Aginkya Rahane
-
ఐపీఎల్ ఒకప్పటిలా జరగకపోవచ్చు..
ముంబై: ఈ సారి బయో బబుల్‌లో జరిగే ఐపీఎల్ ఆటగాళ్లకు భిన్నమైన సవాల్ అని ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, భారత క్రికెటర్ అజింక్య రహానే అన్నాడు. ‘సందేహం లేదు. ఈ సీజన్ ప్రతి ఒక్కరికి విభిన్నమైంది. పెను సవాళ్లు ఎదురవుతాయి. నేను కొన్నాళ్లుగా శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక స్థైర్యంపై కూడా కసరత్తులు చేశాను. ముఖ్యంగా నెలల పాటు కుటుంబ సభ్యులతోనే గడపడం ద్వారా నాలో సానుకూల దృక్పథం పెరిగింది’ అని అన్నాడు. ఇతని సహచరుడు, యువ ఆటగాడు పృథ్వీ షా మాట్లాడుతూ నాలుగైదు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితమైన తమకు ఈ మహమ్మారి వల్ల ఏం చేయాలి, ఏం చేయకూడదోనన్న సంపూర్ణ అవగాహన ఉందని, దీంతో ఇతరత్రా ఆలోచనలు లేకుండా ఆటపైనే దృష్టి పెట్టే మానసిక సత్తా ఉందని అన్నాడు. (ఐపీఎల్ సందడి షురూ...) మునుపటిలా ఉండదు: దినేశ్ కార్తీక్ దుబాయ్: ఐపీఎల్ ఒకప్పటిలా జరగకపోవచ్చు కానీ... ఎప్పటిలాగే అభిమానుల్ని అలరించడం మాత్రం పక్కా అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆట సవాలుతో కూడుకున్నది. అందుకే ఈ ఐపీఎల్ మునుపటి సీజన్లు జరిగినట్లుగా ఉండదు. కచ్చితంగా భిన్నంగానే ఉంటుంది. అయితే ఆట మొదలుపెడితే అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాం. జీవ రక్షణ వలయం (బయో బబుల్)లో ఆడటం కొత్త. ఇలా మనం వెళ్లే దారిలో సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్నింటిని అధిగమిస్తాం, రాణిస్తాం’ అని అన్నాడు. (ఐపీఎల్ క్వారంటైన్: బాల్కనీలో బాతాఖానీ...) -
అఫ్ఘానిస్థాన్‌పై భారత్ సునాయాస గెలుపు
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(60), అజింక్య రహానే(56) అర్థ సెంచరీలతో విజయానికి బాటలు వేశారు. రోహిత్ శర్మ 18, దినేష్ కార్తీక్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 45.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటయింది. అఫ్ఘాన్ ఆటగాళ్లలో షెన్వారీ 50, నూర్ అలీ జాడ్రాన్ 31, షహజాద్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడొట్టారు. అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు. జడేజా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
రహానే తొలి టెస్టు సెంచరీ మిస్
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు అజింక్య రహానే కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. నాలుగు పరుగుల తేడాతో తొలి టెస్టు శతకం చేజార్చుకున్నాడు. 96 పరుగులు చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటయింది. రహానే ఒక్కడే రాణించాడు. ఒక్కపక్క వికెట్లు పడుతున్నా తాను మాత్రం సంయమనం కోల్పోకుండా ఆడాడు. 96 పరుగుల వద్ద చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. ధావన్ 19, విజయ్ 6, పూజారా 32, కోహ్లి 11, రోహిత్ శర్మ 25, ధోని 15, జడేజా 8, జహీర్ ఖాన్ 3 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ రహానే రాణించాడు. 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.