consumersday
-
నిగ్గదీసి అడుగు..
సాక్షి, ఖమ్మం: డబ్బులు పెట్టి వస్తువు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు నాణ్యత లేనివి అంటగడితే..మోసం చేస్తే..ఆర్థికంగా నష్ట పరిస్తే..వినియోగదారుల పక్షాన వినియోగదారుల రక్షణ చట్టం అండగా నిలుస్తుంది. నిగ్గదీసి అడిగేలా..లబ్ధి చేకూర్చేలా చేస్తుంది. వస్తువులను కొనేవారు, వినియోగించేవారు, కిరాయివారు, వస్తువుల వల్ల లబ్ధి పొందే వారంతా వినియోగదారులే. ఈ చట్టం అన్ని రకాల వస్తువులు, సేవలకు వర్తిస్తుంది. హక్కులను పూర్తిస్థాయిలో పొందేందుకు, నష్ట పరిహారం తీసుకునేందుకు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. వ్యాపారులు..వస్తువులు, సేవల గురించి సక్రమమైన సమాచారాన్ని అందించకున్నా, నాణ్యతలేని వస్తువులను ఇచ్చినా, కొత్త వస్తువు కోసం, నష్ట పరిహారం కోసం ఫోరంను ఆశ్రయించవచ్చు. చౌకబారు, నాణ్యతలేని వస్తువులను ఉత్పత్తి చేయకుండా, దొంగ వ్యాపారాన్ని అరికట్టేందుకు, డూప్లికేట్ సరుకు రాకుండా, అధిక ధరల అమ్మకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. బాధితులు జిల్లా వినియోగదారుల ఫోరంలో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. వస్తువు ధరను బట్టి రూ.20లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో..అంతకుమించి అయితే..రాష్ట్ర ఫోరం పరిధిలోకి వస్తుంది. ఫిర్యాదులు ఎప్పుడు చేయాలంటే? ⇔ కొన్న వస్తువులు పాడైనప్పుడు ⇔ డూప్లికేట్ది అంటగట్టినప్పుడు ⇔ ఆశించిన రీతిలో వస్తువు లేనప్పుడు ⇔ కొన్ని విభాగాల్లో లోపాలున్నప్పుడు ⇔ అధిక ధర వసూలు చేసినప్పుడు ⇔ సదరు వ్యాపారి సరిగ్గా స్పందించనప్పుడు ⇔ ఫోరం తేల్చి..వినియోగదారుడికి న్యాయం జరిగేలా చూస్తుంది ⇔ లేదంటే జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తుంది హక్కులకు భద్రత.. చట్ట సవరణ బిల్లు ద్వారా..హక్కులకు అధిక భద్రత లభించనుంది. తగిన రశీదులతో సంప్రదిస్తే కచ్చితంగా నష్ట పరిహారం పొందవచ్చు. వివరాలు స్పష్టంగా ఉండాలి. – పి.మాధవ్రాజా, వినియోగదారుల ఫోరం, జిల్లా చైర్మన్ రశీదులు పొందాలి.. ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారుల నుంచి రైతులు రశీదులు కొనాలి. ఫోరంను ఆశ్రయించడానికి రశీదులు తప్పనిసరి. న్యాయసేవాసంస్థ ద్వారా చైతన్యం కల్పిస్తూనే ఉన్నాం. – వినోద్‌కుమార్, న్యాయసేవాసంస్థ కార్యదర్శి మోసపోవద్దనే చట్టం.. వ్యాపారస్తుల చేతిలో వినియోగదారుడు మోస పోవద్దనే..రక్షణ చట్టాన్ని రూపొందించారు. మోసాలను వేలెత్తి చూపి..అడగగలగాలి. ఫోరంను ఆశ్రయించాలి. – రేణిగుంట ఉపేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ -
29న కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం
–నేడు 13 జిల్లాల విద్యార్థులుకు రిడ్జ్ స్కూల్లో పోటీ పరీక్షలు –రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హజరు కానున్న మంత్రి పరటాల సునీత కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29న కర్నూలులో నిర్వహించనున్నారు. ప్రతి యేటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేస్తుంది. జిల్లా స్థాయిలో ఈ నెల 24నే ఈ దినోత్సవం పూర్తయింది. రాష్ట్ర స్థాయి వేడుకలను కర్నూలులోనే ఈ నెల 29న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకోసం రూ.5.50 లక్షలు విడుదల చేసింది. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 13 జిల్లాలకు చెందిన హైస్కూల్, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు 28న అంటే బుధవారం కర్నూలు శివారులోని డోన్ రోడ్డులో ఉన్న లక్ష్మిపురం రిడ్జ్ స్కూల్లో నిర్వహించనున్నారు. దూరప్రాంతాల నుంచి విద్యార్థులు రావడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం తర్వాత పోటీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష రాయడంతో పాటు రాత్రికి అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో మొదటి స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు హాజరవుతారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 13 జిల్లాల నుంచి 150 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరువుతారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గెలుపొందిన వారికి రూ.7వేలు, ద్వితీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.5వేలు, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.4వేలు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందిస్తారు. పౌరసరఫరాల శాఖ మంత్రి రాక.... ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరటాల సునీత హాజరు కానున్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, డైరెక్టర్ రవిబాబు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షులు నౌషద్ అలీ.. 13 జిల్లాల డీఎస్ఓలు, వినియోగదారుల సంఘాల రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొంటారు.