Sakshi Special
-
పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! పరమశివుని పేరుతో పరమ్ రుద్ర పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి. నవ్యావిష్కరణకు రాచబాటలు యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. అర్క, అరుణిక పనేంటి? వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. ఏఏ పనుల్లో వాడతారు? → వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు. → పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు. → వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. → సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. → ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు. → మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్రుద్రను ఏర్పాటుచేశారు. → దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం
ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది... తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది. వాత్సల్య ఎవరికి? 2024–25 బడ్జెట్లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ టైర్–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్పీఎస్కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.సంరక్షకుల హక్కుఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.ఉపసంహరణ వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కడ ప్రారంభించాలి? ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రొటీన్ ఈ–గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు. వైదొలగడం పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సరి్టఫికెట్/ఎస్ఎస్సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి. అర్హతలు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్సీస్ సిటిజన్íÙప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్డీఏ కేటాయిస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి. ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్సీ)–75, ఎల్సీ–50, ఎల్సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి. డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.చిన్న మొత్తమే అయినా.. పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ–సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు. ఆన్లైన్లో ఎలా ప్రారంభించుకోవచ్చు? → ఈఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్’ను ఎంపిక చేసుకోవాలి. → ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్లోడ్ చేసి ‘కన్ఫర్మ్’ చేయాలి. → మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్ రిజి్రస్టేషన్’ను క్లిక్ చేయాలి. → మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. → ఆన్లైన్లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. → ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
Haryana Assembly Elections 2024: రెబెల్స్ దడ
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది. 20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావంఅయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు. 15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి హిసార్ పైనే.. బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు. కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు. బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం. కాంగ్రెస్‌కూ సెగ.. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్పాల్కు అడ్వాంజేట్గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది. -
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది. జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిషిదా వారసుడెవరో!
జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూడు పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాదరణ తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీపడటం లేదని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన కిషిదా, ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. అదేరోజు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కిషిదా ని్రష్కమణ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగే ఎన్నికలో ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రులు. దిగువసభ కాలావధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ప్రధాని పదవి చేపట్టాక కొద్ది వారాల్లోనే ఎన్నికలకు వెళతామని చాలా మంది పోటీదారులు బాçహాటంగానే చెప్పారు. ఓటింగ్ జరిగేదిలా.. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలముంది. