంటీర్లు 2.66 లక్షలు» గత ఐదేళ్లలో అందించిన సేవలు 11.48కోట్లు» కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలు :10,893సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిన సేవలు» రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏకంగా 11.48 కోట్ల ప్రజా వినతుల పరిష్కారం. » 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్‌పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్విసులు » అత్యధికంగా కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు, వ్యవసాయ భూముల అడంగులు, 1బీ వంటి కీలక వినతుల పరిష్కారం. » వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ. » కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాల వర్తింపు.» పారదర్శకత కోసం ప్రతి పథకం అమలు సమయంలో సోషల్ ఆడిట్.. సచివాలయాల వద్ద అర్హుల జాబితా ప్రదర్శన. » ఏదైనా కారణంగా పథకం లబ్ధి అందని వారి కోసం ప్రతి ఆరు నెలలకొకసారి మళ్లీ అవకాశం కలి్పంచడం. » ప్రతి నెలా ఠంఛన్‌గా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ » గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలు » ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారం.. కుల, ఆదాయ, వివిధ ధృవీకరణ ప్రతాల మంజూరుకు ప్రత్యేకంగా జగనన్న సురక్షా క్యాంపుల ఏర్పాటు. » ప్రతి నెలా ఆధార్ క్యాంపులు ఏర్పాటు » కోవిడ్ సమయంలో వలంటీర్లు–సచివాలయాల సిబ్బంది ద్వారా వేగంగా రోగుల గుర్తింపు, తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు. తద్వారా మృతుల సంఖ్య కట్టడి. దాదాపు 30 దఫాలుగా ఫీవర్ సర్వే. » ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధించేందుకు యునిసెఫ్‌తో కలిసి ఉమ్మడి కార్యాచరణ. » గ్రామ, వార్డు సచివాలయాల పరిశీలకు కేంద్రం, వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు.. వాటి నుంచి ప్రశంసలు -
ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’
సాక్షి, అమలాపురం: కోనసీమ రైలు బండి ఇంకా పట్టాలెక్కలేదు. కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. రెండు పుష్కరాలు దాటుతున్నా ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. తొలి పన్నెండేళ్లు నిధుల కేటాయింపు జరక్కపోగా.. తరువాత పన్నెండేళ్లు నిధులు కేటాయిస్తున్నా పనుల వేగం పుంజుకోలేదు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని ఎంపీలతో శుక్రవారం విజయవాడలో రైల్వే అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఇబ్బందులు, నిధులు కేటాయింపులపై చర్చ జరగాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్డు తగులుతున్న టీడీపీ నేతలుగౌతమి గోదావరి పాయ వద్ద 41 పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణ పనులకు గత నవంబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలు కాలేదు. వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై గడ్డర్ల నిర్మాణాలు జరిగితే గాని ట్రాక్ నిర్మాణం చేయలేరు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25 శాతం వాటాలో కేవలం రూ.2 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేయగా.. ఆ నిధులూ ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో అలైన్‌మెంట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసేకరణకు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతుండటం గమనార్హం.సహస్రాబ్దిలో శంకుస్థాపన కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నరసాపురం వరకూ రైల్వే లైన్ నిర్మాణానికి 2000 నవంబర్ 16న శంకుస్థాపన జరిగింది. మొత్తం 102.507 కిలోమీటర్ల పొడవైన కాకినాడ–నరసాపురం రైల్వే లైన్లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45.30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం గతంలోనే పూర్తయ్యింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57.207 కిలోమీటర్లు నిరి్మంచాల్సి ఉండగా.. ఇందులో కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకూ 12.05 కిలోమీటర్ల మేర భూసేకరణ జరిగింది. భట్నవిల్లి నుంచి నరసాపురం వరకూ సుమారు 45.157 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలి. దీనికి అప్పట్లో రూ.400 కోట్లు అవసరమని అంచనా వేయగా.. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం ఏకంగా రూ.2,120.16 కోట్లకు పెరిగింది. పనులు ఇంకా ఆలస్యమైతే అంచనాలు మరింత పెరగనున్నాయి.త్వరగా పూర్తయ్యేలా నిర్ణయం ఉండాలి కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు విడుదలైనా భూసేకరణ, ట్రాక్ పనుల విషయంలో జాప్యం జరుగుతోంది. కోనసీమలో త్వరితగతిన రైలు పరుగులు పెట్టేలా ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. భూసేకరణ, ట్రాక్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. – డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం గడ్డర్ల పనులకు టెండర్లు పిలవాలి వైనతేయ, వశిష్ట నదులపై వంతెనలకు గడ్డర్ల నిర్మాణాలకు టెండర్లు పిలవాలి. దీనిపై ఎంపీల సమావేశం నిర్ణయం తీసుకుని టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టేలా చర్యలు చేపట్టాలి. మొక్కుబడి సమావేశంగా కాకుండా రానున్న నాలుగేళ్లలో కోనసీమలో రైలు నడిచేలా అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ జేఏసీ, అమలాపురంనేడు ఏపీ ఎంపీలతో సమావేశం రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ రాష్ట్ర ఎంపీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. విజయవాడలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం మొదలవుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి, కొత్త రైల్వేలైన్లు, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై చర్చిస్తారు. -
కవలలే గానీ... గర్భాశయాలు వేరు
వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో లీ అనే మహిళ సెపె్టంబర్ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్ డాక్టర్ కై యింగ్ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్ డైడెలి్ఫస్‌గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం! ఎందుకిలా...? → గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. → కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. → ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. → ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. – బీజింగ్ -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్‌లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్‌నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.