Divya Darshanam scheme
-
పేద భక్తులకు దివ్యదర్శనం కరువేనా ?
పలమనేరు: రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఆర్థికస్థోమత లేని పేద భక్తులకోసం ప్రభుత్వం దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన దివ్యదర్శనం కార్యక్రమం పలమనేరులో అభాసుపాలైంది. అధికారులు దీనిపై సరైన ప్రచారం చేపట్టపోవడంతో ఆఖరిరోజు అందుబాటులో ఉన్నవారిని మాత్రం పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు. ఎన్నో ఆశలతో ఆలయం వద్దకొచ్చిన పేద భక్తులు చేసేదిలేక వెనుదిరిగారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి నెలా ఓ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆసక్తిగలవారు తమ ఆధార్ కార్డు ను స్థానిక ఈఓ కార్యాయంలో అందించి దరఖా స్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ని నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కాణిపాకం, తిరుపతి, తిరుమల, జొన్నవాడ, పెద్దకాకాని, విజ యవాడ, అమరావతి, సింగరాయకొండ, శ్రీకాళహస్తి దేవాలయాలకు అధికారులకు ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తారు. అయితే ఈ కార్యక్రమంపై దేవా దాయ శాఖ అధికారులు సరైన ప్రచారం చేపట్ట లేదు. మంగళవారం ఉదయం స్థానిక శివాలయం నుంచి నాలుగు బస్సులు బయలుదేరాయి. ఇందులో మండలంలోని గ్రామాలకు చెందిన వారిని కాకుండా ఆర్థికంగా డబ్బులున్న పట్టణ వాసులను ఎక్కువగా అప్పటికప్పుడు పిలిపించి తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారితీసింది. ఏదో రూపంలో సమాచారంఅందుకుని ఆలయం వద్దకొచ్చిన పేదభక్తులు తాము వస్తామని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో తాము దివ్యదర్శనానికి నోచుకోకుండా పోయామని పలువురు భక్తులు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక దేవాదాయ శాఖ ఈఓ రమణను వివరణ కోరగా, ఆన్లైన్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి తామేమీ చేయలేమన్నారు. ఈ కార్యక్రమం రెండేళ్లుగా సాగుతోందని ప్రతినెలా ఓ మండలవాసులను ఆలయాలకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఇకపై మరింత ఎక్కువగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
దివ్య దర్శనం పథకాన్ని ప్రారంభించిన సీఎం
విజయవాడ: వివిధ ఆలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా అందే ఆదాయంతో నిరుపేదలకు ఉచిత తిరుమల దర్శనం కల్పించే దివ్యదర్శనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ పథకంలో ఒక్కో మండలం నుంచి ఒకే విడతలో 200 మంది చొప్పున రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని భక్తులకు ఉచిత తిరుమల దర్శన భాగ్యం కల్పిస్తారు. విజయవాడ నగర, రూరల్ మండలానికి చెందిన 167 మంది భక్తులతో బయలుదేరే బస్సులను ముఖ్యమంత్రి దుర్గ గుడి సమీపంలోని దుర్గాఘాట్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. భక్తులతో బస్సులు తిరుమలకు బయలుదేరాయి. తొలిరోజు ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ దర్శనంతో యాత్ర మొదలైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకుంటారు. రెండోరోజు తిరుచానూరు అమ్మవారి దర్శనానంతరం తిరుమలకు చేరుకుంటారు. మూడవ రోజు ఒంటిమిట్ట ఆలయంతో పాటు శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుంటారు. నాల్గవ రోజు త్రిపురాంతకం ఆలయ దర్శనం చేసుకుని విజయవాడకు చేరుకుంటారని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. -
ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం
హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లడానికి ఏపీ దేవాదాయ శాఖ కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 'దివ్యదర్శనం' పథకం విధివిధానాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం గరిష్టంగా ఇంటికి ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. మూడు ఏళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్లవచ్చు. హిందూమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారినే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు. అగ్ర కులాల్లో తెల్లకార్డులున్నవారిని, అదీ 70 ఏళ్ల లోపు వారే అర్హులు. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా ఏడాదికి పదివేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత తిరుమల యాత్ర 4-5 రోజుల పాటు ఉండేలా.. తిరుమల యాత్రతో పాటు మార్గమధ్యంలో నాలుగు ప్రధాన ఆలయాల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికయ్యే ఖర్చును టీటీడీ నిధులతో పాటు రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల ఆదాయం నుంచి ఖర్చు చేస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్దిదారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి దేవాదాయ కమిషనర్ చర్యలు చేపడతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.