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీపడుతున్న అభ్యర్థులకు కేటాయిస్తారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉంటాయి. మొదటిరౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారమే రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తదుపరి రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటింగ్‌కు అర్హులు. మొత్తం 415 ఓట్లు ఉంటాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు వేస్తారు. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కిషిదా కుర్చీ కోసం తొమ్మిది మంది రేసులో నిలిచినా.. ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెబుతున్నాయి. మాజీ రక్షణమంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నారు. యోషిమాసా హయాíÙ, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి, యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో.. మిగతా పోటీదారులు. టాప్–3 పోటీదారుల వివరాలిలా ఉన్నాయి...షిగెరూ ఇషిబా (67): ఆపత్కాలంలో అనుభవజు్ఞడు ఇషిబా మాజీ బ్యాంకర్. ఎల్డీపీ నాయకత్వానికి ఆయన పోటీపడటం ఇది ఐదోసారి. ఇదే తన చివరి ప్రయత్నమని ప్రకటించారు. 1986లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఇషిబా రక్షణ, వ్యవసాయ శాఖలతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూశారు. పార్టీ పదవుల్లోనూ పనిచేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ.. తోటి ఎంపీల నుంచి ఆశించినంత మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కాన్సిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ మాజీ ప్రధాని యోషిహికో నోడాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. వాగ్ధా్దటితో ప్రజలను ఆకట్టుకునే నోడాను ఎదుర్కొనడానికి ఇషిబా అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం అక్కరకొస్తాయని ఎల్డీపీ భావిస్తోంది. రక్షణ విధానాల రూపకల్పనలో నిపుణుడిగా ఇషిబాకు పేరుంది. నాటో రక్షణ కూటమి లాంటిది ఆసియాకూ ఉండాలని ఇషిబా ప్రతిపాదించారు. షిన్‌జిరో కొయిజుమీ (43): నాలుగోతరం వారసుడు ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని జునిచితో కొయిజుమీ కుమారుడే షిన్‌జిరో. కొయిజుమీ రాజకీయ వారసత్వంలో నాలుగోతరం నాయకుడు. శుక్రవారం ఎన్నికల్లో నెగ్గితే జపాన్‌కు అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. 2009లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. షింజో అబే కేబినెట్లో 2019– 2021 మధ్య పర్యావరణ మంత్రిగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో మాస్టర్స్ చేసిన షిన్‌జిరో ప్రముఖ టీవీ యాంకర్ తకిగవా క్రిస్టెల్ను వివాహమాడారు. ఇతర పోటీదారులతో పోలి్చనపుడు అనుభవం పెద్దగా లేకున్నా.. ఎల్డీపీ శ్రేణుల్లో ఆదరణ ఉంది. మాజీ ప్రధాని యోషిహిడే సుగా మద్దతు ఉంది. సంస్కరణ వాది. పితృత్వపు సెలవును ప్రమోట్ చేయడానికి 2020లో స్వయంగా రెండు వారాలు సెలవు తీసుకున్నారు. జపాన్– అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి పనిచేస్తానని షిన్‌జిరో చెబుతారు. రెండోరౌండ్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనుభవలేమి ఒక్కటే ప్రతికూలత.తకైచీ సనయీ (63): సంప్రదాయవాది తకైచీ గెలిస్తే జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి అవుతారు. మాజీ ప్రధాని షింజో అబే అనుయాయురాలు. సంప్రదాయవాది. రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సా«ధనసంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం.. ఇవి తకైచీ ప్రధాన హామీలు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. పురుషులనే వారసులుగా పరిగణించే రాజకుటుంబ సంప్రదాయాన్ని బలపరుస్తారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన తకైచీ తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు రోల్ మోడల్ అని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
42 ఏళ్ల రక్తచరిత్ర
హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఏకంగా ఆరు వందల మంది దాకా మరణించారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ ఇంతటి తీవ్ర దాడులకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కొత్తేమీ కాదు. ఇది నాలుగు దశాబ్దాల రక్తచరిత్ర... 1982: ఇజ్రాయిల్ ఆక్రమణ–హెజ్జ్బొల్లా్ల పుట్టుక హెజ్జ్బొల్లా, ఇజ్రాయెల్ సంఘర్షణకు 1982లో బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుట్ నడిజ్బొడ్డులో పీఎల్‌ఓను ముట్టడించింది. ఈ మారణకాండలో 2,000 మంది పాలస్తీనా శరణార్థులు, 3,500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచి్చందే హెజ్బొల్లా. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, బెకా లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తుండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది.1983–1985: రక్తపాతం–ప్రతిఘటన హెజ్జ్బొల్లా, దాని గ్రూపులు లెబనాన్‌లోని విదేశీ దళాలపై 1982–1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్‌లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడిలో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనేనని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించినా, దాడి వెనుక హెజ్జ్బొల్లా హస్తముందని ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బొల్లా బలపడింది. 1992–1996: రాజకీయ ఎదుగుదల 1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్జ్బొల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాల్లో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటననూ కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ అకౌంటబిలిటీ’లో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్జ్బొల్లాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్’తో హింస పరాకాష్టకు చేరింది. 2000–2006: ఇజ్రాయెల్ వెనుకంజ–జూలై యుద్ధం రెండు దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 మేలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. హెజ్జ్బొల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్‌లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్జ్బొల్లా బందించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ ‘జూలై’ఘర్షణలో 1,200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయెలీలు మరణించారు. 2009–2024: ప్రాంతీయ సంఘర్షణ 2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్‌లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచి్చనట్టు కని్పంచింది. 2012లో అసద్ ప్రభుత్వం తరఫున హెజ్జ్బొల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచి్చంది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్జ్బొల్లాకు కొత్త శక్తినిచి్చంది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్జ్బొల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
శతకోటి సూర్యులను తలదన్నే... ప్లాస్మా ప్రవాహాలు
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్‌హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్‌హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో అత్యంత పెద్దవి ఇవేనట. ఈ ప్రవాహాలు అంతరిక్షంలో ఏకంగా 2.3 కోట్ల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకున్నట్టు గుర్తించారు! అంతేగాక ఇవి లక్షలాది కోట్ల సూర్యులను మించిన శక్తిని వెదజల్లుతున్నాయట! దీన్నిబట్టి వాటి ఉద్గమ స్థానమైన రాకాసి కృష్ణబిలం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ కృష్ణబిలం భూమికి 750 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అనంతశక్తితో నిండిన కృష్ణబిలాలు తన పరిధిలోకి వచ్చే ఏ వస్తువునైనా లోనికి లాక్కుంటాయన్నది తెలిసిందే. ఎంతటి భారీ నక్షత్రాలైనా వాటి బారినుంచి తప్పించుకోలేవు. వాటిని కబళించే క్రమంలో కొద్దిపాటి ద్రవ్యరాశి ప్లాస్మా ప్రవాహంగా మారి కృష్ణబిలం తాలూకు రెండు అంచుల గుండా అపరిమితమైన వేగంతో బయటికి ఎగజిమ్ముతుంది. వాటిని బ్లాక్‌హోల్ జెట్స్‌గా పిలుస్తారు. ఇవి అనంతమైన ప్రకాశంతో మెరిసిపోవడమే గాక దాదాపుగా కాంతివేగంతో దూసుకెళ్తాయి. ఆ క్రమంలో అంతరిక్షంలో ఇలా కళ్లు చెదిరే దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. విశ్వనిర్మాణాన్ని బ్లాక్‌హోల్ జెట్స్ ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ జంట ప్రవాహాలు ఎంతగానో దోహదపడతాయని సైంటిస్టులు మురిసిపోతున్నారు. వీటికి ముద్దుగా గ్రీకు పురాణాల్లోని మహాకాయుడు పోరి్ఫరియాన్ పేరు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోనేకా ఠేట్.. నారాయణపేట్
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. బంగారు విక్రయానికి 128 ఏళ్లు నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి. హాల్‌మార్క్.. మోనోగ్రామ్ స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి. శుభకార్యం వస్తే చాలు.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు. స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్లైన్లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు. సరాఫ్ బజార్ ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం కొనసాగుతోంది. తేజాప్తో నాణ్యత ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.30 ఏళ్లుగా వ్యాపారం నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం. – సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేటనాణ్యతకు మారుపేరు.. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు. – హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేటఅంతా ‘చొక్క’బంగారమే నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది. – శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేటచొక్క బంగారు అభరణాలివే నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు. -
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Erigaisi Arjun: తడబాటు నుంచి తారాస్థాయికి...
