Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu govt Red Book Rule On YSRCP Leader Posani Krishna Murali1
కూటమి సర్కార్‌ వికటాట్టహాసం

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్‌ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్‌కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయ­వా­దులను, వైఎస్సార్‌సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్‌/ సాక్షి, రాయచోటి: రెడ్‌బుక్‌ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్‌ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్‌ కొనసాగించింది. జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్‌ 196, 353(2), 111 ఆర్‌/డబ్ల్యూ 3(5) ఆఫ్‌ ది బీఎన్‌ఎస్‌ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు గురు మహేష్‌.. బీపీ, షుగర్, పల్స్‌ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్‌గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సుదర్శన్‌రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా కనీ్వనర్‌ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్‌ సెల్‌ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ధిక్కారం ‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదే­శాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్‌సీపీ లీగల్‌ అడ్వ­యి­జర్‌ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్‌­సిక్స్‌ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్‌ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్‌ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు జిల్లా ఎస్పీఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్‌కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్‌ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 2.. కొనసాగుతున్న వాదనలు పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసుస్టేషన్‌ ద్వారం వద్దకు వాహ­నాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా అర్ధరాత్రి 2 గంటలైనప్పటికీ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.త్రిబుల్‌ వన్‌ సెక్షన్ల దుర్వినియోగం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్‌ వన్‌ (111) సెక్షన్‌లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం. – పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, మాజీ అసిస్టెంట్‌ అడ్వొకేట్‌ జనరల్‌

Telangana Govt decided to build Another tunnel connecting SLBC tunnel to main tunnel2
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'!

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభంగా సాగేలా, ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేగంగా చర్యలు చేపట్టడానికి వీలుగా ‘అడిట్‌’ టన్నెల్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రధాన సొరంగంలో (ఇన్‌లెట్‌ నుంచి) 14వ కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద కలిసేలా.. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా (హారిజాంటల్‌)గా ఈ ‘అడిట్‌’ టన్నెల్‌ను నిర్మించనుంది. ప్రధాన సొరంగంలోకి గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపునకు, మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఈ టన్నెల్‌ ఉండనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, ఇతర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా... ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్‌ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల పైకప్పు కుప్పకూలి, 8 మంది గల్లంతై ఇప్పటికి ఆరు రోజులు దాటింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు టన్నెల్‌ వద్దే ఉంటూ సహాయక చర్యలను, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్‌ నిర్మాణంలో నిష్ణాతులైన దేశ, విదేశీ నిపుణుల సూచనలు, ఇంజనీర్ల అభిప్రాయాలను పరిశీలించారు. ప్రపంచంలో టన్నెల్‌ ప్రమాదాలు చాలా జరిగినప్పటికీ.. ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన ప్రమాదం చాలా క్లిష్టమైనదని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ 14వ కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద అనుసంధానం అయ్యేలా భూఉపరితలం నుంచి ‘అడిట్‌’ సొరంగం నిర్మించాలని నిర్ణయించారు. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపు వంటివాటికి ఈ ‘అడిట్‌’ టన్నెల్‌ ఉపయోగపడుతుందని నిపుణులు సూచించడంతో.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. మరో మార్గం లేకపోవడంతో.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని భూమి ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. 43 కిలోమీటర్ల ఈ టన్నెల్‌లో ‘ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ ’ మినహా మధ్యలో ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. ప్రస్తుతం ప్రమాదం 13.9 కిలోమీటర్ల పాయింట్‌ వద్ద జరిగింది. ఇలాంటి సమయంలో మధ్యలో మరో మార్గం ఉంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. అయితే ఇక్కడ ఎక్కువ లోతు ఉండటంతో నిలువునా బావిలా సొరంగం తవ్వే అవకాశం లేదు, తవ్వినా ప్రయోజనం ఉండదని, కూలిపోయే అవకాశాలు ఎక్కువని తేల్చారు. ఈ క్రమంలో 14వ కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద కలిసేలా.. ఉపరితలంపై నుంచి ‘అడిట్‌’ టన్నెల్‌ను ఒక దారిలా నిర్మించాలని నిర్ణయించారు. నిపుణుల పర్యవేక్షణలో... ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనల కోసం టన్నెల్‌ నిర్మాణాల్లో నిపుణులైన ఇండియన్‌ ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తంలను మంత్రి ఉత్తమ్‌ ఎస్‌ఎల్‌బీసీ వద్దకు రప్పించారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసిన కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా ఈ ‘అడిట్‌’ సొరంగంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ‘అడిట్‌’ టన్నెల్‌ తవ్వడానికి అటవీ, పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదని... ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో భాగంగానే దీనిని నిర్మిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు పొందడం కష్టం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్‌ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్‌ క్యాంపు వద్ద విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బి.సంతోష్‌, ఇండియన్‌ ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఎన్‌జీఆర్‌ఏ, కాంట్రాక్టు సంస్థలు రాబిన్‌సన్, జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులు, నిపుణులు చేసిన సూచనలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం)తో తవ్వకాలు జరుపుతున్నప్పుడు పైకప్పు కూలడం, మట్టి, నీరు, ఇతర ఖనిజాలు పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘అడిట్‌’ సొరంగం నిర్మాణం జరపాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసం ఎంత ఖర్చయినా వెచ్చిస్తామని చెప్పారు. టన్నెల్‌ లోపల రెస్క్యూ ఆపరేషన్‌లో నిరంతరం వివిధ టీంలకు చెందిన 20 మంది నిపుణులు మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. టన్నెల్‌లో సిల్ట్‌ తొలగింపు, డీవాటరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని.. పనిచేయకుండా ఉన్న కన్వేయర్‌ బెల్టును వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం చేపట్టే రెస్క్యూ ఆపరేషన్‌ కీలకం కానుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 28 Feb 2025 In Telugu3
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: అమావాస్య ఉ.7.17 వరకు, తదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తె.5.30 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం: శతభిషం ప.3.05 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.9.10 నుండి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.43 నుండి 9.31 వరకు, తదుపరి ప.12.38 నుండి 1.26 వరకు, అమృత ఘడియలు: ఉ.8.10 నుండి 9.42 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01. మేషం.. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.వృషభం... దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక గుర్తింపు.మిథునం... ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశంకర్కాటకం.... మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.సింహం.... రుణభారాల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల నుంచి సాయం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కన్య.... దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.తుల... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారాలలో చాకచక్యం ప్రదర్శించడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పకపోవచ్చు.వృశ్చికం.... చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దూరర్రపయాణాలు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.ధనుస్సు... పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం.... సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.కుంభం... ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.మీనం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

West Bengal CM Mamata Banerjee Accuses BJP of Enrolling Fake Voters4
బెంగాల్‌ ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేశ్‌ కుమార్‌ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్‌లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్‌ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్‌లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్‌లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్‌ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు.

TDP Leaders of Misconduct in MLC Elections: Andhra pradesh5
దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు

కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలుకు నోచుకోకపోవడానికి తోడు డీఎస్సీ ప్రకటించక పోవడం, గ్రూప్‌–2 అభ్యర్థులతో ఆటలాడుకోవడం.. తదితర కారణాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దీంతో ఎలాగైనా సరే గెలవాలని సర్కారు పెద్దలు బరితెగించారు. వీరి కనుసైగతో పోలింగ్‌ బూత్‌లలోనే డబ్బులు పంచడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఏజెంట్లను తరిమేయడం మరో ఎత్తు. ఫలితంగా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని నయా సంస్కృతి ఇది.సాక్షి, అమరావతి/పిఠాపురం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, విశాఖపట్నం/గుంటూరు ఎడ్యుకేషన్‌ : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని రీతిలో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నించాయి.ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలు చోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్‌ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని 96, 97, 98 పోలింగ్‌ బూత్‌ల పక్కనే టీడీపీ నేతలు తిష్ట వేసి కూర్చున్నారు.ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. ‘డబ్బులు తీసుకోండి.. కూటమి అభ్యర్థికి ఓటు వేయండి’ అని కోరడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పక్కనే ఉన్న మున్సిపల్‌ కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌.. వచ్చిన ప్రతి ఓటరు వద్ద ఓటరు స్లిప్‌ తీసుకుని, సరి చూసి మరీ ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు.ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో కూడా ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు వారికి సమాచారం ఇచ్చి.. అక్కడికి వెళ్లారు. ఆలోపే టీడీపీ నేతలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అంటూ చెప్పుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ కావడం చర్చనీయాంశమైంది. పోలింగ్‌ బూత్‌కు అతి సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అని విమర్శలు వెల్లువెత్తాయి. లింగపాలెంలో దొంగ ఓట్లుఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు పసుపు చొక్కాలు వేసుకువచ్చి డబ్బులు పంపిణీ చేశారు. పీడీఎఫ్‌ ఏజెంట్లపై దాడి చేశారు. చివరి రెండు గంటల్లో దొంగ ఓట్లు వేయించారు. పెదవేగి బూత్‌ నంబర్‌ 327లో పీడీఎఫ్‌ ఏజెంట్‌ గేదెల శివకుమార్‌పై కూటమి అభ్యర్థులు దాడి చేశారు.లింగపాలెం మండలంలోని శింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 277, 278 బూత్‌లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. అక్కడ పీడీఎఫ్‌ ఏజెంట్‌ సూర్యకిరణ్‌ను బెదిరించి మొబైల్‌ లాక్కుని బయటకు గెంటేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను తీసుకుని చివరి నిమిషంలో ఓట్లు వేశారు. దీంతో మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 45.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా, సాయంత్రం 4 గంటలకు 69.50 శాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలో 24.21 శాతం ఓటింగ్‌ పెరిగిందంటే దొంగ ఓట్ల వల్లేనని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించారని దౌర్జన్యం.. దాడులుఓటమి భయంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు బాపట్ల జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చాలాచోట్ల పీడీఎఫ్‌ పోలింగ్‌ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్‌ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాపట్లలోని మున్సిపల్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేఛ్చగా దొంగ ఓట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పలుమార్లు పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం దొంగ ఓట్లు వేశారు. టీడీపీ మహిళా నేత పోలింగ్‌ కేంద్రంలో మకాంవేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి స్థానిక టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్‌ వారిని అడ్డుకున్నారు. పోలింగ్‌ సమయం ముగిశాక టీడీపీ వారిని లోపలికి ఎలా అనుమతిస్తారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు మరికొందరు కలిసి పీడీఎఫ్‌ నాయకుడు అనిల్‌కుమార్‌పై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. భట్టిప్రోలులో పీడీఎఫ్‌ ఏజెంట్‌ లింగం శ్రీనుపై టీడీపీ నాయకులు దాడిæచేసి కొట్టారు. కూటమి అభ్యర్థి ఆలపాటికి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను లింగం శ్రీను నిలదీశారు. దీంతో టీడీపీ వారు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు.చుండూరులో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. పీడీఎఫ్‌ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగు చేసేందుకు పలుమార్లు యత్నించారు. దీనిని పీడీఎఫ్‌ నేతలు అడ్డుకున్నారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, అడవులదీవి, రేపల్లె, వేమూరుతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పీడీఎఫ్‌ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని పీడీఎఫ్‌ నేతలు ఆరోపించారు.మా ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టారు: లక్ష్మణరావు కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. గురువారం పోలింగ్‌ ముగిసిన అనంతరం గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని, వెల్దుర్తిలో పీడీఎఫ్‌ తరఫున నియమించిన ఏజెంట్‌ను అనుమతించలేదని అన్నారు.దుర్గిలో ఏజెంట్‌ను బయటకు పంపడంతోపాటు బెల్లంకొండ ఏజెంట్‌ను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూత్‌లలోకి ప్రవేశించి, హడావుడి సృష్టించారని, చీఫ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మె ల్యేలకు బూత్‌లలోకి వెళ్లేందుకు ఎటువంటి అధికారం లేద న్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని అమలు పర్చిందని ఆరోపించారు.తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్‌ పాఠశాలతో పాటు అమరావతి, పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లకు తెగబడిందన్నారు. సాధారణంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్‌ నమోదు కావడం సహజమేనని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. పల్నాడులోని పలు బూత్‌లలో 90 శాతం పోలింగ్‌ జరిగినట్లు నమోదైతే, అది కచ్చితంగా దొంగ ఓట్లు వేయించినట్లేనని స్పష్టం చేశారు. పోలైన ఓట్లు, తదితర పూర్తి వివరాలు వచ్చిన తరువాత, రీ పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలురాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు 92.40 శాతంకుపైగా పోలింగ్‌ నమోదు కాగా, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28 శాతం, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58 శాతం పోలింగ్‌ నమోదైంది.నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించడానికి అనుమతించడంతో తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీలో అత్యధిక మంది ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు వేసే సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది, ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీలో ఉండటంతో అభ్యర్థులకు ప్రాధాన్యతా నంబర్లు కేటాయించి బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టి బ్యాలెట్‌ బ్యాక్స్‌లో వేయడానికి అయిదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంది.దీంతో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తి ఎదుట ప్రాధాన్య ఓటు సంఖ్య కాకుండా టిక్కులు పెట్టడంతో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నిరంతర పర్యవేక్షణపోలింగ్‌ సజావుగా నిర్వహించడానికి 6,287 మంది పోలీస్, 8,515 మంది పోలింగ్‌ సిబ్బందితో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్‌ వెబ్‌ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడమే కాకుండా సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. విజయవాడలోని పటమట హైస్కూల్, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.పోలింగ్‌ ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్‌ స్థానం బ్యాలెట్‌ బాక్సులను ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాల, కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్‌ బ్యాలెట్‌ బాక్సులను గుంటూరు ఏసీ కాలేజీ, శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల బ్యాలెట్‌ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పోలీస్‌ సిబ్బందితో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Trump threatens 25percent tariffs on EU6
ఈయూపై 25 శాతం సుంకాలు 

