అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అమలుకు ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల అధికారులు విధిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్ ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరైనా అందించలేదని ఆస్పరి మండల రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చౌకదుకాణాల్లో కిరోసిన్ నిలిపేశారని, ఇకపై కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చిప్పగిరికి చెందిన కొందరు ఫోన్ ద్వారా కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.