‘ఐసిస్’ చికెన్ వ్యాపారం
కైరో: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తీవ్రవాద సంస్థ ఐసిస్ లిబియాలోని సిర్త్ నగరంలో చాలా తక్కువ ధరలకు కోడి పిల్లలు, గుడ్లు అమ్ముతోందని ఓ మీడియా నివేదిక తెలిపింది. ఐసిస్ సిర్త్ను ఆక్రమించుకున్నపుడు ఆ ప్రాంతంలోని కోళ్ల ఫారాలు, ఇతర ఆస్తులను స్వాధీనపరుచుకుంది. ప్రజలపై అద్దెలు, పన్నులు కూడా విధించింది. ఐసిస్ తీవ్రవాదులు ముఖానికి నల్ల గుడ్డ కట్టుకుని కేవలం రెండు దినార్లకే కోడి పిల్లలు,గుడ్లు అమ్ముతున్నారని స్థానికులు చెబుతున్నారు.
సొంత దుకాణాలు కలిగిన యజమానుల నుంచి కూడా ఐసిస్ బలవంతంగా అద్దెలు వసూలు చేస్తోంది. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ సేవల కింద ప్రజల నుంచి వారానికి 10 లిబియన్ దినార్లను డిమాండ్ చేస్తోంది. సిర్త నగర తీరానికి సమీపంలోని బీచ్ అపార్టుమెంట్లలో నివసించే ప్రజల నుంచి కూడా ఐసిస్ అద్దెలను అడుగుతోంది. ఈ అపార్టుమెంట్లు మాజీ అధ్యక్షుడు గడాఫీకి చెందినవిగా భావిస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతంలోని సహజ వనరులు, పురాతన వస్తువులు, లైంగిక బానిసలను అమ్మడం తదితరాల ద్వారా ఐసిస్ కొంత కాలంగా ఆదాయం ఆర్జిస్తోంది. ఆర్థిక వనరుల అభివృద్ధికి గడాఫీ కాలం నాటి కరె న్సీ నోట్లను పునరుద్ధరించారు.