వాషింగ్టన్‌: అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)నూ తాకింది. ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యా యం జరుగుతోందని ఆరోపించారు. ‘‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్‌ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్‌ ఆరోపించారు. గట్టిగా బదులిస్తాం: ఈయూట్రంప్‌ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్‌ కమిషన్‌ దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వి వక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’’ అని కమిషన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. అమెరికా, ఈయూ ఉద్రిక్తతలురెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్‌ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్‌ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది!

India needs to ramp up bilateral relations for trade, investments7
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ముందడుగు

న్యూఢిల్లీ: భారత్‌ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్‌ మంథన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు. ‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్‌ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు.. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘‘మల్టీలేటరల్‌ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్‌ఎన్‌) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్‌ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి బ్రిటన్‌ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్‌ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్‌ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్‌ చెప్పారు. పోటీతత్వాన్ని పెంచుకోవాలి స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్‌ పిలుపు ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్‌ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు. ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్‌ గోయల్‌.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్‌ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్‌–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్‌కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్‌ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు.

Sakshi Guest Column On Telangana Govt Caste Census8
కుల గణన చర్చలో పస ఎంత?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన లెక్కల గురించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులు పెద్ద రాద్ధాంతం చేసే సమస్య... ముస్లిం ఓబీసీలు. ఇతరులు చర్చనీయాంశం చేసేది... ఓసీ కులాల సంఖ్య.56 ప్రశ్నలతో, వందలాది ఎనుమరేట ర్లతో 50 రోజులు చేయించిన సర్వే ఇది. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తించారు. అంటే ఒక్క ఎనుమరేటర్‌ ఆ బ్లాక్‌లో 50 రోజుల్లో ప్రశ్నావళిలో ఇచ్చిన కులాల పేర్ల ఆధారంగా 56 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. ప్రజల సంతకాలతో ప్రశ్నల చిన్న పుస్తకాన్ని కోడింగ్‌ సెంటర్లకు చేర్చారు. ఈ విధంగా తీసిన లెక్క లను, 4 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ లెక్కలను, 2014లో అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రోజులో ఇంటింటి సర్వే పేరుతో జరిపిన తంతుతో పోల్చి కొందరు చర్చల యుద్ధం చేస్తున్నారు.ముస్లింలను విస్మరిస్తారా?అందులో మొదటిది ఆనాటి లెక్కల్లో ముస్లింలంతా ఓసీలే. ఇప్పుడు 10.08 శాతం బీసీలు ఎట్లా అయ్యారు? ముస్లింల బీసీ–ఈ కులాల పేర్ల జాబితాను వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసింది! అందులో బీసీ–ఈ ముస్లింలను 14 గ్రూపులుగా విభజించి వారి కులాల పేర్లను లిస్టులో పొందుపర్చారు. అందులో అచ్చుకట్టలవాండ్లు, అత్తర్‌ సాయబులు, ధోభి ముస్లిమ్, ఫకీర్, బుడ్‌బుడ్కి, గుర్రాలవాళ్ళు, గోసంగి ముస్లింలు, నజావ్, నాయిలబ్బి, కటిక్, షేక్, సిద్ది, జింక సాయిబులు, తుర్క కాష వరకు దాదాపు 60 కులాలు ఉన్నాయి. వీరంతా వివిధ దశల్లో, ముఖ్యంగా తెలంగాణలో నిజాం కాలంలో ముస్లింలుగా మారి బతుకుదెరువు వెతుక్కున్నవారు. ఇందులో చాలా కులాలు ఆరెస్సెస్‌/బీజేపీ వారు హిందువులుగా గుర్తించి, బీసీ కులాల్లాగా కులవృత్తులతో జీవించిన వారు. భిక్షాటన సంస్కృతితో జీవించే కులాలు కూడా ఇందులో ఉన్నాయి. గుడ్డేలుగులను ఆడించేవాళ్లు, ఊబిది పొగవేస్తూ ఇండ్లు తిరిగేవాళ్లు, దర్గాల దగ్గర పీర్‌సాయబులుగా బతికేవాళ్లు ఉన్నారు. అందులో అతిపెద్ద కులం దూదేకులవాళ్లు. వీళ్లలో పింజారీలు కూడా ఒక భాగం. ఆంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాత బుర్రకథ యోధుడు నాజర్‌ ఈ కులానికి చెందిన సాంస్కృతిక సారథి. ఆయన జీవిత చరిత్ర ‘పింజారి’ చదివితే ఆయన ఎంత కిందిస్థాయి నుంచి ఎదిగాడో అర్థమౌతుంది. ఆయన తల్లి తిండిలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. బీజేపీ వాళ్లు రేపు ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేస్తే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ఈ ముస్లిం కులాల లిస్టును పక్కన పెట్టి మొత్తం వారిని ఓసీల్లో చూపిస్తారా? వారికిచ్చే 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో మోదీ, అమిత్‌ షా ఎన్నికల సమయంలో గొంతు చించుకొని మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్, కిషన్‌ రెడ్డి అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రచ్చ చేస్తారా? బతుకుదెరువు, విద్య లేని వారిని అభివృద్ధి చేయాల్సిన పథకాల్లో చేర్చకుండా వాళ్ళను ఆకలిచావులకు గురిచెయ్యాలా? మానవత్వ విలువలు కూడా ఈ దేశానికి లేకుండా చేద్దామా?ఈ జనగణనలో 2.48 శాతం ముస్లింలు ఓబీసీలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకోలేదు. వీరిలో పఠానులు, మొగలులు, షేక్‌లు, సయ్యద్‌లు ఉంటారు. వీళ్లు నిజాం కాలం నుండి ఫ్యూడల్, రాజరిక లక్షణాలతో బతుకుతున్నవాళ్లు. మత సమానత్వం మాట్లాడుతున్నప్పటికీ కుల అణచివేత, దోపిడీ ముస్లింలలో చాలా ఉంది. బీసీ ముస్లింలు తిరుగుబాటు చెయ్యకుండా, వారికి ఇంగ్లిష్‌ విద్య రాకుండా మతం ముసుగుతో ఈనాటికీ అణచివేస్తూనే ఉన్నారు. రాజ్యం వారిని విముక్తుల్ని చేసేందుకు రిజర్వేషన్లు, ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించాలి. ముస్లిమేతర బీసీ మేధావులు కూడా వారి రిజర్వేషన్‌కు అండగా నిలబడాల్సిన అవసరముంది.ఓసీల జనాభా ఎందుకు పెరిగింది?ఇక రెండో చర్చనీయాంశం ముస్లిమేతర బీసీలు 46.25 శాతమే ఎలా ఉంటారు? తెలంగాణలో ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారు అనేది బీసీ మేధావులు అడిగే ప్రశ్న. 2014 లెక్కల్లో టీఆర్‌ఎస్‌ ఓసీలు 7 శాతమన్నది కదా, ఇప్పుడు 13.31 శాతం ఎలా పెరిగిందని అడుగుతున్నారు. అసలు 2014 లెక్క పెద్ద బోగస్‌. ఒక్కరోజులో లెక్కలు తీశామని చెప్పి, బయటికి పర్సెంటేజీలు కూడా అధికారికంగా చెప్పలేదు. మొత్తం ముస్లింలను ఓసీలలో చూపించిన లెక్కల్లో బీసీ–ఈ కులాలు ఏమైనట్లు? ఈ విధంగా చర్చించడం బీజేపీని బలపర్చడమే. ఆనాడు టీఆర్‌ఎస్‌ బీజేపీలా వ్యవహరించింది.తెలంగాణలో మొత్తం బీసీలు 46.25 శాతం మాత్రమే ఉంటారా అనేది ఎలా చూడాలి? 1931 జనాభా లెక్కల తరువాత తెలంగాణలో మొదటి కులగణన ఇది. 1931 నాటి లెక్కల అంచనా గానీ, టీఆర్‌ఎస్‌ 2014 లెక్కలు గానీ ఇప్పుడు చూడలేము. ఈ లెక్క తçప్పు అని చెప్ప డానికి ఆధారం ఏంది? కొన్ని దశాబ్దాలుగా కుల నాయకులు, మేధా వులు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కులాల లెక్కలు విడుదల అయ్యాక కూడా ‘మా కులం గింతేనా?’ అని వాదించడం ఉంటుంది. 1980 దశకంలో మండల్‌ కమిషన్‌ దేశంలోని అన్ని శూద్ర కులాలను... రెడ్డి, వెలమ, కమ్మ, కాపులతో సహా – 52 శాతం ఓబీసీలు అని అంచనా వేసింది. ఇప్పుడు రిజర్వేషన్‌ బయట ఉన్న ముస్లిమేతర ఓసీ కులాలు 13.31 శాతం. అయితే ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా అయ్యారు అనేది కొందరి ప్రశ్న. అసలు సరిగ్గా వాళ్ళది 7 శాతమే ఉండింది అని పూర్తి సర్వే ఎవరు చేశారు? అదొక ఊహాజనిత సంఖ్య. టీఆర్‌ఎస్‌ సర్వే, సర్వే కాదు.ఇకపోతే 2014 నుండి 2025 నాటికి హైదరాబాద్‌కు బయట రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఓసీ కులాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 31వ పేజీలో అయ్యర్‌/అయ్యంగార్‌ నుండి మొదలుకొని వెలమల వరకు అక్షరక్రమంలో 18 కులాల పేర్ల ద్వారా ఎనుమరేషన్‌ జరిగింది. 2014 ఒక్క రోజు లెక్కల డ్రామాలో కులాల పేర్లు అడుగలేదు. ఎనుమరేటర్లకు కులాల పేర్ల లిస్టు ఇవ్వ లేదు. అలాంటిది ఒక జాతీయ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసు కొని జనాభా లెక్కలు తీయిస్తే బీసీ మేధావులే ఇది బూటకపు లెక్క అని ప్రచారం చేస్తే ఎవ్వరికి మేలు జరుగుతుంది? అసలు 2021 నుండి ఇప్పటి వరకు దేశ జనాభా లెక్కలే చెయ్యని బీజేపీకి లాభం చెయ్యడానికే ఈ వాదనంతా పనికొస్తుంది. ఒకవేళ కోర్టుపై ఒత్తిడి తెచ్చి కులజనాభా లెక్కలు తీయిస్తే ఆ లెక్కలను, ఈ లెక్కలను పోల్చి చూడవచ్చు. ముందు తెలంగాణ కులగణన ఆధారంగా కేంద్రం మీద కదా ఒత్తిడి చేయాల్సింది! బీసీల కోసమే చేసిన ఈ కులగణనను తామే నిర్వీర్యం చెయ్యడం సరైంది కాదు.ఈ లెక్కల ఆధారంగా ఆర్థిక రంగంలో, కాంట్రాక్టుల్లో, నిధుల కేటాయింపుల్లో, లోకల్‌ బాడీల్లో వాటా కావాలి అని అడగటం సమంజసం. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశంలోనే రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయరేటును పెంచడం అనే సిద్ధాంత పోరాటంలో భాగంగా చేసింది. ఇది అన్నింటికంటే కీలకం!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

YS Jagan Reaction On Posani Arrest9
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్‌ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్‌ జగన్‌(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్‌.. అసలు జరిగింది ఇదే!

Royal Challengers Bangalore lose their third consecutive match10
మళ్లీ ఓడిన బెంగళూరు

బెంగళూరు: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి విజయాలు అందుకున్న ఆర్‌సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది. మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్‌ జెయింట్స్‌ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్‌ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...రాఘ్వీ బిస్త్‌ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌), జార్జియా వేర్‌హామ్‌ (21 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. గుజరాత్‌ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్‌ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్‌ ఆష్లీ గార్డ్‌నర్‌ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (21 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్‌–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్‌ (4) విఫలం కాగా... ఎలైస్‌ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్‌కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్‌ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్‌ డియోల్‌ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్‌నర్, లిచ్‌ఫీల్డ్‌ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్‌ ఓవర్లో గార్డ్‌నర్‌ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలురాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: స్మృతి (సి) హర్లీన్‌ (బి) తనూజ 10; డానీ వ్యాట్‌ (ఎల్బీ) (బి) డాటిన్‌ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్‌నర్‌ 0; రాఘ్వీ (రనౌట్‌) 22; కనిక (సి అండ్‌ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్‌హామ్‌ (నాటౌట్‌) 20; గార్త్‌ (సి) మూనీ (బి) డాటిన్‌ 14; స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్‌: డాటిన్‌ 4–0–31–2, ఆష్లీ గార్డ్‌నర్‌ 4–0–22–1, కాశ్వీ గౌతమ్‌ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0. గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) వేర్‌హామ్‌ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్‌) రిచా (బి) రేణుక 11; హర్లీన్‌ (సి) పెరీ (బి) వేర్‌హామ్‌ 5; గార్డ్‌నర్‌ (సి అండ్‌ బి) వేర్‌హామ్‌ 58; లిచ్‌ఫీల్డ్‌ (నాటౌట్‌) 30; డాటిన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 4–0–24–2, కిమ్‌ గార్త్‌ 2–3.–0–19–0, స్నేహ్‌ రాణా 4–0–23–0, ప్రేమ రావత్‌ 1–0–19–0, వేర్‌హామ్‌ 3–0–26–2, ఎలైస్‌ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుఢిల్లీ క్యాపిటల్స్‌ X ముంబై ఇండియన్స్‌రాత్రి గం. 7:30 స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Advertisement

వీడియోలు

Advertisement