2న విశాఖ ఏజెన్సీలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విమానంలో జగన్ విశాఖ చేరుకుని నేరుగా రోడ్డు మార్గంలో చింతపల్లి వెళ్లి బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభలో పాల్గొంటారని, బహిరంగ సభ అనంతరం లంబసింగిలో గిరిజనులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి వారితో నేరుగా మాట్లాడతారని వివరించారు.
ఉద్యమం ఉధృతానికి వైఎస్సార్సీపీ బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం
బాక్సైట్ జోలికి భవిష్యత్తులో ప్రభుత్వం రాకుండా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానించింది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులతో పాటు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లు సభ్యులుగా ఏర్పడిన కమిటీ ఆదివారం విశాఖలో తొలిసారి సమావేశమైంది. బాక్సైట్ ఉద్యమ కార్యచరణపై చర్చించారు.