విశాఖ ఏజెన్సీలో కాల్పుల కలకలం
గూడెంకొత్తవీధి : విశాఖ ఏజెన్సీ మండల కేంద్రం జీకే వీధికి సమీపంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేకెత్తించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండలంలోని చెరుకుంపాకలు గ్రామానికి చెందిన పాంగి సన్నిబాబు, ముల్లే దంపతులు, గెమ్మెలి కామేశ్వరరావు, సీమ, మరో ఇద్దరు దంపతులు, వంతల రామారావు, తాలేష్, దొరబాబు, మరో కుటుంబానికి చెందిన వారిపై ప్రత్యేక పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. చెరుకుంపాకలు డీఆర్‌డిపోలో శుక్రవారం ఉదయం కిరోసిన్ తీసుకుని వీరంతా జీకేవీధిగుండా నడుస్తూ వస్తుండగా తీముమబంద సమీపంలో ప్రత్యేక పోలీసు బలగాలు తారసపడ్డాయి.
ముసుగులు ధరించి టాటాసుమోలో వచ్చిన వీరు ‘మీ ఊరేమిటి’ అంటూ గిరిజనులను ఆరా తీసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గిరిజనులు జీకేవీధికి వచ్చేసరికి వారంతా తమ వాహనం తలుపులు తెరిచి పట్టుకునేందుకు యత్నించారు. ఏజెన్సీలో మనుషులను ఎత్తుకుపోతున్నారనే వదంతుల నేపథ్యంలో చెరకుంపాకలు వాసులు అడవిలోకి పరుగులు తీశారు. దీంతో వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని భావించిన పోలీసులు పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నేపథ ్యంలో ఎవరికీ ఏమీకాకపోయినప్పటికీ అంతా చెల్లా చెదురయ్యారు. కాగా ఇద్దరు మహిళల ఆచూకీ గల్లంతైందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చంటూ గిరిజనులు వాపోతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనూహ్యంగా జరిగింది: ఎస్పీ
కాల్పుల ఘటనను ఎస్పీ కోయ ప్రవీణ్ వద్ద ప్రస్తావించగా ‘సీఆర్పీఎఫ్, స్పెషల్‌పార్టీ పోలీసులు గిరిజనులపై కాల్పులు జరిపారు. వ్యాపారుల వద్ద నుంచి నగదు తీసుకునేందుకు కుంకంపూడి నుంచి జీకేవీధికి మావోయిస్టులు వస్తున్నట్టు సమాచారం అందింది. అయితే కాల్పులు మాత్రం అనూహ ్యంగా జరిగాయి’ అని వివరించారు.