ముహూర్తం ఖరారు
నేడు ప్రారంభం కానున్న ముంబెమైట్రో సేవలు
సాక్షి, ముంబై: నగరవాసులకు అత్యాధునిక ప్రయాణసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని గంటలే మిగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముంబై మెట్రోరైలు సేవలు ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10.30 గంటలకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం నుంచి ప్రయాణికులను అనుమతిస్తారని మెట్రోప్రాజెక్టు సీఈవో అభయ్ మిశ్రా తెలిపారు. భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అత్యాధునిక సదుపాయాలతో సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో అన్నివిధాలా సిద్ధంగా ఉందన్నారు. ఈ సేవలు ప్రారంభమైతే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని చెప్పారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో సుమారు 45 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి.
ప్రయాణ సమయంతోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఆగుతూ వస్తే కనీసం రెండున్నర గంటలకుపైగానే సమయం అవసరమవుతోంది. మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే 90 నుంచి 120 సమయం ఆదా అవుతుంది. దీంతోపాటు బస్సు, ఆటో, ట్యాక్సీ చార్జీలతో పోలిస్తే మెట్రో చార్జీలు చాలా తక్కువ. దీంతో ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ఉదయం 5.30 గంటల నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయి. రాత్రి 12.00 వరకు కొనసాగుతాయి. ప్రతి 15 నిమిషాలకో రైలు చొప్పున మొత్తం 16 రైళ్లు సేవలందిస్తాయి.
ఒక్కో బోగీలో 350 మంది కూర్చుండే సామర్థ్యం ఉండగా ఒక రైలుకు నాలుగు బోగీలుంటాయి. దీంతో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే అవకాశముంది. ఇలా 16 రైళ్లు రోజుకు లక్షల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి.
ముఖ్యాంశాలు
పేరు: ముంబై మెట్రోలైన్ ఏ-1 మార్గం
ప్రారంభం: ఉదయం 10.30 గంటలకు
వాణిజ్య సేవలు: మధ్యాహ్నం 12.00 గంటల నుంచి
దూరం: వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు 11.40 కిలోమీటర్లు
స్టేషన్లు: వర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్‌నగర్, అంధేరి, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, చకాల, ఎయిర్‌పోర్టు రోడ్, మరోల్, సకినాకా, అసల్ఫా, జాగృతినగర్, ఘాట్కోపర్
సేవలు: ఉయదం 5.30 గంట నుంచి రాత్రి 12.00 వరకు
వేగం: గంటకు 80 కిలోమీటర్ల వేగంతో..
ప్రయాణికుల సామర్థ్యం: సేవలందించనున్న 16 రైళ్లలో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే సామర్థ్యముంది.
ఫ్రీక్వెన్సీ: ప్రతి 15 నిమిషాలకో రైలు