స్వీయ అంచనాలతో పాటు... ఫలితాల ఒత్తిడితో సతమతమై కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... వాటిని పక్కన పెట్టడం వల్లే విజయవంతం అయ్యానని వెల్లడించాడు. ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఓరుగల్లు కుర్రాడు ఇక మీదట కూడా ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా... అందులో తన వంతు పాత్ర ఉండటం ఆనందంగా ఉందని 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ఒలింపియాడ్‌లో ఆడిన 11 గేమ్‌ల్లో తొమ్మిదింట నెగ్గిన అర్జున్... వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి దూసుకెళ్లాడు. చెస్ ఒలింపియాడ్ ప్రదర్శన, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అర్జున్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అతిగా ఆలోచించి... ఒత్తిడిని అధిగమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే 2021లో నా ఎలో రేటింగ్ పాయింట్లు 2500 ఉండేవి. కానీ నా సామర్థ్యం కచ్చితంగా అంతకన్నా ఎక్కువే అని నమ్మేవాడిని. ఇక రెండేళ్లు తిరిగేసరికి 2023లో ఎలో రేటింగ్ 2700కు చేరింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టంగా గడించింది. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైంది క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక కాకపోవడం. చాన్నాళ్లుగా ఆ టోర్నీలో ఆడాలని అనుకుంటూ వచ్చా. అయితే గత ఏడాది దానికి అర్హత సాధించలేకపోవడం బాధించింది. ఒకప్పుడు సొంత అంచనాలతో సతమతమయ్యేవాడిని. ఎక్కువ ఊహించేసుకొని గందరగోళానికి గురయ్యే వాడిని. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం నా ఆటతీరుపై ప్రభావం చూపింది. దాన్ని మార్చుకోవడం అంత సులువుకాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. ఫలితాలను పట్టించుకోవడం మానేశా. ఏదో సాధించాలని తీవ్రంగా కోరుకుంటూ నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటున్నానని అర్థం చేసుకున్నా. వాటిపై దృష్టి పెట్టడం వదిలేశాక మెరుగైన పలితాలు రావడం ప్రారంభమైంది. అదే అతిపెద్ద లక్ష్యం! ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే నా అతిపెద్ద లక్ష్యం. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ ముందుకు సాగుతున్నా. ఒక టోర్నమెంట్లో బరిలోకి దిగితే దాని గురించే ఆలోచిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సానుకూల ఫలితం సాధించాలనుకుంటా. ప్రస్తుతం మన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దీన్ని చదరంగంలో మన ‘గోల్డెన్ ఎరా’గా చెప్పుకొవచ్చు. నాతో పాటు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మేమంతా స్నేహితులం గుకేశ్, ప్రజ్ఞానందతో మంచి అనుబంధం ఉంది. చాన్నాళ్లుగా కలిసి ఆడుతుండటంతో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఒకరికి ఒకరం అండగా నిలుస్తాం. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇది ఎంతగానో దోహద పడుతుంది. 2003 నుంచి 2006 మధ్య జన్మించిన వాళ్లమే జట్టులో ఎక్కువ మంది ఉన్నాం. అందులో నేనే పెద్దవాడిని. ప్రస్తుతం మన దశ నడుస్తోంది. స్వతహాగా నేను టీమ్ ఈవెంట్లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతా. గ్లోబల్ చెస్ లీగ్ (జీఎస్ఎల్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చెస్ ఐపీఎల్ గ్లోబల్ చెస్ లీగ్‌ను చదరంగ ఐపీఎల్ అని భావిస్తా. సమష్టి ప్రదర్శనలు అంటే నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫార్మాట్లో జరగనున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ లీగ్‌లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. నల్ల పావులతో ఆడి విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు... తెల్ల పావులతో గెలిస్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు. అంటే తెల్ల పావులతో ఆడిన సహచరుడు పరాజయం పాలైతే... ప్రత్యర్థి జట్టు పాయింట్లను అందుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనివల్ల ‘డ్రా’ల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకే ఈ ఫార్మాట్ నన్ను బాగా ఆకర్షించింది. గత జీఎస్‌ఎల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్తో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగడం చాలా సంతోషంగా అనిపించింది. కార్ల్సన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ఏడాది భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జట్టు తరఫున ఆడనున్నా. నా ఆటపై ఎంతో ప్రభావం చూపిన గురువు లాంటి విశ్వనాథన్ ఆనంద్‌తో సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా. మానసికంగా సిద్ధమయ్యా... ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. ఫలానా టోర్నీలో ఫలానా ఆటగాడిపై తప్పక గెలవాలని అనుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. ఆ తర్వాత అత్యుత్తమ ఆటతీరు కనబరిస్తే ఫలితం కూడా అందుకు తగ్గట్లే ఉంటుందనే విషయం గ్రహించా. ఇది చెప్పినంత సులభం కాదు. ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. గత ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం చాలా బాధించింది. ఈ ఏడాది చాలా బాగా గడిచింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. -
కంచికి చేరిన కథ ఇది!
150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కోల్‌కతా ట్రామ్‌ల కథ ముగిసిపోతోంది. ట్రామ్‌ల సేవలను నిలిపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రోడ్లపై ట్రామ్‌లు కనిపించవు. కేవలం ఒక మార్గంలో ట్రామ్‌లు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది కూడా ఎక్కవ రోజులు కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోల్‌కతాకు పర్యాయపదమైన ఈ ప్రజా రవాణా వాహనాలు ప్రస్థానం ముగిసిపోతుండడం నగర ప్రజలను, పర్యాటకులను ఆవేదనకు గురిచేస్తోంది. ట్రామ్‌ల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామ్‌ల గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. సుదీర్ఘ ప్రయాణం 👉 కోల్‌కతాలో(అప్పటి కలకత్తా) బ్రిటిష్ ప్రభుత్వం 1873 ఫిబ్రవరి 24న ట్రామ్‌లను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత ఉత్తర కలకత్తాలోని సీల్డా–అర్మేనియా ఘాట్ మధ్య 3.9 కిలోమీటర్ల మార్గంలో ట్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుర్రాలు ఈ ట్రామ్‌లను లాగేవి. 👉 ట్రామ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో 1873 నవంబర్‌లో సేవలు నిలిపివేశారు. 👉 1880 నవంబర్‌లో ట్రామ్‌లు మళ్లీ పట్టాలెక్కాయి. లండన్‌లో రిజిస్టరైన ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ఆధ్వర్యంలో మీటర్ గేజ్ ట్రామ్‌లను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ట్రామ్లకు ఎదురే లేకుండాపోయింది. 👉 1882లో స్టీమ్ ఇంజన్లు వచ్చాయి. 1900వ సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్లు దశలవారీగా ప్రారంభించారు. 👉 1943 నాటికి కోల్‌కతాతోపాటు హౌరాలోనూ ట్రామ్‌లు విస్తరించాయి. ప్రయాణ మార్గం దాదాపు 70 కిలోమీటర్లకు చేరుకుంది. 1960 నాటికి ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ ఆధ్వర్యంలో ట్రామ్‌ల సంఖ్య 450కి చేరింది. 👉 1969 దాకా ట్రామ్‌లు వైభోగం అనుభవించాయి. విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. క్షీణదశ ఆరంభమైంది. 👉 1970 అక్టోబర్‌లో హౌరాలోని బంధాఘాట్లో, 1971 డిసెంబర్లో శివపూర్‌లో ట్రామ్‌లను నిలిపివేశారు. 1973 మే నెలలో కోల్‌కతాలోని నిమ్తాలా ఘాట్‌లో ట్రామ్ సేవలకు తెరపడింది. 👉 వేర్వేరు ప్రయాణ సాధనాలు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ట్రామ్లకు ఆదరణ పడిపోయింది. 👉 కోల్‌కతాలో 1948లో బస్సులు, 1984ల మెట్రో రైళ్లను ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో ఎల్లో ట్యాక్సీలు, ఓలా, ఉబర్ వంటివి వచ్చాయి. ట్రామ్‌లతో పోలిస్తే ఇవన్నీ వేగవంతమైన ప్రయాణ సాధనాలే. అందుకే జనం అటువైపు మొగ్గుచూపారు. 👉 1969లో మొత్తం 70.74 కిలోమీటర్ల మార్గాల్లో పరుగులు పెట్టిన ట్రామ్‌లు ఇప్పుడు కేవలం 3 మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు పరిమితం అయ్యాయి. నిత్యం కేవలం 3 వేల మంది ట్రామ్‌ల్లో ప్రయాణిస్తున్నారు. 👉 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రామ్‌ల సంఖ్యను, ప్రయాణ మార్గాలను భారీగా తగ్గించారు. కోర్టు ఏం చెబుతుందో? ట్రామ్‌ల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించడాన్ని సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో 2021, 2022లో రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెంగాల్ రవాణా సంస్థ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ట్రామ్‌లను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది. అధిక జనాభాతో కిక్కిరిసిపోతున్న కోల్‌కతాలో ఈ ట్రామ్‌ల వ్యవస్థ ఇకపై అవసరం లేదని కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఒక నివేదికను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శికి అందజేశారు. ఈ నివేదికను హైకోర్టులో సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ట్రామ్లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే ఏడాది 8న జరుగనుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్‌తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్‌ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్‌కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్‌కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
ట్రంప్ భద్రతలో వైఫల్యం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జూలైలో హత్యాయత్నం జరిగిన ర్యాలీలో భద్రతా వైఫల్యాలను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది. తమ సమీక్షలో వెల్లడైన వైఫల్యాలను శుక్రవారం వివరించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నిర్వహించిన ఔట్‌డోర్ కార్యక్రమంలో షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపడం, కుడి చెవికి గాయంతో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ర్యాలీలో కాల్పుల్లో ఇద్దరు గాయపడగా, అగి్నమాపక సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన క్రూక్స్‌ను సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత సీక్రెట్ సరీ్వస్ డైరెక్టర్ కింబర్లీ చీట్లే రాజీనామా చేశారు. సీక్రెట్ సరీ్వస్ ఏజెంట్లు సెలవులో వెళ్లారు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీక్రెట్ సర్వీస్ ప్రణాళిక, దాని అమలులో లోపాలను గుర్తించిందని తాత్కాలిక డైరెక్టర్ రోనాల్డ్ రోవ్ జూనియర్ తెలిపారు. అడ్వాన్స్ టీంలోని కొందరు చాలా శ్రద్ధగా వ్యవహరించగా, మరికొందరి అలసత్వం భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు దారితీసిందన్నారు. హెచ్చరికలు లేవు.. స్థానిక యంత్రాంగంతో పేలవమైన కమ్యూనికేషన్, మొబైల్ పరికరాలపై అతిగా ఆధారపడటం, సమాచారం పక్కదారి పట్టడం వంటి సమస్యలను గుర్తించామని రోవ్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 18:10 గంటలకు కౌంటర్ స్నైపర్ రెస్పాన్స్ ఏజెంట్‌కు సీక్రెట్ సరీ్వస్ సెక్యూరిటీ రూమ్ కాల్ చేసి.. ఏజీఆర్ భవనం పైకప్పుపై ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. అయితే సీక్రెట్ సరీ్వస్ రేడియో నెట్వర్క్ ద్వారా ఆ కీలక సమాచారం ప్రసారం కాలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి ప్రతిస్పందించేందుకు కాక, ఏదీ జరగకుండా నివారించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు అదనపు నిధులు, సిబ్బంది, పరికరాలు అవసరం... ట్రంప్‌పై హత్యాయత్నాన్ని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెషనల్ టాస్‌్కఫోర్స్ తెలిపింది. ఉద్యోగులను జవాబుదారీ చేయడం విషయంలో రోవ్‌ను అనుసరించాలని, స్వతంత్ర దర్యాప్తునకు సహకరించాలని, సీక్రెట్ సరీ్వస్‌లో అలసత్వానికి స్థానం ఉండకూడదని సూచించింది. అధ్యక్షుడితో సమాన భద్రత.. గత వారాంతంలో ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరగడంతో భద్రతకు డిమాండ్ పెరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులతో సమానంగా అధ్యక్ష అభ్యర్థులకు సీక్రెట్ సరీ్వస్ భద్రతను పెంచే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సెనేట్‌లో ఓటింగ్, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పూర్తయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు అధ్యక్షుడితో సమానమైన రక్షణ కలి్పస్తున్నామని రోవ్ చెప్పారు. సీక్రెట్ సర్వీస్ పనిచేసే వాతావరణానికి ముప్పు విపరీతంగా ఉందని ఆదివారం జరిగిన ఘటన రుజువు చేస్తోందని రోవ్ అన్నారు. ఇక ఫ్లోరిడాలో గన్‌మెన్ ట్రంప్‌వైపు చూడను కూడా చూడలేదని, ముందే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
ఫుడ్ ప్యాక్‌లో ఎలుక
అవున్నిజమే! విమానంలో ఎలుక కనిపించింది. అంది కూడా ఓ ప్రయాణికురాలికి అందించిన ఫుడ్ పార్సిల్లో. ఆమె పార్సిల్ తెరవగానే ఎలుక అమాంతం బయటికి దూకి సీట్ల కింద దూరింది! దాంతో విమానంలో కలకలం రేగింది. నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలగాకు వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిందీ ఘటన. ఆ దెబ్బకు విమానాన్ని అత్యవసరంగా కోపెన్‌హాగన్‌లో దించారు. ప్రయాణికులను వేరే విమానంలో మలగాకు పంపించారు. విమానాల్లోని ఎలకి్ట్రకల్ వైరింగ్ తదితరాలను ఎలుకలు కొరికాయంటే అంతే సంగతులు. అందుకే అవి విమానంలోకి రాకుండా ఎయిర్‌లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి! అలాంటిది ఏకంగా ఫుడ్ పార్సల్లోనే బతికున్న ఎలుక రావడాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఆహార పంపిణీ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పుకొచ్చింది. ఇటీవల దక్షిణ ఇంగ్లాండ్‌లో రెండు ఉడతలు రైలెక్కడంతో చివరకు ఆ సరీ్వసును రద్దు చేయాల్సి వచి్చంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది.